సింగిల్ స్క్రీన్ల మ‌నుగ‌డ ఇక‌పై క‌ష్ట‌మేనా?

Update: 2020-05-17 17:12 GMT
థియేట‌ర్ మాఫియా.. థియేట‌ర్ సిండికేట్.. అంటూ ర‌క‌ర‌కాల ఆరోప‌ణ‌లున్నాయి. పండ‌గలు ప‌బ్బాల వేళ కూడా త‌మ‌కు థియేట‌ర్లు ఇవ్వ‌కుండా మోకాల‌డ్డుతుంటార‌ని చిన్న నిర్మాత‌లు ఆరోపిస్తుంటారు. ఆ న‌లుగురు లేదా ఆ ప‌ది మంది చేతిలోనే థియేట‌ర్ వ్య‌వ‌స్థ చ‌ట్టుబండ‌లైంద‌న్న‌ది టాలీవుడ్ లో ప్ర‌ధాన ఆరోప‌ణ‌. త‌మ సినిమాలు ఆడించుకునేందుకే ఈ థియేట‌ర్లను గుప్పిట ప‌ట్టి వేరే వాళ్ల‌కు ఇవ్వ‌కుండా ప‌రిశ్ర‌మ‌ను న‌లిపేస్తున్నార‌ని .. చిన్న‌వాళ్ల‌ను కొత్త వాళ్ల‌ను అణ‌చివేస్తుంటార‌ని తీవ్ర ఆరోప‌ణ‌లు చేసేవాళ్లున్నారు. కొత్తగా వ‌చ్చిన నిర్మాత‌లు ఏదో తెలియ‌క అలా అనేస్తుంటారు నోటికొచ్చిన‌ది అనుకుంటే.. ఈ ప‌రిశ్ర‌మ‌లో జ‌మానా కాలం నుంచి కొన‌సాగుతున్న నిర్మాత‌లెంద‌రో ఇదే వాద‌న‌ను ప‌దే ప‌దే తెర‌పైకి తెచ్చారు. ద‌ర్శ‌క‌ర‌త్న దాస‌రి అంత‌టి వాడే ఎన్నోసార్లు థియేట‌ర్ మాఫియాపై బ‌ర‌స్ట్ అయ్యారు. ప‌బ్లిగ్గానే సిండికేట్ అంటూ తూర్పార‌బ‌ట్టారు. ఇది ఎప్ప‌టికీ తెగ‌ని యుద్ధం.

ఇప్ప‌టికే మెజారిటీ పార్ట్ థియేట‌ర్లు ఆ న‌లుగురి చెంత‌నే ఉన్నాయి. సింగిల్ స్క్రీన్ల‌ను మ‌ల్టీప్లెక్సులుగా డెవ‌ల‌ప్ చేసింది వీళ్లే. అలాగే న‌గ‌రాల్లోని మ‌ల్టీప్లెక్సు థియేట‌ర్ల‌ను గుప్పిట ప‌ట్టింది వీళ్లే. కొత్త‌గా  మాల్స్ లో మ‌ల్టీప్లెక్సులు వీళ్ల కింద‌నే ఉన్నాయి. మ‌రెన్నో నిర్మాణ ద‌శ‌లో ఉన్నాయి. భ‌విష్య‌త్ లో నవ్యాంధ్ర‌లోనూ వీరిదే హ‌వా! అన్న విశ్లేష‌ణ ఉంది. అయితే క‌రోనా లాక్ డౌన్ కాలంలో తీవ్రంగా న‌ష్ట‌పోయిది కూడా వీళ్లేన‌న్న‌ది మ‌రో ఎనాలిసిస్. ఇదిలా ఉంటే ఎవరు ఎంత న‌ష్ట‌పోయినా మునుముందు ప‌రిస్థితులు ఆ న‌లుగురికే అనుకూలంగా మార‌నున్నాయ‌న్న మ‌రో కొత్త విశ్లేష‌ణ ఆందోళ‌న క‌లిగిస్తోంది.

చిన్న సినిమాల్ని ఆడించేందుకు ఎప్పుడూ థియేట‌ర్లు ఇవ్వ‌ర‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఆ భయాలు  రాబోయే రోజుల్లో మరింత పెర‌గ‌నున్నాయి. కరోనావైరస్ మహమ్మారి కారణంగా లాక్ డౌన్ ప్రారంభమై రెండు నెలలు పూర్త‌వుతోంది. ఇప్ప‌ట్లో థియేటర్లు తెరిచే సీన్ అయితే క‌నిపించ‌డం లేదు. రాబోయే 2-3 నెలల్లో థియేటర్లను తెరిచేందుకు అవ‌కాశం లేద‌ని తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలాసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. ఇలాంట‌ప్పుడు ఏ సిండికేట్ కింద లేని సింగిల్ స్క్రీన్ థియేటర్లు రాబోయే రోజుల్లో ఉనికి కోసం పోరాడే ప‌రిస్థితి వ‌స్తుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ప్రభుత్వ సహాయం లేకుండా వారు ఈ విప‌త్తు నుంచి కోలుకునే సీన్ కనిపించ‌డం లేదు. ప్రభుత్వం 50% ఆక్యుపెన్సీతో పనిచేయడానికి అనుమతించినప్పటికీ సింగిల్ స్క్రీన్లు ర‌న్ చేయ‌డం క‌ష్ట‌మే. ఇలాంటి స‌న్నివేశంలో అయితే ప్ర‌‌భుత్వం ఆదుకోవాలి. లేదా తాము ఆరోపించే ఆ సిండికేట్ మాఫియాపైనే ఆధార‌ప‌డాల్సి ఉంటుందని విశ్లేషిస్తున్నారు. ముందు నుయ్యి వెన‌క గొయ్యి స‌న్నివేశం  కొంద‌రు నిర్మాత‌లు ఎప్ప‌టికీ ఫేస్ చేయాల్సిందేన‌న్న విశ్లేష‌ణ సాగుతోంది. అన్నిటికీ కాల‌మే స‌మాధానం చెప్పాల్సి ఉంటుంది.


Tags:    

Similar News