అవి మాత్రం ఒప్పుకోను-బాలయ్య

Update: 2018-01-15 05:02 GMT
జైసింహతో సంక్రాంతి పండగను మరోసారి తనకు అనుకూలంగా మలుచుకున్న బాలకృష్ణ ఆ సినిమా రికార్డులు సృష్టించేంత ఘన విజయం సాధించనప్పటికీ కమర్షియల్ గా, మాస్ ఆడియన్స్ రెస్పాన్స్ పరంగా మిగిలిన వాటితో పోలిస్తే కొంత బెటర్ గా నిలవడం యూనిట్ లో సంతోషాన్ని నింపుతోంది. జైసింహ కోసం ప్రత్యేకంగా మీడియాతో ఇంటరాక్ట్ అవుతున్న బాలయ్య ఈ ఇంటర్వ్యూస్ లో కొన్ని ఆసక్తికరమైన సంగతులు పంచుకున్నాడు. ఈ సందర్భంగానే రీమేకుల గురించి ప్రస్తావన వచ్చింది. జైసింహ దర్శకుడు కెఎస్ రవికుమార్ చాలా కాలం క్రితమే ఒక తమిళ్ హిట్ మూవీకి రీమేక్ చేద్దామని అడిగాడని, కాని అలా చేస్తే తనకు వచ్చే పేరు ఉండదని భావించి వద్దు అనుకుని అప్పటి నుంచి వాటికి దూరంగా ఉన్నట్టు చెప్పాడు బాలయ్య. ఇప్పటి దాకా రీమేకే చేయని హీరోగా మహేష్ బాబు ఒక్కడే తన ట్రాక్ రికార్డు అలాగే కాపాడుకుంటూ వస్తున్నాడు.

బాలయ్య ఇప్పుడు రీమేక్ చేయడం లేదు కాని గతంలో అయితే చేసిన దాఖలాలు ఉన్నాయి. ఆయన కెరీర్లోనే బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్స్ లో ఒకటిగా నిలిచిన ముద్దుల మావయ్య తమిళ సినిమా ‘ఎన్ తంగాచ్చి పడిచివా’ రీమేకే. హైదరాబాద్ లాంటి కేంద్రాల్లో ఏడాదికి పైగా ఆడిన మంగమ్మ గారి మనవడు కూడా తమిళ్ ‘మన్ వాసనై’ నుంచి తీసుకుందే. విక్రం ‘సామీ’ని తెలుగుకు అనుగుణంగా మార్చి లక్ష్మి నరసింహ తీస్తే అది కూడా చక్కని విజయాన్ని అందుకుంది. కెరీర్ మొదట్లో చేసిన హింది దర్శకుడు సుభాష్ ఘాయ్ రూపొందించిన ‘కర్జ్’ రీమేక్ ఆత్మబలం ఒక్కటే దారుణ ఫలితాన్ని అందుకుంది. ఎన్టీఆర్ తో కలిసి నటించిన అన్నదమ్ముల అనుబంధం కూడా హింది ‘యాదోన్ కి బారత్’ రీమేక్.

గత కొన్నేళ్ళుగా మాత్రం బాలయ్య రీమేక్ జోలికి వెళ్ళలేదు. కెఎస్ రవికుమార్ ఎనిమిదేళ్ళ క్రితం చెప్పిన రీమేక్ సినిమా ఏదో మాత్రం బాలయ్య బయట పెట్టలేదు. కెఎస్ రవికుమార్ గతంలో చిరుతో తెలుగు సినిమా ‘స్నేహం కోసం’ చేసినప్పుడు అది అప్పుడు జనవరి 1 విడుదల అయితే అదే సంక్రాంతికి బాలకృష్ణ సమరసింహా రెడ్డితో వచ్చాడు. ఇప్పుడు కెఎస్ రవికుమార్ బాలకృష్ణతో జైసింహ చేస్తే చిరు తమ్ముడు పవన్ అజ్ఞాతవాసితో పోటీలో ఉన్నాడు. ఎంత కాకతాళీయమో కదా.
Tags:    

Similar News