బక్కపలచ భామకు 'లైగర్' కలిసొచ్చేనా?

Update: 2022-08-22 13:30 GMT
మొదటి నుంచి కూడా తెలుగు తెరపై బాలీవుడ్ భామల జోరు కొనసాగుతూ వచ్చింది. ఆ తరువాత కాలంలో మలయాళ మందారాల తాకిడీ పెరిగింది. నిన్నమొన్నటి వరకూ వారి హవానే కనిపిస్తూ వచ్చింది. మధ్య మధ్యలో తమిళ తామరలు కూడా సందడి చేశాయి. అయితే ఇప్పుడు మళ్లీ బాలీవుడ్ బ్యూటీల దిగుమతి ఎక్కువగా కనిపిస్తోంది. తెలుగు సినిమాలు చేయడానికి బాలీవుడ్ ముద్దుగుమ్మలు ఎక్కువ ఉత్సాహాన్ని .. అంతకు మించిన ఆసక్తిని కనబరుస్తున్నారు. అందుకు ప్రధానమైన కారణం తెలుగు సినిమా పాన్ ఇండియా దిశగా పరుగులు తీస్తుండటమే.

అవును ఈ మధ్య కాలంలో నార్త్ లో తెలుగు కథలకు .. సినిమాలకు డిమాండ్ పెరిగిపోయింది. ఇక్కడి హీరోలకు  కూడా అక్కడ క్రేజ్ పెరిగిపోతోంది. తెలుగు సినిమా చేస్తే పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ వస్తుందనే ఉద్దేశంతో అందాల భామలంతా ఇక్కడి అవకాశాలపై ఓ కన్నేశారు. ఏ మాత్రం వీలు చిక్కినా వదులుకోవడం లేదు. అలా అలియా భట్ .. కియారా .. దీపికా పదుకొణె తదితరులంతా ఇక్కడి సినిమాలు చేస్తున్నారు. తాజాగా ఈ జాబితాలో అనన్య పాండే కూడా తన పేరును నమోదు చేసుకుంది.

విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన 'లైగర్' .. ఈ నెల 25వ తేదీన విడుదల కానుంది. పాన్ ఇండియా స్థాయిలో నిర్మితమైన ఈ సినిమాతో కథానాయికగా తెలుగు తెరకి అనన్య పాండే పరిచయం కానుంది. నిన్నటితరం బాలీవుడ్ స్టార్ చుంకీ పాండే గారాల పట్టీనే ఈ బ్యూటీ.

తమలపాకులో పెట్టి తామ రాకుతో చుట్టేయవచ్చు అన్నంత నాజూకుగా ఈ అమ్మాయి కనిపిస్తోంది. ఈ సినిమాలో బాక్సర్ పాత్ర కోసం విజయ్ దేవరకొండ బాడీ పెంచేయడంతో, ఆయన జోడీగా ఈ  పిల్ల మరింత బక్క పలచగా అనిపిస్తోంది.

విజయ్ దేవరకొండ నేర్పిన నాలుగు తెలుగు ముక్కలను బట్టీపట్టేసి స్టేజ్ పై అప్పగించేస్తూ ప్రమోషన్స్ లో సందడి చేస్తోంది. గ్లామర్ పరంగా .. నటన పరంగా ఈ అమ్మాయి ఎంతగా చెలరేగిపోయిందనేది ఈ సినిమా చూస్తేనే గాని తెలియదు.

ఈ మధ్య కాలంలో పరిచయమైన హీరోయిన్స్ లో కృతి శెట్టి .. శ్రీలీల మాత్రమే కాస్త దూకుడుగా కనిపిస్తున్నారు. మరి వాళ్ల రేంజ్ లోనే ఈ పిల్ల ఫిడేలు వాయిస్తుందేమో చూడాలి. ఇంతవరకూ విజయ్ దేవరకొండతో చేసినవారిలో ఒక్క రష్మిక మాత్రమే రివ్వున దూసుకుపోతోంది. మరి ఈ అమ్మాయి ఆ స్థాయిలో సత్తా చాటుతుందేమో చూడాలి.
Tags:    

Similar News