2019 అయినా ప‌రువు ద‌క్కించాలి!

Update: 2018-12-24 08:35 GMT
2018 ఇంకో ఆరు దినాల్లో ముగుస్తోంది. కొత్త సంవ‌త్స‌రం సెల‌బ్రేష‌న్స్ కి యూత్ రెడీ అవుతోంది. సినీప‌రిశ్ర‌మ సైతం న్యూఇయ‌ర్ గెట్ టుగ‌ద‌ర్ పార్టీల‌కు ఏర్పాట్లు చేసుకుంటోంది. మూవీ ఆర్టిస్టుల సంఘం సైతం అత్య‌ద్భుతంగా ఈ కార్య‌క్ర‌మానికి స‌న్నాహాలు చేస్తోంది. అయితే మా అసోసియేష‌న్ గ‌తం ఓ పీడ క‌ల‌లాంటిది. 2018  అంతా అంద‌రితోనూ అప‌వాదుల్ని ఎదుర్కోవాల్సి వ‌చ్చింది. మూవీ ఆర్టిస్టుల సంఘం త‌న‌కు స‌భ్య‌త్వం ఇవ్వ‌లేద‌న్న మిష‌తో శ్రీ‌రెడ్డి శివాజీ రాజాను, ఇత‌ర క‌మిటీ స‌భ్యుల్ని తీవ్రంగా నిందించింది. విదేశాల్లో నిధి సేక‌ర‌ణ ఈవెంట్ల పేరుతో దోచుకోవ‌డంపైనా ప్ర‌శ్నించింది. ఆర్టిస్టుల సంఘం లో స‌భ్య‌త్వం కావాలంటే ల‌క్ష‌ల్లో చెల్లించాల‌ని, అందువ‌ల్ల ఎంద‌రో ఆర్టిస్టులు స‌భ్య‌త్వం లేకుండా న‌లిగిపోతున్నార‌ని శ్రీ‌రెడ్డి ఆరోపించింది. అయితే ఈ ఆరోప‌ణ‌ల‌కు స‌రైన స‌మాధానం ఇవ్వ‌డంలో మూవీ ఆర్టిస్టుల సంఘం త‌డ‌బ‌డింది. ప్ర‌త్యారోప‌ణ‌లు చేయ‌బోయి అడ్డంగా మీడియా ముందు దొరికిపోయింది మా.

ఆ ర‌చ్చంతా గ‌డిచిందిలే అనుకుంటే అమెరికాలో ఈవెంట్ల మాటున ఆర్టిస్టుల భ‌రితెగింపుడు వ్య‌వ‌హారం వెలుగులోకి రావ‌డంతో మ‌రోసారి దానికి మా అసోసియేష‌న్ అక్షింత‌లు వేయించుకోవాల్సి వ‌చ్చింది. మ‌రోవైపు మా సిల్వ‌ర్ జూబ్లీ ఈవెంట్‌లో జ‌రిగిన నిధుల గోల్‌మాల్, అవ‌క‌త‌వ‌క‌ల వ్య‌వ‌హారంపై సాక్షాత్తూ క‌మిటీలో కీల‌క వ్య‌క్తి అయిన సీనియ‌ర్ న‌రేష్ ఆరోపించ‌డంతో అధ్య‌క్షుడు శివాజీ రాజాపైనా మీడియా ముఖంగా విరుచుకుప‌డ‌డం ర‌చ్చ‌కెక్కింది. అంత‌టితో స‌రిపోదు అన్న‌ట్టు మా సిల్వ‌ర్ జూబ్లీ ఈవెంట్ కి స‌హ‌క‌రించిన మెగాస్టార్ ని ఈ రింగులోకి లాగి పెద్ద త‌ప్పిదం చేసింది మా అసోసియేష‌న్.

ఒక‌టి కాదు.. రెండు కాదు.. వెతికితే ఇలాంటి త‌ప్పిదాలెన్నో. 2018 బ్యాడ్ డేస్ ఇప్ప‌టితో ముగిశాయ‌నే అనుకోవాలి. అసోసియేష‌న్ ఇక‌పై అయినా నిర్మాణాత్మ‌క మార్పుల‌కు శ్రీ‌కారం చుట్టాలి. అప్ప‌ట్లోనే గొడ‌వ‌ల వ‌ల్ల అమెరికాలో జ‌ర‌గాల్సిన రెండో ఈవెంట్ వాయిదా ప‌డింది. అయితే ఆ ఈవెంట్ ని  కొత్త సంవ‌త్స‌రంలో నిర్వ‌హించి నిధుల్ని సేక‌రిస్తార‌ట‌. వ‌చ్చిన నిధితో మా అసోసియేష‌న్ కి సొంత బిల్డింగ్ ప్లాన్ చేస్తున్నామ‌ని ప్ర‌క‌టించారు. నేడు మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) డైరీ ఆవిష్క‌రించారు. సూప‌ర్ స్టార్ కృష్ణ‌- విజ‌య‌నిర్మ‌ల దంప‌తులు, రెబల్ స్టార్ కృష్ణంరాజు- శ్యామ‌ల దంప‌తులు అపోలో ఆస్ప‌త్రిలో జ‌రిగిన ఈవెంట్ లో పాల్గొని మా డైరీని ఆవిష్క‌రించారు. కొత్త సంవ‌త్స‌రంలో మా అసోసియేష‌న్ సొంత బిల్డింగ్ నిర్మించాల‌ని ఆకాంక్షించారు.
Tags:    

Similar News