కొత్త సినిమాల్ని ఉతికారేసిన బాహుబలి-2

Update: 2017-05-15 07:24 GMT
‘బాహుబలి: ది కంక్లూజన్’ విడుదలై రెండున్నర వారాలు దాటింది. అయినా ఆ సినిమా జోరేమీ తగ్గలేదు. మూడో వారాంతంలో సైతం ఈ సినిమా హౌస్ ఫుల్ వసూళ్లతో నడవడం విశేషం. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు.. దేశమంతటా ‘బాహుబలి-2’ జోరు కొనసాగుతోంది. ఈ శని.. ఆదివారాల్లో ‘బాహుబలి-2’ థియేటర్లు కళకళలాడాయి. ఫస్ట్ షో.. సెకండ్ షోలకు టికెట్లు దొరకని పరిస్థితి. ఇంకా ఒక్కసారీ సినిమా చూడని వాళ్లూ చూస్తున్నారు.. ఆల్రెడీ సినిమా చూసిన వాళ్లూ థియేటర్లకు వస్తున్నారు. తెలుగుతో పాటు మిగతా భాషల్లోనూ కొత్త సినిమాలేవీ ‘బాహుబలి-2’ ముందు నిలవలేని పరిస్థితి కనిపిస్తోంది.

ఈ శుక్రవారం రిలీజైన ‘రాధ’ సినిమా తొలి రోజు బాగానే వసూళ్లు రాబట్టింది కానీ.. రెండో రోజుకు జోరు తగ్గింది. ‘వెంకటాపురం’ పరిస్థితి అంతంతమాత్రంగానే ఉంది. ‘రక్షక భటుడు’ గురించి మాట్లాడటానికి ఏమీ లేదు. ఈ కొత్త సినిమాల కంటే కూడా ‘బాహుబలి-2’ థియేటర్లలోనే ఎక్కువ జనాలు కనిపిస్తున్నారు. కలెక్షన్లు వస్తున్నాయి. ఐతే తెలుగు సినిమాల పరిస్థితే కొంచెం నయం కానీ.. హిందీలో అయితే బాహుబలి-2 ధాటికి కొత్త సినిమాలు అస్సలు నిలవలేకపోయాయి. రామ్ గోపాల్ వర్మ ‘సర్కార్-3’ పూర్తి డివైడ్ టాక్‌తో మొదలై.. రెండో రోజుకే వీక్ అయిపోయింది. దీంతో పాటు రిలీజైన ‘మేరి ప్యారి బిందు’ పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంది. దానికి ఓపెనింగ్స్ కూడా లేవు. మరోవైపు తమిళ.. మలయాళ భాషల్లో కొత్త సినిమాల పరిస్థితి కూడా అంతంతమాత్రంగానే ఉంది. అన్ని చోట్లా బాహుబలి-2నే హవా సాగిస్తోంది.
Tags:    

Similar News