దర్శక ధీరుడు జక్కన్న చెక్కిన సినీ శిల్పం `బాహుబలి`కి ప్రేక్షకులు నీరాజనాలు పలికిన సంగతి తెలిసిందే. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపవలసి వచ్చింది....దానికి దారితీసిన పరిస్థితులు ఏమిటి? అన్న ఉత్కంఠను ప్రపంచవ్యాప్తంగా రేకెత్తించడంతో `బాహుబలి-2` పై విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. అయితే, ఆ క్రేజ్ ను కొంతమంది ప్రొడ్యూసర్లు, ఎగ్జిబిటర్లు(మల్టి ప్లెక్స్ లు)...దొంగదారిలో సొమ్ము చేసుకున్నారనే విషయాన్ని తాజాగా ఓ ఇంగ్లిష్ పత్రిక బట్టబయలు చేసింది. `బాహుబలి-2` విడుదల సందర్భంగా...ప్రేక్షకుల నుంచి వారంతా కలిసి ఏకంగా రూ.100 కోట్ల రూపాయల వరకు ఏ విధంగా కొల్లగొట్టారో తన కథనంలో వెల్లడించింది. టిక్కెట్ల అమ్మకాల్లో ప్రేక్షకులను ఏరకంగా మోసగించింది వివరించింది. సీహెచ్ దివాకర్ బాబు అనే ఆర్టీఐ యాక్టివిస్ట్ ఈ విషయాన్ని వెలుగులోకి తెచ్చారు.
`బాహుబలి-2`కి విపరీతమైన హైప్ రావడంతో....విడుదలైన వారం రోజుల వరకు టికెట్ దొరకని పరిస్థితి ఉన్న సంగతి తెలిసిందే. దీంతో, సాధారణ టికెట్ రేటు రూ.150 కు అదనంగా మరో 50 రూపాయలను ప్రేక్షకుల నుంచి కొంతమంది ప్రొడ్యూసర్లు, ఎగ్జిబిటర్లు(మల్టి ప్లెక్స్ లు) వసూలు చేశారు. అయితే, అదనంగా రూ.50 వసూలు చేసినందుకు ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతి పొందలేదు. ఇలా అదనంగా వసూలు చేయడం వల్ల మల్టి ప్లెక్స్ లకు, వాటి నుంచి పర్సెంటేజ్ అందుకునే నిర్మాతలకు దాదాపుగా రూ.100 కోట్ల అక్రమ ఆదాయం చేకూరింది. అదనపు చార్జ్ వసూలు చేయడంపై సీహెచ్ దివాకర్ బాబు అనే ఆర్టీఐ యాక్టివిస్ట్ ...చీఫ్ సెక్రటరీకి లేఖ రాశారు. అయితే, ఆయన నుంచి స్పందన రాలేదు. దీంతో, రాష్ట్ర సమాచార శాక కమిషనర్ ను ఆయన సంప్రదించారు. ఆయనను సంప్రదించిన ఏడాది తర్వాత 2018లో ప్రభుత్వం తరఫు నుంచి ఈ వివరాలను దివాకర్ బాబు సంపాదించగలిగారు. రూ.150 కు అదనంగా రూ.50 వసూలు చేసేందుకు మల్టీప్లెక్స్ లకు తాము అనుమతినివ్వలేదని తెలంగాణ సర్కార్ ....దివాకర్ బాబుకు సమాధానమిచ్చింది. దీంతో, కొంతమంది ప్రొడ్యూసర్లు, ఎగ్జిబిటర్లు(మల్టి ప్లెక్స్ లు) గుట్టు రట్టయింది. ఈ వ్యవహారాన్ని వెలుగులోకి తెచ్చి....మల్టీ ప్లెక్స్ ల నిలువు దోపిడీని బట్టబయలు చేసిన దివాకర్ బాబు ప్రశంసనీయుడు!