ఆన్ లైన్ సినిమా టికెట్ బుకింగ్ సేవలు ప్రవేశపెడుతున్న ఏపీ ప్రభుత్వం..!

Update: 2021-09-08 10:30 GMT
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి సినిమా రంగంపై దృష్టి పెట్టింది. మల్టీప్లెక్స్‌ లతో సహా సినిమా థియేటర్స్ కోసం ఆన్‌ లైన్ టికెట్ బుకింగ్ సేవలను ప్రవేశపెట్టింది. ఇప్పటికే సింగిల్ విండో విధానంలో సినిమా టీవీ సీరియల్స్ షూటింగ్ లకు అనుమతిస్తూ జగన్ సర్కార్ జీవో జారీ చేసిన సంగతి తెలిసిందే. కరోనా సమయంలో టిక్కెట్ ధరల పెంపును నియంత్రిస్తూ చర్యలు తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. తాజాగా ఆన్ లైన్ టికెట్ బుకింగ్ సిస్టమ్ పై దృష్టి సారించింది.

సింగిల్ స్క్రీన్ థియేటర్లు, సినిమాస్ - మల్టీప్లెక్స్ లలో ఆన్ లైన్ బుకింగ్ పేరుతో మధ్యవర్తులు వసూళ్లకు చెక్ పెట్టడానికే ఏపీ ప్రభుత్వం ఆన్ లైన్ సినిమా టికెట్ బుకింగ్ విధానం తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. దీనిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్రం, టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నిర్వహిస్తుందని తెలిపారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఈరోజు బుధవారం జీవో జారీ చేసింది.

తెలంగాణా రాష్ట్రంలో కూడా ఆన్ లైన్ సినిమా టికెట్ బుకింగ్ వ్యవస్థ తీసుకురావాలని ప్రభుత్వం ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తోంది. కానీ అది ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు రైల్వే ఆన్ లైన్ టిక్కెటింగ్ సిస్టమ్ తరహాలో సినిమా టికెట్స్ కు యూనిఫామిటీ తీసుకొస్తోంది. ఈ విధానం ఎలా పని చేస్తుందో చూడాలి.

ఇకపోతే ఏపీలో ఇంకా థియేటర్ల ఆక్యుపెన్సీ యాభై శాతం మాత్రమే కొనసాగుతోంది. అలానే నైట్ కర్ఫ్యూ కారణంగా మూడు షోలకు మాత్రమే అవకాశం కల్పిస్తోంది. ఈ షరతులను తొలగించాలని ఎగ్జిబిటర్స్ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మరికొన్ని రోజుల్లో టాలీవుడ్ పెద్దలు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తో భేటీ కానున్న నేపథ్యంలో థియేటర్ సమస్యలపై చర్చించనున్నారు. అలానే ఆన్ లైన్ సినిమా టిక్కెటింగ్ సిస్టమ్ గురించి కూడా డిస్కషన్ చేసే అవకాశాలు లేకపోలేదు.




Tags:    

Similar News