లేటైతే అయ్యింది కానీ.. హిట్టయ్యేలాగే ఉంది!

Update: 2019-12-03 17:30 GMT
మామూలుగా రిలీజ్ బాగా ఆలస్యమైన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ప్రభావం చూపించడం తక్కువ. వాయిదాలు మీద వాయిదాలు పడటంతోనే ప్రేక్షకుల్లో ఒక రకమైన నెగెటివిటీ వచ్చేస్తుంది. ఔట్ పుట్ బాలేకపోవడం వల్లే సినిమాలు చాలా వరకు ఆలస్యం అవుతుంటాయి. ప్రేక్షకులు కూడా ఇలాంటి సినిమాలకు నెగెటివ్ మైండ్‌ తో వెళ్తారు. అరుదుగా మాత్రమే ఇలాంటి సినిమాలు ఆడుతుంటాయి. ‘అర్జున్ సురవరం’ ఆ అరుదైన జాబితాలోకే చేరేలా కనిపిస్తోంది. పోయినేడాది చివర్లోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ చిత్రం.. ఎన్నిసార్లు వాయిదా పడిందో లెక్కలేదు. ఇక ఎప్పటికైనా ఈ చిత్రం విడుదలవుతుందా అని సందేహిస్తుంటే.. ఎట్టకేలకు నవంబరు 29న రిలీజ్ చేసేశారు. మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్‌ కు ముఖ్య అతిథిగా రావడం కలిసొచ్చినట్లే ఉంది.

‘అర్జున్ సురవరం’కు ఓపెనింగ్స్ అంచనాల్ని మించి వచ్చాయి. తొలి రోజు నాలుగు కోట్లకు పైగా గ్రాస్ వచ్చింది. నిఖిల్ స్థాయికి అది ఎక్కువే. వీకెండ్ అంతా కూడా సినిమా జోరు చూపించింది. చాలా చోట్ల హౌస్ ఫుల్స్ పడ్డాయి. సోమవారం వసూళ్లు డ్రాప్ అయ్యాయి కానీ.. మరీ ఎక్కువేమీ కాదు. ప్రస్తుతానికైతే ఈ సినిమానే బాక్సాఫీస్ లీడర్‌ గా సాగుతోంది. ఇప్పటికే రూ.13 కోట్ల దాకా గ్రాస్.. రూ.7.5 కోట్ల దాకా షేర్ రాబట్టి బ్రేక్ ఈవెన్ దిశగా అడుగులు వేస్తోంది నిఖిల్ సినిమా. ఈ వారాంతంలో చెప్పుకోదగ్గ సినిమాలేమీ లేవు. ‘90 ఎంఎల్’ - ‘భాగ్యనగరంలో గమ్మత్తు’ సినిమాలకు బజ్ తక్కువే. ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ రిలీజయ్యేలా లేదు. రెండో వారాంతంలో ‘అర్జున్ సురవరం’ ఓ మోస్తరుగా నిలబడినా బయ్యర్లు సేఫ్ అయిపోతారు. సినిమా హిట్ స్టేటస్ అందుకుంటుంది.


Tags:    

Similar News