ఇండ‌స్ట్రీలో విషాదం.. బిగ్ బాస్ కంటిస్టెంట్ ఆత్మ‌హ‌త్య‌!

Update: 2021-01-25 11:30 GMT
కన్నడ నటి, బిగ్‌బాస్ మూడో సీజ‌న్‌ కంటిస్టెంట్  జయశ్రీ రామయ్య ఆత్మహత్య చేసుకుంది. ఆదివారం రాత్రి బెంగళూరులోని తన నివాసంలో ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంది. డిప్రెషన్‌ కారణంగానే ఆమె ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉంటుందని సన్నిహితులు భావిస్తున్నారు. ఈ వార్త‌తో కన్నడ చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది.

ఆమె మాన‌సిక కుంగుబాటు కార‌ణంగానే బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డి ఉంటుంద‌ని చాలా మంది భావిస్తున్నారు. తాను డిప్రెషన్‌లో ఉన్నట్లు గతేడాది జూలై 22న ఫేస్‌బుక్‌ పోస్ట్‌ ద్వారా అభిమానులకు వెల్లడించింది జ‌య‌శ్రీ. దీంతో అభిమానులు ఆందోళన వ్య‌క్తం చేయ‌డంతో వెంటనే ఆ పోస్టును తొలగించింది. ఆ త‌ర్వాత‌.. తాను బాగానే ఉన్నానని, కంగారు పడాల్సిన పని లేదని చెప్పింది. ఆ సమయంలో హీరో కిచ్చా సుదీప్ ఆమెకు ధైర్యం చెప్పినట్లు కూడా వార్తలు వ‌చ్చాయి.

మళ్లీ మూడు రోజుల వ్య‌వ‌ధిలో (జూలై 25న) అభిమానులతో లైవ్‌లో ముచ్చటించిన జయశ్రీ.. తన  మనసులోని ఆవేద‌న వెల్ల‌డించింది. ‘నేనిదంతా పబ్లిసిటీ కోసం చేయట్లేదు. సుదీప్‌ సర్‌ నుంచి ఆర్థిక సాయం కోరట్లేదు. నా చావును మాత్రమే కోరుకుంటున్నాను. డిప్రెషన్‌తో పోరాడలేకపోతున్నా. ఆర్థికంగా నేను బాగానే ఉన్నాను. కానీ మానసిక ఒత్తిడితోనే చచ్చిపోతున్నా. ఎన్నో వ్యక్తిగత సమస్యలు నన్ను చీల్చి చెండాడుతున్నాయి. చిన్నప్పటి నుంచి ఈ సమస్యల ఊబిలో చిక్కుకున్న నేను.. వాటిని అధిగమించలేకపోతున్నాను" అని పేర్కొంది.

కిచ్చా సుదీప్‌ వ్యాఖ్యాతగా వ్యవహరించిన కన్నడ బిగ్‌బాస్‌ మూడో సీజన్‌లో పాల్గొంది జయశ్రీ. ఆ తర్వాత పలుమార్లు తన మానసిక పరిస్థితి గురించి చెప్తూ వచ్చింది. తాను జీవితంలో ఓడిపోయానని, చనిపోవాలని ఉందని చెప్పింది. దీర్ఘకాలంగా తీవ్ర మానసిక ఒత్తిడికి లోనైన జయశ్రీ.. చివరికు ఆ ఒత్తిడి కారణంగానే అర్ధాంతరంగా తనువు చాలించిందని చెబుతున్నారు.
Tags:    

Similar News