భేటీ అనంతరం ఆర్జీవీ - పేర్ని నాని ఏమన్నారంటే..?

Update: 2022-01-10 12:07 GMT
ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ రేట్ల వ్యవహారం మీద విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోమవారం సినిమాటోగ్రఫీ మినిస్టర్ పేర్ని నానితో భేటీ అయిన సంగతి తెలిసిందే. దాదాపు రెండు గంటలకు పైగా జరిగిన ఈ సమావేశంలో సినిమా టికెట్ ధరల నియంత్రణ మీద ఆర్జీవీ తన అభిప్రాయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. అమరావతిలోని సచివాలయంలో ఈ భేటీ ముగిసిన అనంతరం వర్మ మీడియాతో మాట్లాడారు. మంత్రి పేర్నినానితో చర్చలు సంతృప్తికరంగా ముగిశాయని.. ఐదు ప్రధానమైన అంశాలపై తాము చర్చించామని అన్నారు. సినిమా టికెట్ ధరల నిర్ణయంపై ప్రభుత్వానికి అధికారం ఉండదనేది మొదటి నుంచీ తన వాదనని.. దీనిపై తన వెర్షన్ ని తెలియజేసానని ఆర్జీవీ చెప్పుకొచ్చారు. థియేటర్ల మూసివేతపై ఎలాంటి చర్చా జరగలేదని స్పష్టం చేసారు.

''సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానితో జరిగిన సమావేశంలో ఐదు అంశాలపై ప్రధానంగా చర్చించాం. టికెట్ రేట్లు తగ్గించడాన్ని వ్యతిరేకించాను. ఇండస్ట్రీతో నాకున్న 30ఏళ్ల ఎక్స్పీఎరియన్స్ తో ఎక్కడ ఏం జరుగుతుందన్న విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకొచ్చా. ఆయన కూడా కొన్ని విషయాలను నా దృష్టికి తీసుకొచ్చారు. వాటిని మా సినీ పరిశ్రమకు చెందిన వారిని కలిసి చర్చిస్తా. ఇదొక పద్ధతి ప్రకారం చేస్తాం. అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం లభిస్తుందని అనుకుంటున్నా. సినీ నిర్మాతగా నా అభిప్రాయం చెప్పాను. టికెట్ రేట్లు తగ్గిస్తే చాలా నష్టం వస్తుందని ఆయనకు వివరించా. కేవలం నా వెర్షన్ వినిపించేందుకు మాత్రమే ఇక్కడకు వచ్చా. నేను ఎలాంటి డిమాండ్స్ చేయలేదు. ఈ మీటింగ్ ద్వారా వచ్చిన అభిప్రాయాలపై ఇద్దరం చర్చిస్తాం. తుది నిర్ణయం నా చేతిలో ఉండదు కదా.. ఫైనల్ డెసిషన్ ప్రభుత్వమే  తీసుకుంటుంది'' అని రామ్ గోపాల్ వర్మ తెలిపారు.

ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా సినిమా టికెట్ రేట్లను తగ్గించిందనే వాదనతో తాను ఏకీభవించనని ఆర్జీవీ అన్నారు. ప్రభుత్వం నిర్ణయం స్టార్స్ అందరి పైనా.. అన్ని సినిమాల పైనా ప్రభావం చూపుతుందని.. కేవలం పవన్ కల్యాణ్ - బాలకృష్ణను టార్గెట్ చేయడానికి గవర్నమెంట్ ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందని అనుకోవడం లేదని వర్మ అభిప్రాయపడ్డారు. ''టికెట్ రేట్ల విషయంలో నేను అడిగిన ప్రశ్నలకు ఉదాహరణలతో అన్నీ వివరంగా చెప్పా. కేవలం ఈ ఒక్క మీటింగ్ తోనే ఈ అంశం ముగిసిపోదు. సినిమా ఇండస్ట్రీ అంటే నేను ఒక్కడినే కాదు.. వందల మంది ఉన్నారు. వాళ్లందరి అభిప్రాయాలను కూడా ప్రభుత్వం తీసుకుంటుంది. నేను సినిమా ఇండస్ట్రీ తరపున రాలేదు. ఒక నిర్మాతగా మాత్రమే ఇక్కడకు వచ్చా. సినిమా తీసిన వాళ్లకే టికెట్ రేటు నిర్ణయించుకునే అధికారం ఇవ్వాలి. సమస్య పరిష్కారం అనేది ఇండస్ట్రీ - ప్రభుత్వం ఇద్దరి పైనా ఉంది. ఫేక్ కలెక్షన్లు - పన్ను ఎగవేతపై ప్రభుత్వం చర్యలు తీసుకోవచ్చు. ఈరోజు చర్చలతో వంద శాతం సంతృప్తితో ఉన్నాను'' అని రాంగోపాల్ వర్మ చెప్పుకొచ్చారు.

కాగా, ఏపీలో సినిమా టికెట్ ధరల వ్యవహారం రోజురోజుకూ వివాదంగా మారుతోంది. సినీ వినోదం ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశ్యంతో టికెట్ రేట్లు నియంత్రించామని ప్రభుత్వం చెబుతుంటే.. ఈ రేట్లతో నష్టపోతామని కనీసం కరెంట్‌ ఖర్చులు కూడా రావనేది ఇండస్ట్రీ వాదన. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వనికి సినిమా ఇండస్ట్రీకి మధ్య కోల్డ్ వార్ జరుగుతున్న నేపథ్యంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ ఇష్యూలో ఎంటర్ అయ్యారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ వరుస ట్వీట్లు చేసారు. చివరకు మంత్రి పేర్ని నాని అపాయింట్మెంట్ ఇస్తే అన్నీ వివరిస్తానని కోరారు. దీనికి నాని సానుకూలంగా స్పందించడంతో.. ఈరోజు సోమవారం భేటీ అయ్యారు.

ఇకపోతే ఆర్జీవీతో భేటీపై రాష్ట్ర సినిమాటోగ్రఫీశాఖ మంత్రి పేర్ని నాని కూడా స్పందించారు. ప్రభుత్వం ఎవరినీ ఇబ్బంది పెట్టదని.. సినిమాటోగ్రఫీ చట్టం ప్రకారమే టికెట్ రేట్లు నిర్ణయించామని అన్నారు. రామ్ గోపాల్ వర్మ మాదిరిగానే ఎవరు సలహాలు ఇచ్చినా తీసుకుంటామని స్పష్టం చేసారు. సినిమా టికెట్ రేట్ల అంశం మీద వేసిన కమిటీ నివేదిక వచ్చిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని పేర్ని నాని తెలిపారు.
Tags:    

Similar News