బింబిసార : డబ్బింగ్ చేయాలా? రీమేక్ చేయాలా?

Update: 2022-08-17 05:30 GMT
నందమూరి కళ్యాణ్ రామ్‌ హీరోగా వశిష్ఠ్‌ దర్శకత్వంలో రూపొందిన బింబిసార సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్‌ హిట్ గా నిలిచింది. రెండు వారాల తర్వాత కూడా బింబిసార సినిమా వసూళ్లు నిలకడగా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో ఈ సినిమా సాధిస్తున్న వసూళ్లు బయ్యర్లకు మరియు నిర్మాతలకు ఇప్పటికే భారీ లాభాలను తెచ్చి పెట్టిన విషయం తెల్సిందే.

సినిమా విడుదల అయిన మూడవ రోజు లాభాల్లో పడిన బింబిసార ను అప్పుడే హిందీలో కూడా విడుదల చేసి ఉంటే బాగుండేది అంటూ ఇప్పుడు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బింబిసార సినిమా ను హిందీ లో రిలీజ్ చేసినట్లయితే మరింత భారీ వసూళ్లు నమోదు అయ్యేవి అంటూ బాక్సాఫీస్‌ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పుడు సినిమా సూపర్‌ హిట్ టాక్ దక్కించుకున్న నేపథ్యంలో బింబిసార సినిమా ను హిందీలో డబ్‌ చేయాలని.. కేవలం హిందీలోనే కాకుండా ఇతర భాషల్లో కూడా డబ్‌ చేయాలని మేకర్స్‌ భావిస్తున్నారట.

కాని కళ్యాణ్ రామ్ మాత్రం బింబిసార సినిమా ను హిందీ లో రీమేక్‌ చేయాలనే ఆలోచన చేస్తున్నాడట. హిందీ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా కాస్త మార్చి రీమేక్ చేస్తే ఎలా ఉంటుందనే చర్చ కూడా జరుగుతుందట.

బింబిసార సినిమా హిందీలో డబ్ చేసి రిలీజ్ చేయాలంటే భారీగా ప్రమోషన్ చేయాల్సి ఉంటుంది. థియేట్రికల్ రిలీజ్ ఎంత వరకు సాధ్యం క్లారిటీ లేదు. అందుకే బింబిసార సినిమా ను డబ్బింగ్ చేసి డైరెక్ట్‌ ఓటీటీ ద్వారా విడుదల చేస్తే బాగుంటుందని అంటున్నారు. రీమేక్‌ విషయమై ఇంకా ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోని కళ్యాణ్‌ రామ్‌ డబ్బింగ్‌ విషయంలో కూడా క్లారిటీ ఇవ్వలేదట.

ప్రముఖ ఓటీటీ ఈ సినిమా ను హిందీ స్ట్రీమింగ్‌ రైట్స్ ను దక్కించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. హీరో గా బింబిసార సినిమా కళ్యాణ్‌ రామ్‌ కి చాలా విభిన్నమైన సినిమాగా నిలిచింది. అందుకే బింబిసార ను అంత ఈజీగా కళ్యాణ్ రామ్‌ వదిలే అవకాశం కనిపించడం లేదు. కనుక రీమేక్‌ కంటే డబ్బింగ్‌ చేసి విడుదల చేస్తేనే కళ్యాణ్ రామ్ కి మైలేజ్‌ ఎక్కువ అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Tags:    

Similar News