తెలుగు సినిమా చరిత్రలో ఇదే తొలిసారి..

Update: 2016-03-28 09:13 GMT
సరిహద్దులు చెరిపేస్తూ చారిత్రక విజయం సాధించిన ‘బాహుబలి’ ఇప్పుడు మరోసారి చరిత్ర సృష్టించింది. కేంద్ర ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మక జాతీయ పురస్కారాల్లో ఉత్తమ చిత్రంగా ఎంపికై సంచలనం రేపింది. దేశంలో జాతీయ అవార్డులకున్న విశిష్టత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 1954లో జాతీయ అవార్డులు ప్రవేశపెట్టినప్పటి నుంచి ఈ 62 ఏళ్లలో ఓ తెలుగు సినిమా ‘జాతీయ ఉత్తమ చిత్రంగా’ ఎంపికవడం ఇదే తొలిసారి. గతంలోనూ తెలుగులో ఎన్నో అద్భుతమైన సినిమాలొచ్చాయి. కె.విశ్వనాథ్ తీసిన శంకరాభరణం - స్వాతిముత్యం లాంటి సినిమాలతో పాటు ముత్యాలముగ్గు - మేఘసందేశం లాంటి సినిమాలు జాతీయ ఉత్తమ చిత్రంగా ఎంపికవుతాయేమో అన్న ఆశ కలిగింది. కానీ ఆ ఆశలు నెరవేరలేదు.

ఇక ఆ తర్వాత జాతీయ ఉత్తమ చిత్రం మీద ఆశలు పూర్తిగా అడుగంటిపోయాయి. తెలుగు సినిమా ప్రమాణాలు అంతకంతకూ దిగజారి.. ఓ దశలో ఉత్తమ ప్రాంతీయ చిత్రం అవార్డు కోసం కూడా అంగలార్చే పరిస్థితి వచ్చింది. 2009 నుంచి వరుసగా మూడేళ్ల పాటు కనీసం ప్రాంతీయ చిత్రంగా ఎంపిక చేయడానికి కూడా మన సినిమాలు పనికి రావని తేల్చేశారు. ఇలాంటి సమయంలో 2012లో ‘ఈగ’ సినిమాకు ఉత్తమ ప్రాంతీయ చిత్రం పురస్కారంతో పాటు విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో జాతీయ అవార్డు కూడా దక్కాయి. తర్వాతి రెండేళ్లు నా బంగారుతల్లి.. చందమామ కథలు ఉత్తమ ప్రాంతీయ చిత్రాలుగా ఎంపికయ్యాయి. ఇప్పుడు ‘బాహుబలి’ ఏకంగా జాతీయ ఉత్తమ చిత్రంగా నిలబడి చరిత్ర సృష్టించింది.
Tags:    

Similar News