టైటిల్స్ లోనే 'వీరత్వం' చూపిస్తున్న చిరు - బాలయ్య..!

Update: 2022-10-21 09:52 GMT
టాలీవుడ్ సీనియర్ హీరోలైన మెగాస్టార్ చిరంజీవి మరియు నటసింహం బాలకృష్ణ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. మాస్ గాడ్స్ నటిస్తున్న MEGA154 మరియు NBK107 చిత్రాలు త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నారు. మాస్ మసాలా యాక్షన్ చిత్రాలతో వస్తున్న వీరిద్దరూ.. టైటిల్ లోనే ‘వీరత్వం’ చూపించాలని కోరుకుంటున్నట్లు కనిపిస్తోంది.

కేఎస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ కు ''వాల్తేరు వీరయ్య'' అనే టైటిల్ ను ఖరారు చేసినట్లుగా చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. దీపావళి స్పెషల్ గా అక్టోబర్ 24న రిలీజ్ అయ్యే #Mega154 టైటిల్ టీజర్‌ తో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో రూపొందుతున్న ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ కీలక పాత్ర పోషిస్తున్నారు.

మరోవైపు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య హీరోగా #NBK107 వర్కింగ్ టైటిల్ తో ఓ మాస్ మసాలా ఎంటర్టైనర్ తెరకెక్కుతోంది. మైత్రీ బ్యానర్ లో రూపొందుతున్న ఈ సినిమాకి 'అన్నగారు' 'రెడ్డి గారు' 'వీర సింహా రెడ్డి' అనే టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి. వీటిల్లో 'వీర సింహారెడ్డి' టైటిల్‌ ని ఖరారు చేసినట్లు సమాచారం. కర్నూలు కొండా రెడ్డి బురుజు వేదికగా ఈరోజు సాయంత్రం ఈ టైటిల్‌ ను ప్రకటించనున్నారు.

ఇలా చిరు - బాలయ్య ఇద్దరూ యాదృచ్చికంగా తమ సినిమాల టైటిల్స్ లో 'వీర' అనే పేరుని పెట్టుకున్నారు. సీనియర్ హీరోలిద్దరూ టైటిల్స్ తోనే వీరత్వం చూపించడానికి రెడీ అవ్వడం ఇప్పుడు చర్చనీయంగా మారింది. దీనికి తోడు రెండు సినిమాలు కూడా 2023 సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద కూడా ఢీకొనే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.

టాలీవుడ్ లో మెగా - నందమూరి హీరోల మధ్య దశాబ్దాలుగా బాక్సాఫీస్ వార్ నడుస్తోంది. చిరంజీవి మరియు బాలకృష్ణ ఇద్దరూ గతంలో అనేక సందర్భాల్లో నువ్వా నేనా అనే విధంగా పోటీ పడ్డారు. అయితే చాలాకాలం తర్వాత ఇప్పుడు మళ్లీ ఒకే సీజన్ లో బరిలో దిగాలని చూస్తున్నారు.

'వాల్తేరు వీరయ్య' మరియు 'వీర సింహా రెడ్డి' సినిమాలని సంక్రాంతికి రిలీజ్ చేయాలని భావిస్తున్నట్లు నివేదికలు వస్తున్నాయి. ఇంకా విడుదల తేదీలు ప్రకటించబడలేదు కానీ.. ఒకే బ్యానర్ లో రూపొందే సినిమాలు కాబట్టి.. వచ్చే పండక్కి చాలా తక్కువ గ్యాప్‌ తో విడుదలయ్యే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది.

చిరు - బాలయ్య సినిమాలు బరిలో నిలుస్తున్నాయంటే.. బాక్సాఫీస్ వద్ద సందడి వేరేగా ఉంటుంది. ఇక సోషల్ మీడియాలో మెగా - నందమూరి ఫ్యాన్ మధ్య వార్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందులోనూ MEGA154 మరియు NBK107 మంచి హైప్ ఉంది. ఏ సినిమా మంచి టాక్ తెచ్చుకున్నా బాక్సాఫీస్ దద్దరిల్లడం ఖాయం.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన 'ఆదిపురుష్' చిత్రాన్ని సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. ఇక తమిళ హీరో విజయ్ 'వారసుడు' సినిమాతో పొంగల్ బరిలో దిగడానికి రెడీ అవుతున్నాడు. మరి ఇప్పుడు చిరంజీవి - బాలయ్య ఇద్దరూ పోటీలో ఉంటారా? ఇద్దరిలో ఒకరే ఉంటారా? అనేది త్వరలోనే వెల్లడి కానుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News