అనుష్కా.. ఇంతకంటే ఏం కావాలి?

Update: 2015-11-02 06:53 GMT
పదేళ్లు వెనక్కి వెళ్తే.. ‘సూపర్’ సినిమాతో హీరోయిన్ గా అరంగేట్రం చేసింది అనుష్క. ఆ సినిమా ఫ్లాపవడంతో తిరిగి బెంగళూరు వెళ్లిపోదామనుకుంది స్వీటీ. కానీ రాజమౌళి పిలిచి మరీ ‘విక్రమార్కుడు’ సినిమాలో ఛాన్స్ ఇచ్చేశాడు. ఆ సినిమా ఎంత పెద్ద హిట్టో తెలిసిందే. ఐతే అనుష్క కెరీర్‌ ను ఇంకా పెద్ద మలుపు తిప్పిన సినిమా ‘అరుంధతి’. ఈ సినిమాతో అనుష్క అందర్లాంటి హీరోయిన్ కాదని అందరికీ అర్థమైంది. ఇప్పుడు మరే హీరోయిన్ కూ సాధ్యం కాని.. రుద్రమదేవి - బాహుబలి - సైజ్ జీరో లాంటి సినిమాలు చేస్తోందంటే.. అందుకు కారణం శ్యామ్ ప్రసాద్ రెడ్డి తీసిన ‘అరుంధతి’ సినిమానే కారణం.

ఐతే తనకు అరుంధతి ఆఫర్ వచ్చినపుడు అనుష్క వెంటనే ఏమీ ఒప్పేసుకోలేదు. తన డైరెక్టర్ రాజమౌళిని అడిగితే.. ‘కళ్లు మూసుకుని సినిమా ఒప్పేసుకో’ అన్నాడట జక్కన్న. శ్యామ్ ప్రసాద్ రెడ్డి అంటే ఏంటో జక్కన్నకు బాగా తెలుసు. తెలుగులో ల్యాండ్ మార్క్ సినిమాలు చేసిన ఘనత ఆయనది. ఆయన పిలిచి ఛాన్సివ్వడమే ఓ పెద్ద కాంప్లిమెంట్. అలాంటాయన ‘సైజ్ జీరో’ ఆడియో ఫంక్షన్లో అనుష్క గురించి చెప్పిన మాటలు వింటే.. స్వీటీకి ఇంతకంటే ఏం కావాలి అనిపించడం ఖాయం.

‘‘తెలుగులో ఓ డిఫరెంట్ కమర్షియల్ సినిమా చేయాలంటే అనుష్క తప్ప మరో ఛాయిస్ లేదు. అరుంధతి సినిమా విషయంలో కోడి రామకృష్ణకు అనుష్క తప్ప ఇంకెవరూ కనిపించలేదు. బాహుబలి విషయంలో రాజమౌళికి - రుద్రమదేవి విషయంలో గుణశేఖర్ కు, ఇప్పుడు సైజ్ జీరో విషయంలో ప్రకాష్ కోవెలమూడికి అనుష్కే ఛాయిస్ అయ్యింది. అనుష్క తెలుగు సినిమా చరిత్రలో నిలిచిపోతుంది. మనం ఎన్నో ఏళ్ల పాటు ఆమెను గుర్తుంచుకుంటాం. అనుష్క చాలా గ్రేట్ ఆర్టిస్ట్. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ అద్భుతం. అరుంధతి సినిమా ఇంటర్వెల్ కు ముందు అలా నడిచొస్తుంటే చాలు, ఆమె డైలాగ్ చెప్పకపోయినా అద్భుతంగా అనిపించింది. అంత గొప్ప స్క్రీన్ ప్రెజెన్స్ ఆమెది. అలాంటి నటి ఎక్కడా లేదు. టిపికల్ ఇండియన్ అందం ఆమెది. అలాంటి నటి ఉండటం మన అదృష్టం’’ అంటూ తన జేజెమ్మను ఆకాశానికెత్తేశాడు శ్యామ్.
Tags:    

Similar News