'బాహుబ‌లి' కాలిగోటిని అయినా తాక‌లేదు..!

Update: 2022-06-04 06:34 GMT
ఏదైనా భారీ హిస్టారిక‌ల్ సినిమా రిలీజ్ కి వ‌స్తోంది అంటే బాహుబ‌లి తో పోల్చి చూడ‌డం స‌హ‌జం. ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్.ఎస్.రాజ‌మౌళి - ప్ర‌భాస్ - రానా క‌ల‌యిక‌లో వ‌చ్చిన ఈ సినిమా ఒక ప్ర‌భంజ‌నం. డే వ‌న్ లోనే దాదాపు 80 కోట్లు వ‌సూలు చేసి ఫుల్ ర‌న్ లో 600 కోట్లు పైగా వ‌సూలు చేసింది. ఆ త‌ర్వాత విడుద‌లైన బాహుబ‌లి 2 చిత్రం అంత‌కుమించి సంచ‌ల‌న‌మైంది. ఈ రెండు సినిమాలు క‌లిపి దాదాపు 1800 కోట్లు పైగా వ‌సూలు చేయ‌డం హాట్ టాపిక్ అయ్యింది. ఆ త‌ర్వాత డార్లింగ్ ప్ర‌భాస్ కెరీర్ అజేయంగా సాగుతోంది. పాన్ ఇండియా స్టార్ గా ప‌ట్టంగ‌ట్టి అత‌డు న‌టించిన ఫ్లాప్ సినిమాలకు కూడా అద్భుత ఓపెనింగుల్ని అందిస్తున్నారు.

అయితే బాహుబ‌లి త‌ర్వాత అదే ఫీవ‌ర్ తో వ‌చ్చిన చాలా హిందీ సినిమాలు ఏమాత్రం విజ‌యం సాధించ‌లేదు. అమీర్ ఖాన్- అమితాబ్ లాంటి దిగ్గ‌జాలు న‌టించిన థ‌గ్స్ ఆఫ్ హిందూస్తాన్ సైతం ఘోర‌ప‌రాయంతో వెనుదిరిగింది. టాప్ హీరోయిన్ దీపిక ప‌దుకొనే న‌టించిన రాణి కాన్సెప్ట్ మూవీ ప‌ద్మావ‌త్ దాదాపు 500కోట్లు వ‌సూలు చేయ‌గ‌లిగింది. అదే విజ‌య గ‌ర్వంతో దీపిక ఇప్పుడు ప్ర‌భాస్ స‌ర‌స‌న ప్రాజెక్ట్ కేలో నటిస్తోంది. భారీ పారితోషికాన్ని డిమాండ్ చేసిన సంగ‌తి తెలిసిందే.

ఇక‌పోతే ఎన్నో అంచ‌నాల‌తో రిలీజైన అక్ష‌య్ కుమార్ సామ్రాట్ పృథ్వీరాజ్ ఘోర‌మైన ఓపెనింగుల‌తో తీవ్రంగా నిరాశ‌ప‌ర‌చ‌డం అభిమానుల్లో ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ఎపిక్ క్లాసిక్ ని తెర‌కెక్కించినా కానీ ఇందులో ఆత్మ మిస్స‌య్యింద‌ని క్రిటిక్స్ విమ‌ర్శించారు. ఈ సినిమాకి ఓవ‌రాల్ గా మిశ్ర‌మ స్పంద‌న‌లు క్రిటిక్స్ నుంచి వ్య‌క్తమ‌య్యాయి. హిందీ ఆడియెన్ లో కొంద‌రికి న‌చ్చినా చాలా మంది ప్రేక్ష‌కులు న‌చ్చ‌లేద‌ని ట్వీట్లు చేసారు.

సామ్రాట్ పృథ్వీరాజ్ బాక్స్ ఆఫీస్ వ‌ద్ద‌ డే 1 ట్రెండ్స్ ని ప‌రిశీలిస్తే ఈ సినిమా ఒక‌టో రోజు కేవ‌లం 11 కోట్ల గ్రాస్ 5 కోట్ల షేర్ మాత్ర‌మే వ‌సూలు చేయ‌గ‌లిగింది. దీనిపై హిందీ మీడియా సైతం తీవ్రంగా విమ‌ర్శిస్తోంది. అక్ష‌య్ కుమార్ రేంజు ఇంతేనా? అంటూ విమ‌ర్శ‌లు ఎదుర‌వుతున్నాయి.  అక్షయ్ కుమార్ నటించిన ఈ చిత్రానికి అభిమానులు విమర్శకుల నుండి మిశ్రమ స్పందనలు వ్య‌క్త‌మ‌య్యాయి. మీడియాలోని ఒక వర్గం ఈ చిత్రాన్ని ప్రశంసించినా బాక్సాఫీస్ ఫ‌లితం నిరాశ‌ప‌రుస్తోంది.

