ఏపీ టిక్కెట్టు పై ఎటాక్.. అదే ధైర్యంతోనా?

Update: 2021-12-12 13:30 GMT
ఏపీ స‌ర్కార్ సినిమా టిక్కెట్ ధ‌ర‌ల‌ను త‌గ్గించ‌డం తో ప‌రిశ్ర‌మ‌కి పెద్ద దెబ్బే త‌గిలింద‌న్న చర్చ సాగుతోంది. అద‌న‌పు షోల‌కు అనుమ‌తులు లేక‌పోవ‌డం.. టిక్కెట్ ధ‌ర‌లు త‌గ్గించ‌డం వంటి అంశాల‌తో ప‌రిశ్ర‌మ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఓవైపు జోరుగా విన‌తి ప‌త్రాలు అందుతున్నా ప్ర‌భుత్వం ఎంత మాత్రం వెన‌క్కి త‌గ్గ‌డం లేదు. సినీ పెద్ద‌లు ప్ర‌భుత్వ పెద్ద‌ల్ని ఎంత బ్ర‌తిమాలాడుతున్నా స‌సేమీరా అంటున్నారు. ఇప్ప‌టికే చిరంజీవి..సురేష్ బాబు..అల్లు అర‌వింద్..దిల్ రాజు లాంటి వారు ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఈ విష‌యంపై ఆలోచించాలంటూ ప‌లుమార్లు విజ్ఞ‌ప్తి చేసారు. అయినా లాభం లేక‌పోయింది.

బ్లాక్ దందాని.. వినోదం పేరుతో అద‌న‌పు దోపిడీని ఎట్టి ప‌రిస్థితుల్లో స‌హించేది లేద‌ని స‌ర్కారు ముందుకు వెళ్తోంది. దీనికి తోడు క‌రోనా కొత్త వేరియంట్లు పుట్టుకురావ‌డంతో వీలైనంత త‌క్కువ ఆక్యుపెన్సీతో థియేట‌ర్లు ర‌న్ చేయాలని ఆదేశాలివ్వ‌డానికి స‌ర్కారు సిద్ధ‌మ‌వుతోంది. దీంతో అప్ క‌మింగ్ రిలీజ్ ల‌పై మ‌రింత ప్ర‌భావం ప‌డుతుంది. అయితే నైజాం ప్రాంతం పంపిణీదారులు..ఎగ్జిబిట‌ర్లు..నిర్మాత‌లు.. జ‌గ‌న్ మీద‌ పోరాటానికి రెడీ అవుతున్న‌ట్లు ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది.

ఏషియ‌న్ సినిమాస్ అధినేత సునీల్ నారంగ్.. దిల్ రాజు స‌హా మ‌రికొంత మంది నిర్మాత‌లు..పంపిణీదారులు..ఆంధ్రా ఏరియాల్లో సినిమా వ్యాపారంలో ఉన్న వాళ్లంతా జ‌గ‌న్ పై ఎదురు దాడికి సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు గుస‌గుస వినిపిస్తోంది. అయితే వీరంతా ఒక్క‌డ ఓ స్టాండ్ తీసుకోవ‌డానికి ర‌క‌ర‌కాల కార‌ణాలున్నాయి. వీరంతా తెలంగాణ వాదులు కాబ‌ట్టి రాజ‌కీయ అంశాలు కూడా ఇందులో ఓ కార‌ణంగా చూపి విమ‌ర్శ‌లు గుప్పించ‌డానికి రెడీ అవుతున్న‌ట్లు టాక్ వినిపిస్తోంది. సునీల్ నారంగ్..దిల్ రాజు కి ఎక్కువ‌గా థియేట‌ర్లు నైజాం ఏరియాలోనే ఉన్నాయి. అక్క‌డ ప్ర‌భుత్వం నుంచి పెద్ద‌గా స‌మ‌స్య‌లు లేవు. ఏపీలో కొన్ని ఏరియాల్లో మాత్ర‌మే వీళ్లికి సొంత థియేట‌ర‌లు.. లీజుకు తీసుకున్న‌వి ఉన్నాయి. ఇక్క‌డ న‌ష్టాల్ని అక్క‌డ భ‌ర్తీ చేసుకుని సీఎంని టార్గెట్ చేస్తేనే దిగొస్తారు? అన్న నానుడిలో ఉన్న‌ట్లు తెలుస్తోంది.
Tags:    

Similar News