అంతన్నాడు ఇంతన్నాడు.. గణేష్ బాబు చివరకు ఉసూరుమనిపించాడు..!

Update: 2021-10-01 10:15 GMT
టాలీవుడ్ లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల వ్యవహారాలు రసవత్తరంగా సాగుతున్నాయి. సార్వత్రిక ఎన్నికలను తలపించేలా రోజురోజుకు ఆసక్తికరమైన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అక్టోబర్ 10వ తేదీన జరగనున్న ఎన్నిక కోసం ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. అధ్యక్ష బరిలో దిగుతున్న మంచు విష్ణు - ప్రకాశ్ రాజ్ ఇద్దరూ తమ ప్యానల్ సభ్యులతో కలిసి నామినేషన్స్ దాఖలు చేశారు. మరో వారంలో ఎలక్షన్ ఉందనగా 'మా' ఎన్నికల్లో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నట్లు నటుడు, నిర్మాత బండ్ల గణేష్ ప్రకటించారు.

'మా' ఎన్నికల్లో జనరల్ సెక్రటరీ పదవి కోసం స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన బండ్ల గణేష్.. తన నామినేషన్ ను ఉపసంహరించుకుంటున్నట్లు కొద్దిసేపటి క్రితం అసోసియేషన్ ఎన్నికల అధికారికి లేఖ రాశారు. "ఎన్నికలలో పోటీ చేయడానికి ఆసక్తి లేనందున నా నామినేషన్ ని రద్దు చేసినట్లు పరిగణించమని అభ్యర్థించారు. కలిగించిన అసౌకర్యానికి చింతిస్తున్నాము'' అని లేఖలో బండ్ల పేర్కొన్నారు.

బండ్ల గణేష్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ విషయాన్ని వెల్లడిస్తూ.. ''నా దైవ సమానులు నా ఆత్మీయులు నా శ్రేయోభిలాషుల సూచన మేరకు నేను 'మా' జనరల్ సెక్రెటరీ నామినేషన్ ఉపసంహరించుకున్నాను'' అని పేర్కొన్నారు. అంతేకాదు ప్రకాష్ రాజ్ కు మద్దతు తెలిపుతున్నట్లు ఆయనతో కలిసి దిగిన ఓ ఫోటోను షేర్ చేశారు బండ్ల గణేష్. నిన్నటి వరకు పలు ఇంటర్వ్యూలో జనరల్ సెక్రటరీ పదవి తనదే అని.. భారీ మెజారిటీతో గెలవబోతున్నానని ధీమా వ్యక్తం చేసిన బండ్ల.. ఇప్పుడు ఉన్నట్టుండి ఎన్నికల బరిలో నుంచే తప్పుకోవడం హాట్ టాపిక్ గా మారింది.

నిజానికి బండ్ల గణేష్ ప్రారంభంలో ప్రకాష్ రాజ్ ప్యానల్ లో భాగంగా ఉన్నాడు. అయితే జీవిత రాజశేఖర్ 'మా' జనరల్ సెక్రటరీ పదవికి పోటీ చేస్తుందనే కారణంగా స్వతంత్ర అభ్యర్థిగా ఆమెకు పోటీగా తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు. అయితే ఇప్పుడు మళ్లీ ప్రకాష్ రాజ్ ప్యానల్ కే తన సపోర్ట్ అంటూ ఎన్నిక నుంచి తప్పుకున్నాడు. దీంతో గణేష్ బాబు అంతన్నాడు ఇంతన్నాడు.. చివరకు ఉసూరుమనిపించాడు అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. గతంలో కూడా అనేక సందర్భాల్లో బండ్ల గణేష్ ఆవేశంలో ఏదో నిర్ణయం తీసుకోవడం.. ఆ వెంటనే మనసు మార్చుకోవడం.. సోషల్ మీడియాలో ఏదొక పోస్ట్ పెట్టి కామెడీ పుట్టించడం చూశాం. ఇప్పుడు తాజాగా అలాంటి వ్యవహార శైలితోనే మరోసారి వార్తల్లో నిలిచారు బండ్ల.




Tags:    

Similar News