సామ్రాట్ పృథ్వీరాజ్ అక్ష‌య్ న‌టించిన గ‌త‌ చిత్రం 'బచ్చన్ పాండే' కంటే తక్కువ ఆరంభ వ‌సూళ్ల‌ను సాధించింది.  మీడియా రిపోర్ట్ ప్రకారం ఈ చిత్రం 11కోట్ల వసూళ్లను రాబట్టింది. నిజానికి అక్ష‌య్ -జాక్వెలిన్ ఫెర్నాండెజ్- కృతి సనన్ - అర్షద్ వార్సీ కీలక పాత్రల్లో నటించిన బచ్చన్ పాండే విడుదలైన మొదటి రోజున 13.25 కోట్లు వసూలు చేయ‌గా అంత‌కంటే త‌క్కువ వ‌సూళ్ల‌ను సాధించింది.

అక్షయ్ కుమార్ లాంటి స్టార్ కి అలాంటి సంఖ్యలు సరిపోవు. ఎందుకంటే అభిమానులు ఎప్పుడూ ఎక్కువ అంచనాలతో ఉంటారు. అయితే సామ్రాట్ పృథ్వీరాజ్ బాక్సాఫీస్ వద్ద నిలదొక్కుకుని వ‌సూళ్ల‌ను పెంచుకోవాల‌ని అభిమానులు కోరుకోవాల్సిన ప‌రిస్థితి తలెత్తింది.

ట్రేడ్ విశ్లేషకులు హిమేష్ మకంద్ ప్రకారం, "#పృథ్వీరాజ్ మొదటి రోజు రెండంకెల దిశగా దూసుకెళ్లాడు. బడ్జెట్ - స్టార్-తారాగణం దృష్ట్యా ఈ చిత్రం నెమ్మదిగా ప్రారంభమైంది'' అని తెలిపారు. ఒక‌టో రోజు కేవం 11కోట్లు (సుమారు 5కోట్ల షేర్‌) వ‌సూలు చేసిన‌ట్టు త‌మిళ క్రిటిక్ బాలా వెల్ల‌డించారు. అంతేకాదు.. ముంబై- ఢిల్లీ- కోల్‌కతా ఇతర మెట్రోల వ‌సూళ్లు బలహీనంగా ఉన్నాయి. కానీ టైర్ 2 టైర్ 3 కేంద్రాలు చాలా మంచి క‌లెక్ష‌న్ల‌ను అందిస్తున్నాయ‌ని క్రిటిక్స్ వెల్ల‌డించారు. నిజానికి బాహుబ‌లి లాంటి చిత్రం ఉత్త‌రాది మెట్రోల్లో డే వ‌న్ అసాధార‌ణ వ‌సూళ్ల‌ను సాధించింది. బాహుబ‌లి 2 - కేజీఎఫ్ 2 చిత్రాలు కోట్లాది రూపాయ‌ల వ‌సూళ్ల‌తో అద్భుతాలను ఆవిష్క‌రించాయి.  

నిజానికి పృథ్వీరాజ్ చిత్రానికి విదేశాల్లో రిలీజ్ లేకుండా చేయ‌డం కూడా మైన‌స్ గా మారింది. ఈ చిత్రం కనికరంలేని ఆక్రమణదారు మొఘల్ చ‌క్ర‌వ‌ర్తి మహమ్మద్ ఘోర్ పై భారతీయ చక్రవర్తి చేసిన పోరాటాన్ని హైలైట్ చేస్తూ తెర‌కెక్కింది. దీనివ‌ల్ల ఈ మూవీ గ‌ల్ఫ్ లో నిషేధించ‌బ‌డింది. నిషేధం వెనుక ఉన్న కారణాలలో భార‌తీయ రాజును హైలైట్ చేయ‌డం ఒక ప్ర‌ధాన కార‌ణం. అంతకుముందు ద‌ళ‌పతి విజయ్ న‌టించిన‌ బీస్ట్ కూడా కువైట్ - ఖతార్ లలో నిషేధాన్ని ఎదుర్కొంది. విశ్లేషకుడు రమేష్ బాలా కూడా మతపరమైన ప్రాతినిధ్యం దీనంత‌టికీ కార‌ణ‌మ‌ని త‌న‌ ఆలోచన‌ల‌ను పంచుకున్నారు. సామ్రాట్ పృథ్వీరాజ్ చౌహాన్ చిత్రానికి చంద్ర‌ప్ర‌కాష్ ద్వివేది ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.
Tags:    

Similar News