భాగమతి.. సర్ప్రైజా.. షాకా?

Update: 2018-01-28 00:09 GMT
భారీ అంచనాల మధ్య ‘భాగమతి’ మొన్ననే ప్రేక్షకుల ముందుకొచ్చింది సంక్రాంతికి వచ్చిన భారీ చిత్రాలు నిరాశకు గురి చేసిన నేపథ్యంలో ఈ సినిమా మీదే అందరి దృష్టీ నిలిచింది. టాలీవుడ్ ఫస్ట్ బ్లాక్‌ బస్టర్  ఇదే అవుతుందని ఆశించారు. ఈ సినిమాకు టాక్ పర్వాలేదు కానీ.. బ్లాక్‌ బస్టర్ రేంజిలో అయితే లేదు. ఈ సినిమా విషయంలో దర్శక నిర్మాతల ప్రయత్నం కనిపిస్తుంది కానీ.. ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్లుగా దీన్ని తీర్చిదిద్దలేకపోయారు.

‘పిల్ల జమీందార్’ ఫేమ్ జి.అశోక్ తన గత రెండు సినిమాలతో పోలిస్తే ఈ చిత్రాన్ని మెరుగ్గా తీర్చిదిద్దాడు. కథను కొత్తగా రాసుకున్నాడు. అందులో అనేక మలుపులు పెట్టుకున్నాడు. ఈ చిత్రాన్ని ఉన్నత స్థాయి నిర్మాణ విలువలతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దడంలో యువి క్రియేషన్స్ వాళ్ల ప్రమాణాలు కూడా కనిపిస్తాయి. ఇక అనుష్క తన పెర్ఫామెన్స్‌ తో.. సాంకేతిక నిపుణులు తమ ప్రతిభతో సినిమాను నిలబెట్టడానికి తమ వంతుగా గొప్ప ప్రయత్నమే చేశారు.

ఐతే అన్నీ ఉన్నప్పటికీ ‘భాగమతి’ ప్రేక్షకుల్ని రంజింపజేయలేకపోవడానికి ఇది అంచనాలకు భిన్నంగా ఉండటమే. ఈ చిత్ర టీజర్.. ట్రైలర్ చూసి ఇది ఒళ్లు గగుర్పొడిచేలా చేసే హార్రర్ మూవీ అనుకున్నారు. నిజానికి సినిమాలో ప్రథమార్ధం వరకు హార్రర్ అంశాలకు లోటు లేదు. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాంగ్ దగ్గర సినిమా పీక్స్ అందుకుని.. ద్వితీయార్ధంలపై అంచనాలు పెంచేసింది. ఐతే సెకండాఫ్ లో ప్రేక్షకుల అంచనాలకు అందని విధంగా సాగుతుందీ సినిమా. రెండో అర్ధం చూశాక ఒక టికెట్‌ పై రెండు సినిమాలు చూసిన భావన  కలిగిస్తుంది.

ప్రేక్షకుల అంచనాలకు భిన్నంగా సర్ప్రైజ్ చేద్దామని చూశారు కానీ.. అది సర్ప్రైజ్ లాగా కాకుండా షాక్ లాగా మారింది. హార్రర్ జానర్ నుంచి పొలిటికల్ థ్రిల్లర్ జానర్లోకి మారి చాలా మామూలుగా  ముగుస్తుంది ‘భాగమతి’. ట్విస్ట్ వరకు కొత్తగా అనిపించినప్పటికీ.. ఆ తర్వాతి వ్యవహారం మాత్రం రొటీన్ అయిపోయి ఒక సగటు సినిమాలా ముగిసింది ‘భాగమతి’. మరి ఈ సినిమాను ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో.. అంతిమంగా ఎలాంటి  ఫలితాన్ని కట్టబెడతారో చూడాలి.
Tags:    

Similar News