ప్ర‌భాస్ ఆ రికార్డుల్ని `పీకే`స్తాడా?!

Update: 2015-09-15 09:30 GMT
ఇండియాలోనే అత్యంత భారీ బ‌డ్జెట్‌ తో తెర‌కెక్కిన చిత్రం అని చెప్పినా, బిగ్గెస్ట్ మోష‌న్ పిక్చ‌ర్ అన్న ట్యాగ్‌ లైన్‌ తో విడుదలైనా మొద‌ట   `బాహుబలి`ని హిందీ ప‌రిశ్ర‌మ వ‌ర్గాలు లైట్‌ గానే తీసుకొన్నాయి. సినిమాని స్వ‌యంగా చూసిన క‌ర‌ణ్‌ జోహార్ అండ్ బ్యాచ్‌ కి మిన‌హా మిగ‌తా ఎవ్వ‌రికీ సినిమాపై పెద్ద అంచ‌నాలు ఉండేవి కాదు. విడుద‌ల‌యిన త‌ర్వాతే `బాహుబ‌లి` స‌త్తా ఏంటో హిందీ జ‌నాల‌కు తెలిసిపోయింది. అమితాబ్ బ‌చ్చ‌న్‌ - స‌ల్మాన్‌ ఖాన్‌ - షారుఖ్ ఖాన్‌ - అమీర్‌ ఖాన్‌ లాంటి సూప‌ర్‌ స్టార్స్  సైతం సినిమా అద్భుతం అని కితాబునిచ్చారు. అయితే ఎంత‌మంది ఆ సినిమాని అద్భుతం అని కీర్తించినప్ప‌టికీ బాలీవుడ్ రికార్డుల్ని `బాహుబ‌లి` అధిగ‌మిస్తుంద‌ని మాత్రం ఎవ్వ‌రూ అనుకోలేదు. కానీ ఒకొక్క బాలీవుడ్ హిట్ సినిమాని అధిగ‌మిస్తూ `బాహుబ‌లి` అద్భుతాల్ని సృష్టించింది. హిందీ చిత్రాల్లాగే ఓపెనింగ్స్‌ తోనే కాక‌పోయినా స్థిరంగా ఆడుతూ యాభై రోజులు పూర్త‌య్యేస‌రికి దేశీయంగా అత్య‌ధిక గ్రాస్ వ‌సూలు చేసిన చిత్రంగా `బాహుబ‌లి` రికార్డు సృష్టించింది. ఓ రీజ‌న‌ల్ లాంగ్వేజ్‌ లో తెర‌కెక్కిన `బాహుబ‌లి` హిందీలోకి డ‌బ్బింగ్ సినిమాగా వెళ్లి అక్క‌డ వంద కోట్ల‌కు పైగా వసూలు చేసింది. అది చూసి హిందీ జ‌నాలు సైతం ముక్కున వేలేసుకొన్నారు. ఇక ఇప్పుడు టార్గెట్ `పీకే` రికార్డుల్ని అధిగ‌మించ‌డం ఒక్క‌టే.

అమీర్‌ ఖాన్‌ కి అంత‌ర్జాతీయ స్థాయిలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండ‌టం `పీకే`కి బాగా క‌లిసొచ్చింది.  చైనాలో మాత్ర‌మే ఆ సినిమా వంద కోట్లు వ‌సూళ్లు సాధించింది. అయితే ఇప్పుడు `బాహుబ‌లి`ని కూడా అంత‌ర్జాతీయ‌స్థాయిలో ప్రమోట్ చేయాల‌ని డిసైడ్ అయ్యింది ఆ చిత్ర‌బృందం. ఇంట‌ర్నేష‌న‌ల్ వ్యాల్యూస్‌ తో ప్ర‌త్యేకంగా సినిమాని ఎడిట్ చేసి వివిధ దేశాల్లో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. కేవ‌లం చైనాలోనే 5వేల థియేట‌ర్ల‌లో సినిమాని విడుద‌ల చేస్తున్నారు. అక్క‌డ `పీకే` త‌ర‌హాలోనే  వంద కోట్లు వ‌సూళ్లు సాధించిందంటే మాత్రం `బాహుబ‌లి` ఇండియాస్ నెంబ‌ర్ వ‌న్ సినిమాగా అవ‌త‌రించే అవ‌కాశాలున్నాయి. `బాహుబ‌లి` చైనాలో వంద కోట్లు సాధించ‌డం సులువే అని సినీ ట్రేడ్ వ‌ర్గాలు అభిప్రాయ‌ప‌డుతున్నాయి. `పీకే` కేవ‌లం కంటెంట్ బేస్డ్ ఫిల్మే అని, `బాహుబ‌లి`లో కంటెంట్‌ తోపాటు, అబ్బుర‌ప‌రిచే గ్రాఫిక్స్ ఉన్నాయి కాబ‌ట్టి ఆ గ్రాండియ‌ర్‌ ని చూసి చైనా ప్రేక్ష‌కులు ఫిదా అయిపోవ‌డం గ్యారెంటీ అని జోస్యం చెబుతున్నాయి. ఒక‌వేళ అదే నిజ‌మైతే అమీర్‌ ఖాన్‌ లాంటి సూప‌ర్‌ స్టార్‌ ని ప్ర‌భాస్ అధిగ‌మించిన‌ట్టే లెక్క‌. అన్న‌ట్టు `పీకే` సినిమాని  చైనాలో రిలీజ్ చేసిన సంస్థ‌నే `బాహుబ‌లి`ని కూడా విడుద‌ల చేస్తుండ‌టం విశేషం.
Tags:    

Similar News