రాఘవేంద్రరావు ఇంట్లో భీభత్సం

Update: 2016-06-10 04:21 GMT
దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావుకు గురువారం చేదు అనుభవం ఎదురైంది. ఆయన ఇంటి దగ్గర రవీంద్ర అనే 28 ఏళ్ల యువకుడు భీభత్సం సృష్టించాడు. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ‘శ్రీరామదాసు’ కథ తనదే అని.. ఐతే సినిమా టైటిల్స్ లో స్టోరీ క్రెడిట్ ఇవ్వకుండా రాఘవేంద్రరావు తనను మోసం చేశాడని ఆరోపిస్తూ ఆ కుర్రాడు.. రాఘవేంద్రరావు - ఆయన కుటుంబసభ్యులపై దాడికి ప్రయత్నించాడు. ఇంటి ఆవరణలో భీభత్సం సృష్టించాడు. ఇంతకీ ఏం జరిగిందంటే..

గురువారం ఫిలింనగర్-2లోని తన ఇంటి నుంచి రాఘవేంద్రరావు కార్లో బయటికి వెళ్తుండగా.. అనంతపురం జిల్లా నల్లమాడ మండలం ఉద్దులవాడపల్లికి చెందిన రవీంద్ర అనే కుర్రాడు అడ్డం పడ్డాడు. ఆయన్ని తిట్టిపోస్తూ కారు డోరు పగలగొట్టేందుకు ప్రయత్నించాడు. వాచ్‌ మ్యాన్ అడ్డుకునే ప్రయత్నం చేసినా.. అతణ్ని తోసేసి రాఘవేంద్రరావు దగ్గరకు వెళ్లి ఆయన్ని  బయటకు లాగేందుకు ప్రయత్నించాడు. రాఘవేంద్రరావు అతడి వివరాలు కనుక్కునే ప్రయత్నించగా.. ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘శ్రీరామదాసు’ కథ తనదేనని.. ఆ కథను 2003లోనే రాసి పంపిస్తే కథా రచయితగా తన పేరు వేయకుండా మోసం చేశారని అంటూ అతను దుర్భాషలాడాడు.

ఐతే ఈ కథ భారవిదని చెబుతున్నా అతను వినలేదు. దీంతో రాఘవేంద్రరావు అతడి సంగతి వదిలేసి కార్లో వెళ్లిపోయారు. ఐతే రవీంద్ర అంతటితో ఆగలేదు. ఎదురుగా నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ దగ్గరికెళ్లి ఓ రాడ్ తీసుకుని.. రాఘవేంద్రరావు ఇంటిలోపలికి వెళ్లాడు. అక్కడున్న ఆడి.. బెంజి.. సాంత్రో కార్లను ధ్వంసం చేశాడు. ఇంటి అద్దాలు కూడా పగలగొట్టాడు. అడ్డువచ్చిన వాచ్‌ మ్యాన్ మీదా దాడి చేశాడు. రాఘవేంద్రరావు కొడుకు ప్రకాష్ వచ్చి అతణ్ని అడ్డుకోబోగా.. తన మీద కూడా దాడి చేయబోయాడు. చివరికి ప్రకాష్.. వాచ్ మ్యాన్ ఇద్దరూ కలిసి అతణ్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. రవీంద్ర మీద జూబ్లీ హిల్స్ పోలీసులు రెండు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
Tags:    

Similar News