50 సినిమాల‌కు చేరువ‌లో అనుష్క శెట్టి

Update: 2022-12-17 03:47 GMT
స్వీటీ అనుష్క శెట్టిని పెద్ద తెర‌పై చూసి ఇప్ప‌టికే చాలా కాల‌మైంది. త‌న పునః ప్ర‌వేశం కోసం అభిమానులు ఎంతో ఆత్రంగా వేచి చూస్తున్నారు. బాహుబ‌లి స‌మ‌యంలోనే 'సైజ్ జీరో'లో న‌టించిన అనుష్క ఆ త‌ర్వాత అధిక బ‌రువు సంబంధ స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంది. త‌ర్వాత‌ 'భాగ‌మ‌తి' రూపంలో ఒక‌ బంప‌ర్ హిట్ కొట్టింది. కానీ అటుపై నిశ్శ‌బ్ధం లాంటి ప్ర‌యోగం చేసి ఫ్లాప్ ని అందుకోవ‌డం తీవ్రంగా నిరాశ‌ప‌రిచింది. ఇటీవ‌ల స్వీటీ చాలా కాలంగా సైలెంట్ గా ఉంది.

ఏడాది క్రిత‌మే యువి క్రియేష‌న్స్ లో ఓ చిత్రంలో నటించ‌నుంద‌ని క‌థ‌నాలొచ్చాయి. ఏజెంట్ ఆత్రేయ ఫేం నవీన్ పోలిశెట్టి స‌ర‌స‌న అనుష్క న‌టించ‌నుంద‌ని ఇప్పటికే షూటింగ్ జరుపుకుంటుందని పుకార్లు వ‌చ్చినా కానీ ఇప్ప‌టివ‌ర‌కూ అనుష్క సెట్స్ కి వ‌చ్చిన జాడ క‌నిపించ‌లేదు.

త‌న‌కంటే పెద్ద‌ది.. న‌డి వ‌య‌స్కురాలైన యువ‌తితో ప్రేమ‌లో ప‌డే యువ‌కుడి క‌థ‌ను తెర‌పై చూపిస్తున్నార‌ని ఇందులో అనుష్క మాస్ట‌ర్ చెఫ్ గా క‌నిపించ‌నుంద‌ని టాక్ వినిపించింది. కానీ ఇప్ప‌టివ‌ర‌కూ ఈ సినిమాకి సంబంధించి ఎలాంటి అధికారిక స‌మాచారం రాలేదు.

ఎట్ట‌కేల‌కు #అనుష్క 48 చిత్రీక‌ర‌ణ‌లో చేరాన‌ని  స్వీటీ స్వ‌యంగా ధృవీక‌రించింది. సాధ్య‌మైనంత త్వ‌ర‌గా చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేస్తాన‌ని కూడా తెలిపింది. ప్ర‌స్తుతం అనుష్క పూర్తి ఫిట్ నెస్ తో తిరిగి వచ్చింది. ఇక‌పై ఇత‌ర స్టార్ హీరోయిన్ల మాదిరిగానే వ‌రుస చిత్రాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేందుకు సిద్ధ‌మ‌వుతోంద‌ని టాక్ వినిపిస్తోంది.

అయితే ఇటీవ‌లి గ్యాప్ న‌కు కార‌ణ‌మేమిట‌న్న‌ది తెలియ‌రాలేదు. అనుష్క‌కు బ‌రువు సంబంధిత స‌మ‌స్య‌లు ఉత్ప‌న్న‌మ‌య్యాయ‌ని దీనికి విదేశాల్లో స‌హ‌జ‌సిద్ధ‌మైన చికిత్స‌ను ఆశ్ర‌యించింద‌ని క‌థ‌నాలొచ్చాయి. అలాగే వ‌య‌సు 35 బార్డ‌ర్ లో ఉన్నందున స్వీటీకి పెళ్లి చేయాల‌ని ఇంట్లో ఒత్తిడి తెచ్చార‌ని కూడా క‌థ‌నాలు వైర‌ల్ అయ్యాయి. కార‌ణం ఏదైనా ఇప్పుడు అనుష్క శెట్టి కంబ్యాక్ కోసం ప్ర‌య‌త్నిస్తోంద‌న్న‌ది తెలిసింది.

ఇప్పుడు కెరీర్ 48వ చిత్రంలో న‌టిస్తోంది. మ‌రో రెండు సినిమాలు పూర్తి చేస్తే అర్థ సెంచ‌రీ కొట్టిన‌ట్టే. నాగార్జున స‌ర‌స‌న 'సూప‌ర్' సినిమాతో 2005 లో కెరీర్ ని ప్రారంభించింది. 16 సంవ‌త్స‌రాల సుదీర్ఘ కెరీర్ లో ఎన్నో మైలురాళ్ల‌ను అధిగ‌మించింది. అనుష్క త‌దుప‌రి న‌టించే 50వ సినిమా కెరీర్ ల్యాండ్ మార్క్ మూవీ అవ్వాల‌ని ఆశిద్దాం. అరుంధ‌తి- భాగ‌మ‌తి రేంజు స్క్రిప్టుతో అనుష్క తిరిగి త‌న కంబ్యాక్ ని ఘ‌నంగా చాటుతుందేమో చూడాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News