ఏమిటీ జీవిత చరిత్రల వెర్రి ?

Update: 2018-09-01 07:01 GMT
తెలుగు సినీ పరిశ్రమకి  జీవిత చరిత్రల పిచ్చి పట్టుకుంది. ఇది ఓ వేలం వెర్రిలా మారింది. జీవిత చరిత్రంటే ఆ మనిషి తన జీవత కాలంలో  మహోన్నత మైనది సాధించటమే. ఇంతకు ముందు మహాత్మ గాంధీ - జవహర్‌ లాల్ నెహ్రు - నెల్సన్‌ మండేలా  వంటి మహానాయకుల జీవిత చరిత్రలను తెరకెక్కించారు. ఆ చిత్రాలు ప్రజలలో స్పూర్తిని నింపాయి. ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. ఎవరు పడితే వారిపై బయోపిక్‌ లు తీస్తూ సొమ్ము చేసుకోవాలనుకుంటున్నారు నిర్మాతలు. జీవిత చరిత్రంటే వాస్తవాలకు ప్రతిరూపం. కానీ ఆ జీవిత చరిత్రలకు అవాస్తవాలను అభూత కల్పనలు జోడించి ప్రజలపై వదులుతున్నారు. దీంతో జీవిత చరితలపై చిత్రాలు వివాదాస్పదమవుతున్నాయి. ఇటీవల మహానటి సావిత్రిపై తీసిన బయోపిక్ కూడా ఇలా వివాదస్పదమైంది. ఆ చిత్రంపై నటుడు - సావిత్రి భర్త జెమినీ గణేషన్‌ పిల్లలు మండిపడ్డారు. ఈ చిత్రంలో అన్ని అవాస్తవాలేనని వారు విమర్శించారు. ఈ చిత్రంపై కొందరు కోర్టుకు కూడా వెళ్తామన్నారు. ఇక బాలీవుడ్ హీరో సంజయ్ దత్‌ జీవితంపై తీసిన సంజు చిత్రం కూడా వివాదాస్పదమైంది. ఇందులో సంజయ్ దత్‌ ను చూపించిన తీరుపై ఆయన అభిమానుల్లో ఆనందం నింపినా.... సగటు ప్రేక్షకుడిలో మాత్రం ఆవేదన మిగిల్చింది. ఇలా బయోపిక్‌ లపై విమర్శలొస్తున్నాయి.

తెలుగులో కూడా ఈ బయోపిక్‌ ల జోరు పెరిగింది. మహానటుడు - దివంగత ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు జీవితంపై ఆయన కుమారుడు - శాసనసభ్యుడు బాలక్రిష్ణ ఓ చిత్రాన్ని తీస్తున్నారు. ఈ చిత్రం విడుదల కాకమునుపే వివాదాస్పదమవుతోంది. ఎన్టీఆర్‌ ను పదవీచ్యుతుడు చేసిన అల్లుడు చంద్రబాబు నాయుడుని ఎలా చూపిస్తారంటూ ఎన్టీఆర్ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. అసలు సినిమాలో ఆ ఘట్టం ఉంటుందా, ఉండదా అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు ఓ నిర్మాత ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై బయోపిక్ తీసేందుకు సన్నాహలు చేస్తున్నారు. ఈ బయోపిక్‌ లో చంద్రబాబు నాయుడికి సంబంధించిన అన్ని అంశాలు ఉంటాయని అనే ప్రశ్న వినిపిస్తోంది. ఒక వ్యక్తి తన జీవితంలో మంచి - చెడులు ఉంటాయని వారి జీవితంపై సినిమా తీసే సమయంలో వీటిని కూడా పరిగణలోకి తీసుకోవాలని విశ్లేషకులు అంటున్నారు. అలా చూపించాలంటే వ్యక్తుల జీవితాలలో నెలకొన్న సంఘటనలను యదాతధంగా చూపించాలని వారంటున్నారు. బ‌తికున్న వారిపై వాస్తవాలతో కూడిన బయోపిక్‌ లు తీయడం సాహసమేనని - పైగా అధికారంలో ఉన్న వారి జీవిత చరిత్ర తీయడమంటే ఆషామాషీ కాదని వారంటున్నారు. చంద్రబాబు నాయుడి జీవిత చరిత్రపై తీసే సినిమా ఎవరికి స్పూర్తి నిస్తుందని రాజకీయ పండితులు వ్యాఖ్యనిస్తున్నారు.
Tags:    

Similar News