రాజమౌళి క్లాప్ తో బెల్లంకొండ - వినాయక్ 'ఛత్రపతి' హిందీ రీమేక్ ప్రారంభం..!

Update: 2021-07-16 07:51 GMT
హ్యాపెనింగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ - స్టార్ డైరెక్టర్ వి.వి.వినాయక్ - బిగ్ ప్రొడక్షన్ హౌస్ పెన్ స్టూడియోస్ కాంబినేషన్ లో ఓ బాలీవుడ్ ప్రాజెక్ట్ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. దర్శకధీరుడు రాజమౌళి - యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ 'ఛత్రపతి' చిత్రాన్ని వీరు హిందీలో రీమేక్ చేయనున్నారు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందనున్న ఈ సినిమా షూటింగ్.. ఈరోజు శుక్రవారం హైదరాబాద్ లో గ్రాండ్ గా ప్రారంభించారు. ఈ వేడుకలో బెల్లంకొండ శ్రీనివాస్ - వి.వి.వినాయక్ - డా. జయంతి లాల్ మరియు రాజమౌళి - సుకుమార్ - ఏఎమ్ రత్నం సహా కొద్దిమంది ప్రత్యేక అతిథులు పాల్గొన్నారు.

'ఛత్రపతి' హిందీ రీమేక్ కు ముహూర్తం షాట్ కు రాజమౌళి క్లాప్‌ కొట్టగా.. రమా రాజమౌళి కెమెరా స్విచ్చాన్ చేశారు. స్క్రిప్ట్‌ ను విజయేంద్ర ప్రసాద్ మేకర్స్‌ కు అందించగా.. ప్రముఖ నిర్మాత ఎ.ఎం.రత్నం గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా పెన్ స్టూడియోస్ డైరెక్టర్ జయంతిలాల్ గడ మాట్లాడుతూ.. “టాలెంటెడ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మరియు పాపులర్ డైరెక్టర్ వివి వినాయక్ లతో ఈ ప్రాజెక్ట్ చేయడానికి మేము ఎంతో సంతోషిస్తున్నాము. ఈ సినిమా కచ్చితంగా ప్రేక్షకులను మెప్పిస్తుంది. భారతీయ సినిమాల్లో చరిత్ర సృష్టిస్తుందని మాకు నమ్మకం ఉంది” అన్నారు.

టాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకుపోతున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్.. డబ్బింగ్ సినిమాలతో నార్త్ ఆడియన్స్ కు కూడా దగ్గరయ్యాడు. యూట్యూబ్ లో యువ హీరో నటించిన సినిమాలను డబ్ చేసి రిలీజ్ చేస్తే మిలియన్ల కొద్దీ వ్యూస్ రాబడుతుంటాయి. ఈ నేపథ్యంలో మెగా బడ్జెట్ వెంచర్‌ తో సాయి శ్రీనివాస్ ఇప్పుడు బాలీవుడ్ లో అడుగుపెడుతున్నాడు. ఇక టాలీవుడ్ లో ఎన్నో బ్లాక్ బస్టర్స్ అందించిన మాస్ డైరెక్టర్ వి.వి.వినాయక్.. ఈ ప్రాజెక్ట్ తో బాలీవుడ్ లో ఎంటర్ అవుతున్నారు. 'అల్లుడు శీను' తో టాలీవుడ్‌ లో బెల్లంకొండ శ్రీనివాస్‌ ను హీరోగా పరిచయం చేసిన వినాయక్.. ఇప్పుడు హిందీలో కూడా లాంచ్ చేస్తుండటం గమనార్హం.

'ఛత్రపతి' ఒరిజినల్ స్టోరీ రైటర్, రాజమౌళి తండ్రి కె.వి.విజయేంద్ర ప్రసాద్ ఈ హిందీ రీమేక్ వెర్షన్‌ కు కథ అందిస్తున్నారు. 'బజరంగీ భాయిజాన్' 'మణికర్ణిక' వంటి బ్లాక్ బస్టర్ హిందీ చిత్రాలకు రచయితగా పేరు తెచ్చుకున్న 'బాహుబలి' రచయిత.. హిందీ ప్రేక్షకుల అభిరుచులకు, సున్నితత్వాలకు అనుగుణంగా 'ఛత్రపతి' స్క్రిప్ట్‌ లో మార్పులు చేశారని తెలుస్తోంది. ఈ సినిమా కోసం సాయి శ్రీనివాస్ భారీ వర్కవుట్స్ చేసి బాడీని బిల్డ్ చేసాడు. దీని కోసం బాలీవుడ్ సెలబ్రిటీ ట్రైనర్ ప్రశాంత్ సావంత్ ను తన వ్యక్తిగత శిక్షకుడిగా నియమించుకున్నారు. అంతేకాదు హిందీలో తన పాత్రకు స్వయంగా డబ్బింగ్ చెప్పుకోడానికి.. హిందీపై పట్టు సాధించడానికి ట్ట్యూటర్ ని కూడా పెట్టుకున్నాడు.

ఈ చిత్రానికి 'భలే భలే మగాడివోయ్' 'మహనుభవుడు' ఫేమ్ నిజార్ అలీ షఫీ సినిమాటోగ్రఫీ అందించగా.. బాలీవుడ్ మ్యూజిక్ కంపోజర్ తనీష్ బాగ్చి సంగీతం సమకూరుస్తున్నారు. అనిల్ అరుసు యాన్ కొరియోగ్రఫీని పర్యవేక్షిస్తారు. 'మహర్షి' 'గజినీ' 'స్పెషల్ 26' వంటి చిత్రాలకు వర్క్ చేసిన సునీల్ బాబు ప్రొడక్షన్ డిజైనర్ గా చేస్తున్నారు. మయూర్ పూరి ఈ చిత్రానికి డైలాగ్స్ అందిస్తున్నారు. 'రంగస్థలం' విలేజ్ సెట్ వేసిన ప్రదేశంలో ఈ చిత్రం కోసం భారీ సెట్ నిర్మించబడింది. ఈరోజు నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. ఈ చిత్రంలో సాహిల్ వైద్ - అమిత్ నాయర్ - రాజేంద్ర గుప్తా - శివం పాటిల్ - స్వాప్నిల్ - ఆశిష్ సింగ్ - మహ్మద్ మొనాజీర్ - అరోషికా డే - వేదిక - జాసన్ ఇతరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. పెన్ స్టూడియోస్ - పెన్ మారుధర్ సినీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ పై ధవల్ జయంతిలాల్ గడ మరియు అక్షయ్ జయంతిలాల్ గడా భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
Tags:    

Similar News