ఎట్ట‌కేల‌కు జాన్వీ మ‌న‌సు ఇటువైపు మ‌ళ్లిందట‌

Update: 2022-07-29 11:30 GMT
హిందీ చిత్ర‌సీమ‌పై టాలీవుడ్ స‌వారీ గురించి తెలిసిందే. మ‌న సినిమాల్ని రీమేక్ చేసేందుకు బాలీవుడ్ మేక‌ర్స్ ప‌డిగాపులు ప‌డుతున్నారు. దక్షిణాది నుంచి నెక్స్ట్ భారీ విడుద‌ల ఏదీ? అంటూ ఆస‌క్తిగా ఆరాలు తీస్తున్నారు. అంతేకాదు ఖాన్ ల త్ర‌యం మొద‌లు హిందీ హీరోలు అంతా సౌత్ వైపు చూస్తున్నారు. కేవ‌లం హిందీ మార్కెట్ చిక్కితే స‌రిపోదు.. ఇప్పుడు సౌతిండియాలో స‌త్తా చాటాలి అన్న జిజ్ఞాస అక్క‌డ మొద‌లైంది.

కార‌ణం ఏదైనా కానీ ఈ ప‌రిణామం సౌత్ స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాలకు క‌లిసిరానుంద‌ని గుస‌గుస వినిపిస్తోంది. ఇప్ప‌టివ‌ర‌కూ ఉన్న మైండ్ సెట్ ని పూర్తిగా మార్చుకున్న కొర‌టాల త‌దుప‌రి త‌న కెరీర్ లో తొలి పాన్ ఇండియా సినిమాపై దృష్టి సారించారు. అది కూడా ఆర్.ఆర్.ఆర్ స్టార్ ఎన్టీఆర్ తో అత‌డు భారీ ప్ర‌యోగానికి శ్రీ‌కారం చుడుతున్నార‌ని టాక్ వినిపిస్తోంది.

ఈ సారి కొర‌టాల గ‌త సినిమాల్లా కాకుండా పూర్తి వైవిధ్య‌మైన.. యూనివ‌ర్శ‌ల్ అప్పీల్ ఉన్న క‌థాంశాన్ని ఎంపిక చేశారు. స్క్రిప్టు ప‌నుల కోసం కొంత‌ ఆల‌స్య‌మ‌వుతుందని కూడా ప్ర‌క‌టించారు. ఇంత‌కుముందు ఈ విష‌యాన్ని క‌ళ్యాణ్ రామ్ 'బింబిసార' ప్ర‌చార వేదిక‌పైనా వెల్ల‌డించిన సంగ‌తి తెలిసిందే.

అలాగే క‌థానాయిక ఎంపిక కూడా అంత‌కంత‌కు ఆల‌స్య‌మ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ మూవీలో జాన్వీ.. స‌మంత.. కియ‌రా అద్వాణీ లాంటి తార‌లు న‌టిస్తార‌ని క‌థనాలొచ్చాయి. కానీ దేనికీ క‌న్ఫ‌ర్మేష‌న్ లేదు. కొంత గ్యాప్ త‌ర్వాత ఇప్పుడు జాన్వీ కపూర్ పేరు మళ్లీ ప్ర‌చారంలోకి వ‌స్తోంది. ఇటీవ‌ల అందాల జాన్వీ మ‌న‌సు ఇటువైపు మ‌ళ్లింద‌ని కొర‌టాల ప్ర‌తిపాద‌న‌కు ఓకే చెప్పేందుకు ఆస్కారం ఉంద‌ని కూడా టాక్ వినిపిస్తోంది.

అయితే జాన్వీ మ‌న‌సు మార‌డానికి కార‌ణాలు లేక‌పోలేదు. ఇటీవ‌లి కాలంలో హిందీ సినిమాల‌కు ఆద‌ర‌ణ త‌గ్గింది. స్ట్రెయిట్ హిందీ సినిమాల‌ను మించి తెలుగు సినిమాలు బాలీవుడ్ లో బ్లాక్ బ‌స్ట‌ర్లు కొడుతున్నాయి. ఫ్లాపుల‌తో వెన‌క‌బ‌డిన ప‌రిశ్ర‌మ‌లో ఉండ‌డం క‌థానాయిక‌ల‌కు అంత మంచిది కాదు. అందుకే యూట‌ర్న్ తీసుకునేందుకు ఇదే స‌రైన టైమ్ అని జాన్వీ భావిస్తోంద‌ట‌. ఇక్క‌డ అగ్ర హీరో స‌ర‌స‌న లాంచ్ అయితే అది త‌న టాలీవుడ్ కెరీర్ కి పెద్ద ప్ల‌స్ అవుతుంద‌ని కూడా భావిస్తోంది. అదే క్ర‌మంలో కొర‌టాల‌తో ఎన్టీఆర్ మూవీ స్క్రిప్టు వినేందుకు సిద్ధ‌మ‌వుతోంద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. అయితే జాన్వీతో చ‌ర్చల గురించి చిత్ర‌బృందం అధికారికంగా వెల్ల‌డించాల్సి ఉంటుంది.

కొరటాల శివ బౌండ్ స్క్రిప్టును వినిపించి జాన్వీని లాక్ చేశాకే ఫైన‌ల్ గా ప్ర‌క‌టించే వీలుంటుంద‌ని కూడా గుస‌గుస వినిపిస్తోంది. బాలీవుడ్ లో ఓ వెలుగు వెలుగుతున్న‌ప్పుడే టాలీవుడ్ లో స‌త్తా చాటాల‌ని జాన్వీ భావిస్తోంది. అందుకే ఇప్పుడు మైండ్ సెట్ ని మార్చుకుంద‌ని భావించ‌వ‌చ్చు.
Tags:    

Similar News