బాలయ్య అభిమానులు ఆందోళన

Update: 2017-05-11 16:54 GMT
నందమూరి బాలకృష్ణ ఎంచుకునే సినిమాలు అప్పుడప్పుడూ ఆశ్చర్యం కలిగిస్తుంటాయి. ఒకప్పటి ట్రాక్ రికార్డు చూసి.. సీనియర్ డైరెక్టర్లను నమ్మి వాళ్లతో సినిమాలు ఓకే చేసేస్తుంటాడు బాలయ్య. ఇంతకుముందు అలా బాలయ్య నమ్మకం పెట్టిన కొందరు సీనియర్లు ఆయన్ని గట్టి దెబ్బలే కొట్టారు. బి.గోపాల్ ‘పలనాటి బ్రహ్మనాయుడు’తో.. పి.వాసు ‘మహారథి’తో.. దాసరి నారాయణ రావు ‘పరమవీరచక్ర’తో బాలయ్యకు చేదు అనుభవాలు మిగిల్చారు.

ఇందులో ‘పరమవీరచక్ర’ సినిమాను ఒప్పుకోవడం మరీ విడ్డూరం. దాసరి ఫామ్ కోల్పోయి చాలా ఏళ్లయినప్పటికీ.. ఈ ట్రెండుకు తగ్గ సినిమాలు తీయలేక ఆయన దర్శకత్వాన్ని దాదాపుగా పక్కన పెట్టేసిన టైంలో బాలయ్య ఏరి కోరి ఆయనకు అవకాశం ఇచ్చారు. అది కూడా దశాబ్దం పాటు హిట్టు ముఖమే చూడని టైంలో లేక లేక ‘సింహా’తో మంచి సక్సెస్ ను ఖాతాలో వేసుకున్నాక బాలయ్య ఆ సినిమా చేశాడు. దాని ఫలితమేంటో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇక ఆ తర్వాత కొంచెం జాగ్రత్తగా సినిమాలు చేసుకుంటూ వస్తున్నాడు బాలయ్య. ఐతే ఇప్పుడు ‘గౌతమీపుత్ర శాతకర్ణి’తో కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న టైంలో ఆయన తమిళ సీనియర్ డైరెక్టర్ కె.ఎస్.రవికుమార్ తో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

రవికుమార్ చివరగా హిట్టు కొట్టి చాలా కాలమైంది. రజినీతో ఆయన తీసిన ‘లింగా’ పెద్ద డిజాస్టర్. ఆ తర్వాత రజినీనే కాదు.. మిగతా తమిళ హీరోలు కూడా ఆయనకు మొండిచేయే చూపిస్తూ వస్తున్నారు. ఇలాంటి టైంలో బాలయ్య కె.ఎస్.కు ఓకే చెప్పడం ఆశ్చర్యమే. పైగా ‘పరమవీరచక్ర’ సినిమాను నిర్మించిన సి.కళ్యాణే ఈ చిత్రాన్ని కూడా ప్రొడ్యూస్ చేయబోతుండటం గమనార్హం. దీంతో అభిమానులకు ఆ డిజాస్టర్ మూవీనే గుర్తుకొస్తోంది. మరి కె.ఎస్. జాగ్రత్తగా సినిమా తీసి.. బాలయ్యకు మంచి ఫలితాన్నిస్తాడేమో చూద్దాం.
Tags:    

Similar News