ఓటీటీ పేమెంట్స్ కు కండిషన్స్ పెడుతున్నారా..?

Update: 2022-06-23 00:30 GMT
పాండమిక్ నేపథ్యంలో డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ బాగా పుంజుకున్నాయి. మనకు కొంచం లేట్ గా పరిచయమయ్యాయి కానీ.. చాలా ఫాస్ట్ గా అభివృద్ధి చెందాయని చెప్పాలి. ఓటీటీలు కరోనా టైంలో వినోదాన్ని అందించే ప్రత్యామ్నాయ మార్గాలుగా మారాయి.

కొన్ని నెలల పాటు థియేటర్లు మూతబడి ఉండటంతో.. నిర్మాతలంతా నష్టాల బారి నుంచి బయట పడటానికి ఓటీటీలను ఆశ్రయించారు. డిజిటల్ సంస్థలతో మంచి డీల్స్ సెట్ చేసుకొని.. ఓటీటీ స్ట్రీమింగ్ కు ఇచ్చేసారు.

ఇతర ఓటీటీల నుంచి పోటీ తట్టుకోడానికి.. వీక్షకులను ఆకట్టుకోడానికి, సబ్ స్క్రైబర్స్ పెంచుకోడానికి డిజిటల్ వేదికలు సైతం.. ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్ ను అందించాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో నిర్మాతలకు ఫ్యాన్సీ రేట్లు ఆఫర్ చేసి సినిమాలను కొనుగోలు చేశారు.

అంతేకాదు పెద్ద చిత్రాలను - క్రేజీ సినిమాలను అనుకున్న సమయం కంటే ముందుగానే స్ట్రీమింగ్ చేయడానికి అదనంగా చెల్లించడానికి కూడా రెడీ అయ్యారు. ఈ విధంగానే ఇటీవలి కాలంలో అనేక పెద్ద సినిమాలు నెల తిరక్కుండానే ఓటీటీలో రిలీజ్ అయ్యాయి.

డిజిటల్ రైట్స్ కోసం ఓటీటీలు భారీ రేట్లు ఆఫర్ చేస్తుండటం.. ఎర్లీ స్క్రీనింగ్ కోసం అదనంగా చెల్లిస్తుండటంతో.. నిర్మాతలు కూడా ఎలాంటి అభ్యంతరాలు లేకుండా హ్యాపీగా ఓటీటీ డీల్స్ సెట్ చేసుకుంటున్నారు.

ఇక్కడి దాకా అంతా బాగానే ఉన్నా.. ఈ మధ్య పేమెంట్స్ విషయంలో కొన్ని ఓటీటీలు కండిషన్స్ పెడుతున్నాయనే టాక్ వినిపిస్తోంది. ముందుగా అనుకున్న ప్రకారం చెల్లింపులు జరపకుండా.. ఆలస్యం చేస్తున్నాయని అంటున్నారు.

ఓటీటీ స్ట్రీమింగ్ అయి వారాలు గడుస్తున్నా అమౌంట్ క్లియర్ చేయకుండా నిర్మాతలను ఇబ్బంది పెడుతున్నాయని మాట్లాడుకుంటున్నారు. సమయానికి డబ్బు అందకపోవడమే ఇతర ఫైనాన్షియల్ సెటిల్ మెంట్స్ చేసుకోవాల్సిన ప్రొడ్యూసర్ ఆందోళన చెందుతున్నారని అనుకుంటున్నారు.

ఓటీటీల వల్ల ఎంత లాభం ఉందో అంతే నష్టం కూడా ఉందనే విషయాన్ని ఇప్పుడిప్పుడే అందరూ గుర్తిస్తున్నారు. డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ హవా పెరిగిన తర్వాత శాటిలైట్ రైట్స్ రేట్లు పడిపోవడమే కాదు.. ఇది మొత్తం థియేటర్ వ్యవస్థపై ప్రభావం చూపుతోంది.

పాండమిక్ తర్వాత సినిమా హాళ్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతే.. ఇప్పుడు ఓటీటీల వల్ల అసలు థియేటర్ వైపు చూడని పరిస్థితులు క్రియేట్ అవుతున్నాయి. పెద్ద సినిమాలు కూడా మూడు వారాలకే డిజిటల్ వేదికల మీదకు వస్తున్నాయి.

దీంతో ఓటీటీలకు అలవాటు పడిపోయిన ఆడియన్స్.. ఎలాగూ కొన్ని రోజులు ఆగితే ఇంట్లోనే చూడొచ్చు కదా ఆలోచనతో ఉంటున్నారు. దీన్నుంచి బయటపడటానికి సినీ ప్రముఖులు ఏం చేస్తారో చూడాలి.
Tags:    

Similar News