‘బాహుబలి’పై రెహమాన్ రెస్పాన్స్ విన్నారా?

Update: 2017-05-22 10:40 GMT
కలెక్షన్లే ప్రామాణికంగా చూస్తే ఇండియాలో ఇప్పటిదాకా ‘బాహుబలి’ని మించిన సినిమా రాలేదన్నది వాస్తవం. ఐతే కేవలం భారీతనం.. భారీ కలెక్షన్లను బట్టి ఈ సినిమానే గ్రేటెస్ట్ ఎవర్ అని తేల్చేయడం కరెక్ట్ కాదు కదా. ఏఆర్ రెహమాన్ కూడా దాదాపుగా ఇదే మాట అంటున్నాడు. ‘బాహుబలి’ టీం బాగా కష్టపడింది.. మంచి ఫలితాన్నందుకుంది అంటూనే.. ఇంతకు ముందు కూడా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఇలాంటి భారీ ప్రయత్నాలు చోటు చేసుకోకుండా పోలేదని చెప్పాడు రెహమాన్. ఇందుకు కొన్ని ఉదాహరణలు కూడా చూపించాడు రెహమాన్.

శేఖర్ కపూర్ దర్శకత్వంలో హృతిక్ రోషన్ హీరోగా తీయాలనుకున్న ‘పానీ’ కూడా భారీ ప్రయత్నమే అని.. దాన్ని ప్రపంచ స్థాయికి ఏమాత్రం తగ్గని రీతిలో తీయడానికి శేఖర్ కపూర్ ప్రణాళికలు రచించాడని.. కానీ అనివార్య కారణాల వల్ల ఆ ప్రాజెక్టు పట్టాలెక్కలేదని రెహమాన్ అన్నాడు. అలాగే రజినీకాంత్ హీరోగా ఆయన తనయురాలు సౌందర్య తీసిన ‘కోచ్చడయాన్’ కూడా గొప్ప ప్రయత్నమే అన్నాడు రెహమాన్. ఐతే ఆ సినిమాకు కంప్యూటర్ గ్రాఫిక్స్ సరిగా కుదరక ప్రతికూల ఫలితం వచ్చిందన్నాడు. బాహుబలి విషయానికి వస్తే.. దీనికి మంచి టీం కుదరిందని.. అందరూ కష్టపడటానికి తోడు.. ఈ సినిమాకు అన్నీ కలిసి రావడంతో మంచి ఫలితం వచ్చిందని అన్నాడు రెహమాన్. సుందర్ రూపొందించబోయే ‘సంఘమిత్ర’ కూడా గొప్ప స్థాయిలో ఉంటుందని రెహమాన్ అన్నాడు. ఆ చిత్రానికి రెహమానే సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.
Tags:    

Similar News