'బేబీ' చిత్రం నుంచి యంగ్ బ్యూటీ లుక్..!

Update: 2022-01-04 09:30 GMT
'హృదయ కాలేయం' 'కొబ్బరిమట్ట' వంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న టాలెంటెడ్ డైరెక్టర్ సాయి రాజేష్ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ''బేబీ''. ఇందులో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ - విరాజ్ అశ్విన్ హీరోలుగా నటిస్తుండగా.. వైష్ణవి చైతన్య హీరోయిన్ గా చేస్తోంది.

న్యూ ఏజ్ లవ్ స్టొరీగా ''బేబీ'' సినిమా రూపొందుతోందని చిత్ర బృందం తెలిపింది. దసరా పండుగ సందర్భంగా లాంఛనంగా ప్రారంభమైన ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇవాళ వైష్ణవి చైతన్య పుట్టిన రోజు కావడంతో టీమ్ మెంబర్స్ స్పెషల్ పోస్టర్ ను విడుదల చేస్తూ శుభాకాంక్షలు తెలియజేసారు.

పొయెటిక్ గా డిజైన్ చేసిన బర్త్ డే పోస్టర్ లో వైష్ణవి చైతన్య చిరునవ్వుతో ఆకట్టుకుంటోంది. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ వైష్ణవి కి 'బేబీ' డెబ్యూ మూవీ. షార్ట్ ఫిలిమ్స్ తో గుర్తింపు తెచ్చుకున్న వైష్ణవి.. 'సాఫ్ట్ వేర్ డెవలపర్' అనే వెబ్ సిరీస్ తో బాగా పాపులర్ అయింది.

అలానే 'టచ్ చేసి చూడు' 'అల వైకుంఠపురములో' 'వరుడు కావలెను' వంటి పలు చిత్రాల్లో వైష్ణవి చైతన్య చిన్న పాత్రలు పోషించింది. ఈ క్రమంలో ఇప్పుడు 'బేబీ' సినిమాతో హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరి ఈ మూవీ అమ్మడికి ఎలాంటి గుర్తింపు తెచ్చిపెడుతుందో చూడాలి.

'టాక్సీవాలా' లాంటి సూపర్ హిట్ చిత్రాన్ని నిర్మించిన ఎస్.కె.ఎన్ ''బేబీ'' సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఎస్ కే ఎన్ మరియు దర్శకుడు మారుతి సంయుక్త సంస్థ మాస్ మూవీ మేకర్స్ పతాకంపై ఈ సినిమా నిర్మితమవుతోంది. ధీరజ్ మోగిలినేని సహ నిర్మాతగా.. దాసరి వెంకట సతీష్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు.

విజయ్ బుల్గానిన్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. రామ్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. కార్తీక శ్రీనివాస్ ఎడిటర్ గా.. సురేష్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన ఇతర వివరాలు వెల్లడికానున్నాయి.


Tags:    

Similar News