నటి రాధికను విచారించనున్న అధికారులు!?

Update: 2021-01-08 01:30 GMT
ఓ చీటింగ్ కేసుకు సంబంధించి కన్నడ నటి రాధికా కుమార స్వామిని సీసీబీ అధికారులు విచారించనున్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ చోటా నాయకుడు యువరాజ్‌ ఇటీవల చీటింగ్‌ కేసులో అరెస్ట్‌ అయ్యాడు. అయితే.. ఆయన బ్యాంకు ఖాతా నుంచి నటి రాధికా కుమారస్వామికి, మరో నిర్మాతకు కోటి రూపాయల వరకు బదిలీ అయినట్లు సీసీబీ అధికారులు గుర్తించారు.

అయితే.. ఆ డబ్బులు రాధికా కుమారస్వామికి, నిర్మాతకు ఎందుకు అందాయి? దాని వెనకున్న కారణాలు ఏంటనే కోణంలో విచారించాలని అధికారులు నిర్ణయించారు. కాగా.. ఈ మోసం కేసులో రాధిక సోదరున్ని ఇప్పటికే అధికారులు ప్రశ్నించారు. ఈ సందర్భంగా అనేక విషయాలను సేకరించినట్టు సమాచారం.

చీటింగ్ కేసులో ముద్దాయిగా ఉన్న యువరాజ్.. తనకు పెద్ద పెద్ద ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ నాయకులు తెలుసని, ఏ పనులు కావాలన్నా చేయిస్తానంటూ పలువురి నుంచి నగదు స్వాహా చేశాడనే అభియోగం ఎదుర్కొంటున్నాడు. అయితే.. ఈ డబ్బు  పెద్దమొతాల్లోనే కాజేసినట్టు ఫిర్యాదులు రావడంతో సీసీబీ పోలీసులు అతన్ని అరెస్ట్‌ చేశారు.

అయితే.. యువరాజ్‌ కుటుంబానికి.. తమ కుటుంబానికి మంచి సంబంధాలు ఉన్నట్లు రాధికా కుమారస్వామి తెలిపారు. ఆమె బుధవారం బెంగళూరు డాలర్స్‌ కాలనీలో విలేకర్లతో మాట్లాడారు. ఆయన అకౌంట్‌ నుంచి రూ.15 లక్షలు ఒక సినిమా అడ్వాన్స్‌గా మాత్రమే తన ఖాతాకు బదిలీ అయిందన్నారు. తన తమ్ముడు రవిరాజ్‌ అకౌంట్‌కు ఏమీ బదిలీ కాలేదన్నారు.
Tags:    

Similar News