ప్రియురాలితో ఏం గొడ‌వ‌? 4BHK అమ్మేసిన కుర్ర‌హీరో!?

Update: 2022-07-22 04:33 GMT
ప్రియురాలికి ద‌గ్గ‌ర‌గా ఉండేందుకు ఇటీవ‌లే పోష్ ఏరియాలో  4BHK కొన్నాడు స‌ద‌రు కుర్ర‌హీరో. కానీ ఇంత‌లోనే ఏం చెడిందో ఆ ఇంటిని ఇప్పుడు పెద్ద న‌ష్టానికి అమ్మేస్తున్నాడు. అస‌లింత‌కీ ఏం జ‌రుగుతోంది? అంటే వివ‌రాల్లోకి వెళ్లాలి.

బాలీవుడ్ హాట్ క‌పుల్ మ‌లైకా అరోరాఖాన్- అర్జున్ క‌పూర్ ఎఫైర్ వ్య‌వ‌హారం తెలిసిన‌దే. ఈ జంట స‌హ‌జీవ‌నంపై బోలెడంత చ‌ర్చ సాగుతూనే ఉంటుంది. ఆ ఇద్ద‌రూ అన్యోన్య‌మైన జంట‌గానూ ఇప్ప‌టికే పాపుల‌ర‌య్యారు. ఈ జోడీ ఇటీవ‌ల‌ ప‌క్క ప‌క్క అపార్ట్ మెంట్ల‌లోనే నివాసం ఉండ‌డం హాట్ టాపిక్ గా మారింది.. అయితే ఇది ఏ విష‌యంలో క‌లిసి రాలేదో కానీ ఇప్పుడు అత‌డు ఆ ఇల్లును అమ్మేసాడ‌ని తెలిసింది.

స‌రిగ్గా రెండు నెల‌ల‌ క్రితం బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్ ల్యాండ్ రోవర్ డిఫెండర్ ఎస్‌.యూ.వీని తనకు తానే పుట్టినరోజు కానుకగా ఇచ్చుకున్నాడు. ఆ వెంట‌నే బాంద్రాలోని ఎగ్జోటిక్ సీఫేసింగ్ స్కై విల్లాను కొనుగోలు చేసాడు. ఇది అతని లేడీలవ్ మలైకా అరోరా కి చెందిన అత్యంత‌ విలాసవంతమైన ఇంటికి చేరువ‌గా ఉంది. మలైకా .. అర్జున్ ఇరుగు పొరుగు వారై రెండు నెల‌లైంది.

బాలీవుడ్ లో ఖ‌రీదైన ఫేజ్ 3  జ‌నం నివ‌సించే కాస్ట్ లీయెస్ట్ ప్లేస్ లో ఈ నివాసం ఉంది. షారుఖ్ ఖాన్ - సల్మాన్ ఖాన్- కరీనా కపూర్ ఖాన్ - రణబీర్ కపూర్ ల‌తో సహా ఆ పరిసరాల్లో నివసించే ప్రముఖులందరూ అర్జున్ కి ఇప్పుడు ఇరుగు పొరుగున ఉన్నారు. సోనాక్షి సిన్హా కూడా ఇక్క‌డే నివాసం ఉంటోంది.

ఇది సువిశాల‌మైన‌ 4BHK అపార్ట్ మెంట్. సముద్ర ముఖంగా ఉన్న ఆస్తి కాబ‌ట్టి 20 నుండి 23 కోట్ల రూపాయలు పెట్టాల్సొచ్చింది. ఈ ఇల్లు బాంద్రా వెస్ట్ లోని 26 అంతస్తుల భ‌వంతిలో ఉంది. 81 ఆరియేట్ స్కై ట‌వ‌ర్ లోనే ఇంతకు ముందు సోనాక్షి సిన్హా కూడా స్కై విల్లా కొన్నారు. కానీ ఇంత‌లోనే ఏమైందో అర్జున్ కపూర్ తన కొత్త‌ 4BHK అపార్ట్ మెంట్ ను రూ. 4 కోట్ల నష్టానికి అమ్మేసాడు.

మలైకా అరోరా - అర్జున్ కపూర్ క‌పుల్ గోల్స్ నిరంత‌రం వేడెక్కిస్తూనే ఉంటాయి. కానీ స‌ద‌రు ప్రేమపక్షులు ఇప్పుడు ఒకరికొకరు దూరంగా ఉన్నారనే వార్త వారి అభిమానుల్లో హాట్ టాపిక్ గాను మారుతోంది. అయితే కొందరు దీనికి భిన్నంగా పెళ్లి ఘ‌డియ‌లు స‌మీపిస్తున్నాయ‌ని.. త్వరలో శుభ‌లేఖ‌లు పంచుతార‌ని కూడా ఊహాగానాలు చేస్తున్నారు.

అయితే ఇలాంటి స‌మ‌యంలో మ‌లైకా ఇంటి స‌మీపంలో తాను కొనుగోలు చేసిన అపార్ట్ మెంట్ ను అత‌డు అమ్మేయ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.  అర్జున్ ప్రస్తుతం జుహూలోని రహేజా ఆర్చిడ్ లో నివసిస్తున్నాడు. బాంద్రాలోని 81 ఆరియాట్ భవనంలో ఉన్న అపార్ట్ మెంట్ ను విక్రయించిన తర్వాత తన మునుపటి నివాసంలో మరికొంత కాలం ఉండేందుకు ప్లాన్ చేసాడ‌ని టాక్ వినిపిస్తోంది.

తాజా మీడియా క‌థ‌నాల ప్రకారం.. అర్జున్ కపూర్ తన ఇటీవల కొనుగోలు చేసిన సొగసైన బాంద్రా ఫ్లాట్ ను రూ.16 కోట్లకు విక్రయించాడు. కొనుగోలు చేసిన దానికంటే 4 కోట్లు తక్కువకు అమ్మేశాడు.

ఇంత‌ హడావిడిగా పెద్ద‌ న‌ష్టానికి అత‌డు ఈ ఇంటిని అమ్మేయ‌డానికి కార‌ణ‌మేమిటీ? అన్న‌దే గుస‌గుస‌ల‌కు తావిస్తోంది. ఈ క్ర‌య‌విక్ర‌యాల వెన‌క లాజిక్ కానీ.. కారణం కానీ ఇంకా తెలియరాలేదు. అయితే మలైకా- అర్జున్ మధ్య ఎటువంటి స‌మ‌స్య‌లు లేవ‌ని అభిమానులు ఊహిస్తున్నారు. ఇక ఇల్లు విక్రయ పత్రం ఇప్ప‌టికే రాసుకోగా.. అర్జున్ సోదరి అన్షులా కపూర్ దీనిపై సంతకం చేసిందని క‌థ‌నాలొస్తున్నాయి.
Tags:    

Similar News