బిగ్ బాస్ ఫేమ్ ని ఎలా వాడతారో!

Update: 2017-09-28 00:30 GMT
తెలుగులో ఇప్పటివరకూ వచ్చిన రియాల్టీ షోలలో బిగ్గెస్ట్ హిట్ బిగ్ బాస్ సీజన్. ఇందులో పెద్దగా డౌట్స్ ఏమీ అవసరం లేదు. మొదట్లో కొన్ని సందేహాలు తలెత్తేలా చేసిన ఈ కార్యక్రమం.. మెల్లగా ఆడియన్స్ లో క్యూరియాసిటీ పెంచింది. ఇందుకు ఎన్టీఆర్ హోస్టింగ్ క్యాపబిలిటీస్ అత్యంత ప్రధానం అయినా.. పార్టిసిపెంట్స్ కూడా చక్కని ప్రదర్శనతో.. చివరివరకూ షో రక్తి కట్టించారు. కొంతమందికి అయితే ఓవర్ నైట్ స్టార్ డం వచ్చేసిందని కూడా చెప్పచ్చు.

అయితే.. ఈ స్టార్ డం ఇప్పుడు వారి కెరీర్ కి ఎలా ఉపయోగపడుతుంది.. వారు ఎలా ఉపయోగించుకోగలుగుతారు అన్నదే అసలైన పాయింట్. గబ్బర్ సింగ్ మూవీ రిలీజ్ సమయంలో పోలీస్ స్టేషన్ సన్నివేశంలో అంత్యాక్షరి ఆడిన రౌడీ గ్యాంగ్ కి బోలెడంత క్రేజ్ వచ్చేసింది. వరుసగా ఆఫర్స్ వచ్చాయి.. రియాల్టీ షోలలో.. టీవీ కార్యక్రమాల్లో కొన్నాళ్లు సందడి చేసిన తర్వాత.. మళ్లీ ఇప్పుడు పాత పరిస్థితుల్లోకే వెళ్లిపోయారు. కానీ ఇప్పుడు బిగ్ బాస్ వచ్చిన నటీనటుల తీరు వేరు. కొందరు హీరోలు.. హీరోయిన్స్.. కీలకమైన నటులు కూడా ఉన్నారు. వారు ఇప్పుడు ఏం చేయబోతున్నారనే ఆసక్తి కలగడం సహజమే.

మధుప్రియ.. దీక్షా పంద్.. సమీర్.. హరితేజ.. ప్రిన్స్ లాంటివారికి ఆడియన్స్ లో గుర్తింపు పెరగడానికి బిగ్ బాస్ బాగా ఉపయోగపడింది. ఇప్పటికే యాక్ట్రెస్ హరితేజకు కుప్పలు తెప్పలుగా ఆఫర్స్ వచ్చేస్తున్నాయి. తాను ఇంటీరియర్ డెకరేషన్ వ్యాపారంలో బిజీ కాబోతోన్నట్లు కార్తీక ఇప్పటిక్ చెప్పింది. అటు ఫిదాతో వచ్చిండే అంటూ బ్లాక్ బస్టర్ కొట్టిన మధుప్రియ.. ఇటు బిగ్ బాస్ ద్వారానూ ఫేమ్ పెంచుకుంది. హీరోయిన్ దీక్షా పంత్ కెరీర్ ఎలా టర్న్ అవుతుందనే విషయం అప్పుడే చెప్పలేని పరిస్థితి. ఆమె బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక చాలా ఆరోపణలే చేసింది. ఇలా ఓపెన్ అయిపోయే మనుషులను ఇండస్ట్రీలో కాసింత దూరంగా ఉంచుతారనే టాక్ ఉంది.

ధన్ రాజ్.. ప్రిన్స్.. ఆదర్శ్ వంటివారికి లీడ్ రోల్స్ కాకపోయినా.. ఇంపార్టెంట్ కేరక్టర్స్ దక్కే అవకాశాలున్నాయని టాక్. కల్పన.. ముమైత్.. సంపూర్ణేష్.. అర్చన.. సమీర్ వంటివారు కూడా తమ కెరీర్ లో మరింత బిజీగా మారిపోయే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. బిగ్ బాస్ ఇమ్మీడియేట్ ఎఫెక్ట్ కారణంగా ఫేమ్ పెరిగినా.. దాన్ని ఎలా నిలబెట్టుకోగలుగుతారు అన్నదే ఆసక్తికరంగా మారింది.




Tags:    

Similar News