2022 సంక్రాంతి విన్నర్ గా 'బంగార్రాజు'

Update: 2022-01-18 02:35 GMT
ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద పలు సినిమాలు పోటీ పడ్డాయి. మొదట్లో భారీ పాన్ ఇండియా చిత్రాలను విడుదల చేస్తున్నట్లు హడావుడి జరిగినా.. కరోనా నేపథ్యంలో చివరకు 'బంగార్రాజు' వంటి ఒక పెద్ద సినిమా మాత్రమే బరిలో నిలిచింది. '1945' 'అతిథి దేవోభవ' 'వేయి శుభములు కలుగు నీకు' 'రౌడీ బాయ్స్' 'హీరో' 'సూపర్ మచ్చి' వంటి సినిమాలు ఈ సీజన్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. వీటితోపాటు గతేడాది చివరి నెలలో విడుదలైన 'అఖండ' 'పుష్ప: ది రైజ్' వంటి సినిమాలు కూడా కొన్ని థియేటర్లలో ప్రదర్శించబడ్డాయి.

ఫెస్టివల్ సీజన్ లో రిలీజ్ అయిన సినిమాల బాక్సాఫీస్ లెక్కలను పరిశీలిస్తే ''బంగార్రాజు'' ఈ ఏడాది 'సంక్రాంతి విన్నర్' గా నిలిచిందని చెప్పవచ్చు. సంక్రాంతి పండుగను లక్ష్యంగా చేసుకుని రూపొందించిన ఈ సినిమా కోవిడ్ పరిస్థితులుల్లోనూ భారీ వసూళ్ళు సాధించింది. మూడు రోజుల్లోనే రూ. 53 కోట్లకు పైగా కలెక్ట్ చేసినట్లు మేకర్స్ తెలిపారు. హైదరాబాద్ - యూఎస్ఏ లలో ఆశించిన స్థాయిలో వసూళ్ళు రాకపోయినా.. ఆంధ్రప్రదేశ్ లో టికెట్ ధరలు తక్కువ ఉన్నా అక్కినేని హీరోలు ఈ మార్క్ అందుకోవడం విశేషం. ఏదైతేనేం 2022 ప్రారంభంలో బ్లాక్ బస్టర్ సాధించిన తొలి సినిమాగా బంగార్రాజు నిలిచింది.

బాక్సాఫీస్ వద్ద అఖండమైన విజయాన్ని అందుకున్న 'అఖండ' సినిమా.. 45 రోజుల తర్వాత కూడా అద్భుతమైన కలెక్షన్లను రాబట్టగలిగింది. తక్కువ థియేటర్లలో ప్రదర్శించబడినప్పటికీ.. హౌస్ ఫుల్స్ తో సంక్రాంతి సీజన్ ని సక్సెస్ ఫుల్ గా క్యాష్ చేసుకుంది. 'బంగార్రాజు' మినహా పెద్ద సినిమాలేవీ పోటీలో లేకపోవడం.. ఏడు వారాల తర్వాత ఓటీటీ రిలీజ్ అవుతుండటం వంటి అంశాలు ఈ చిత్రానికి కలిసొచ్చాయి.

ఆశిష్ రెడ్డి హీరోగా లాంచ్ చేయబడిన 'రౌడీ బాయ్స్' సినిమా యూత్ ఆడియన్స్ ను టార్గెట్ చేసుకొని వచ్చింది. దిల్ రాజు సపోర్ట్ ఉండటంతో అధిక థియేటర్లలో విడుదల చేయగలిగారు. పాన్ ఇండియా మూవీస్ తప్పుకోవడంతో అకస్మాత్తుగా రేసులోకి వచ్చిన ఈ సినిమా.. సరైన ఓపెనింగ్స్ రాబట్టలేకపోయింది. మాస్ ని ఆకర్షించే ఎలిమెంట్స్ ఉన్నా ఆశించిన స్థాయిలో స్పందన తెచ్చుకోలేకపోయింది. కాకపోతే డెబ్యూ హీరోగా ఆశిష్ కు మంచి మార్కులు పడ్డాయి.

కృష్ణ మనవడిగా మహేష్ బాబు మేనల్లుడుగా సూపర్ స్టార్ ఫ్యామిలీ సపోర్ట్ తో గల్లా ఫ్యామిలీ నుంచి అశోక్ హీరోగా పరిచయమైన చిత్రం ''హీరో''. లవ్ యాక్షన్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. అయితే తొలి సినిమాలోనే మంచి ఈజ్ తో నటించిన అశోక్ గల్లా.. తన డ్యాన్స్ లతో డెబ్యూ హీరోగా తనదైన ముద్ర వేయగలిగాడు.

క్రిస్మస్ సందర్భంగా విడుదలైన 'పుష్ప: ది రైజ్' సినిమా కూడా సంక్రాంతి సీజన్ లో కొన్ని థియేటర్లలో ప్రదర్శించబడింది. కాకపోతే అప్పటికే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుండటంతో బాక్సాఫీస్ వద్ద సందడి చేయలేకపోయింది. దాదాపుగా థియేట్రికల్ ఫుల్ రన్ ముగింపు దశకు చేరుకున్న ఈ చిత్రం.. పండుగ సమయంలో కొంతమంది ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించగలిగిందనే చెప్పాలి.

ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా థియేటర్లలోకి వచ్చిన 'సూపర్ మచ్చి' సినిమా పూర్తిగా నిరాశ పరిచింది. ప్రేక్షకులు లేకపోవడంతో పలు చోట్ల షోలు కూడా క్యాన్సిల్ చేసారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇక పండక్కి ముందు వారంలో రిలీజ్ కాబడిన '1945' 'అతిథి దేవోభవ' 'వేయి శుభములు కలుగు నీకు' సినిమాలు సంక్రాంతి సీజన్ లో ఏమాత్రం ప్రభావం చూపకుండానే అలా వచ్చి ఇలా వెళ్లిపోయాయి.
Tags:    

Similar News