ఆ క్రేజీ ప్రాజెక్టుకు రెహమాన్ సంగీతం

Update: 2019-07-16 09:17 GMT
విశ్వనటుడుగా పేరు తెచ్చుకున్న కమల్ హాసన్ ఈమధ్య రాజకీయాలపై దృష్టి సారించడంతో సినిమాల్లో నటించడం తగ్గింది.  'భారతీయుడు 2' సినిమా కమల్ చివరి చిత్రం అవుతుందని ఇప్పటికే టాక్ ఉంది.  అయితే అభిమానులకు కమల్ హాసన్ ఒక సర్ ప్రైజ్ ఇచ్చారు.  కమల్ త్వరలో 'తలైవన్ ఇరుక్కిండ్రాన్' అనే ప్రాజెక్టు టేకప్ చేస్తున్నారట.

ఈ విషయం గురించి మొదట సంగీత దర్శకుడు ఎఆర్ రెహమాన్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు.  కమల్ హాసన్ తో కలిసి డబ్బింగ్ స్టూడియోలో కూర్చుని ఉన్న ఒక ఫోటోను షేర్ చేసిన రెహమాన్ "వన్ అండ్ ఓన్లీ కమల్ హాసన్ గారితో ఒక భారీ ప్రాజెక్టుకు కలిసి పని చేసేందుకు సంతోషంగా.. ఎగ్జైటెడ్ గా ఉన్నాను.  రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్.. లైకా ప్రొడక్షన్స్" అంటూ ట్వీట్ చేశారు.  దీనికి రిప్లై ఇచ్చిన కమల్ "ఎఆర్ రెహమాన్.. మీ భాగస్వామ్యంతో ఈ టీమ్ ను బలోపేతం చేస్తున్నందుకు కృతజ్ఞతలు.  కొన్ని సినిమాలు మాత్రమే డెవలప్ మెంట్ దశలో మనకు మంచి ఫీల్ ఇస్తాయి.  తలైవన్ ఇరుక్కిండ్రాన్ అలాటిదే. మీ ఉత్సాహం అందరినీ ఉత్సాహపరిచేదిగా ఉంది" అంటూ ట్వీట్ చేశారు.

నిజానికి ఈ 'తలైవన్ ఇరుక్కిండ్రాన్' కొత్త ప్రాజెక్టు కాదు.  కమల్ 2015 లో ఈ ప్రాజెక్టును తన దర్శకత్వంలోనే సొంత బ్యానర్లో ప్రారంభించారు.  తమిళ - హిందీ ద్విభాషా చిత్రంగా ఈ సినిమాను ప్రకటించారు. ఈ యాక్షన్ థ్రిల్లర్లో కమల్ నెగెటివ్ రోల్ లోనూ బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ హీరోగానూ ప్లాన్ చేశారు.  కానీ ఎందుకో ఆ ప్రాజెక్టు ముందుకు సాగలేదు.  ఇప్పుడు ఈ ప్రాజెక్టును మరోసారి తెరపైకి తీసుకొచ్చారు.  ఇదిలా ఉంటే ఈ సినిమాతో రెహమాన్ దాదాపు ఇరవై మూడేళ్ళ తర్వాత కమల్ హాసన్ చిత్రానికి పని చేస్తున్నారు. గతంలో ఇద్దరూ 'భారతీయుడు' చిత్రానికి కలిసి పని చేశారు.
Tags:    

Similar News