బాహుబలి నిర్మాతలకు ఆ ఫీలింగ్ లేదు

Update: 2015-08-02 13:49 GMT
బాహుబలి సినిమాను హిందీలో కరణ్ జోహార్ విడుదల చేశాడన్న సంగతి తెలిసిందే. ఐతే విడుదలకు ముందు వరకు కరణ్ బాహుబలిని విడుదల చేయడం రాజమౌళి టీమ్ చేసుకున్న అదృష్టమన్నారు. కానీ ఇప్పుడు ఆ సినిమా హిందీలో సాధించిన కలెక్షన్లు చూస్తుంటే అదృష్టం కరణ్ దే అన్నట్లుంది. మహా అయితే ఏ 20 కోట్లకో సినిమాను కొని ఉంటాడు కరణ్. ఇప్పుడా సినిమా వంద కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబడుతోంది. షేర్ లెక్కల ప్రకారం చూస్తే కరణ్ కు పెట్టుబడి మీద రెండు రెట్లు లాభం వచ్చి ఉంటుందనడంలో సందేహం లేదు. బహుశా బాహుబలి నిర్మాతలు కానీ, కరణ్ కానీ.. బాహుబలి హిందీ వెర్షన్ ఈ స్థాయిలో కలెక్షన్లు రాబడుతుందని ఊహించి ఉండరు.

ఐతే చాలా తక్కువ రేటుకు హిందీ వెర్షన్ అమ్మేశామనే ఫీలింగ్ ఏమీ బాహుబలి నిర్మాతలకు లేదు. ఎందుకంటే బాహుబలి కరణ్ చేతుల మీదుగా విడుదల కాబట్టే ఆ సినిమాకు అంత ప్రచారం వచ్చింది. సినిమా జనాలకు చేరువైంది. ఇప్పుడు నష్టపోయామనుకున్నా.. రెండో పార్టు విషయంలో భారీ లాభం తెచ్చుకోవడానికి అవకాశముంది. సెకండ్ పార్ట్ హక్కులకు సంబంధించి కరణ్ తో ఒప్పందమేమీ జరగలేదు. కాబట్టి తొలి భాగానికి వచ్చిన అద్భుతమైన రెస్పాన్స్ తో రెండో పార్ట్ మీద ఇప్పటికే హైప్ మొదలైపోయింది. బాలీవుడ్ ప్రేక్షకులు కూడా బాహుబలి-2 కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. తొలి పార్ట్ తో భారీగా లాభాలు తెచ్చుకున్న కరణ్.. రెండో పార్ట్ ను తక్కువకు పట్టేయాలని అత్యాశకు పోయే అవకాశం లేదు. బాహుబలి నిర్మాతలు కూడా రెండో పార్టును మాగ్జిమం రేటుకు కరణ్ కు అమ్మే అవకాశముంది. కాబట్టి బాహుబలి వల్ల కరణ్ ఎంత ప్రయోజనం పొందాడో.. ఫైనల్ గా నిర్మాతలకూ అంతే లాభం దక్కినట్లవుతుంది.
Tags:    

Similar News