అవే బాలీవుడ్ కొంప‌ముంచాయా?

Update: 2022-08-29 23:30 GMT
కరోనా కార‌ణంగా కొంత ఇబ్బందుల్ని ఎదుర్కొన్న బాలీవుడ్ ఆ త‌రువాత సుశాంత్ సింగ్ రాజ్ ఆక‌స్మిక మ‌ర‌ణం త‌రువాత నుంచి ఒక్క‌సారిగా బాలీవుడ్ ఫేట్ మారిపోయింది. ఫ్యాన్స్ ఒక్క‌సారిగా బాయ్ కాట్ బాలీవుడ్ అంటూ స‌రికొత్త నినాదాన్ని తెర‌పైకి తీసుకొచ్చారు. దీంతో బాలీవుడ్ మ‌రింతగా గ‌డ్డు ప‌రిస్థితుల్ని ఎదుర్కోవ‌డం మొద‌లు పెట్టింది. గ‌త కొంత కాలంగా బాలీవుడ్ ప‌రిస్తితి మ‌రింత దారుణంగా మారింది. ఇదిలా వుంటే బాలీవుడ్ తాజా ప‌రిస్థితిపై ఎస్‌బీఐ గ్రూప్ చీఫ్ ఎకాన‌మిక్ అడ్వైజ‌ర్ సౌమ్య కాంతి ఘోష్ నేతృత్వంలో ఓ బృందం ప‌రిశోధ‌న చేసి ప్ర‌త్యేక సూచ‌న‌లు చేసింది.

కోవిడ్ త‌రువాత విడుద‌లైన హిందీ సినిమాల కంటెంట్ పై ప్ర‌ధానంగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. దీంతో చిత్ర ప‌రిశ్ర‌మ భారీ న‌ష్టాల‌ని చ‌విచూడాల్సి వ‌స్తోంద‌ని అభిప్రాయ‌ప‌డింది. ఇక కోవిడ్ కార‌ణంగా బాలీవుడ్ ఇండ‌స్ట్రీ కుదేలైంద‌ని, రెండు ప్ర‌పంచ యుద్ధాలు కూడా చేయ‌లేని న‌ష్టాన్ని అందించింద‌ని తెలిపింది. ఇక బాలీవుడ్ లో కోవిడ్ కు ముందు ప్ర‌తీ ఏడాది 70 నుంచి 80 సినిమాలు విడుద‌ల కాగా ఆ సంఖ్య కోవిడ్ త‌రువాత గ‌ణ‌నీయంగా త‌గ్గింద‌ని స్ప‌ష్టం చేసింది.  

ప్ర‌తీ ఏడాది 70 నుంచి 80 సినిమాలు విడుద‌ల కాగా బాలీవుడ్ రూ. 3000 కోట్ల నుంచి రూ. 5500 కోట్ల మేర వ‌సూళ్ల‌ని రాబ‌ట్టేద‌ని, అయితే కోవిడ్ త‌రువాత ఆ ప‌రిస్థితి చాలా వ‌ర‌కు మారింద‌ని తెలిపింది. 2021 నుంచి ఈ ఏడాది ఆగ‌స్టు ద‌ర‌కు కేవ‌లం 61 సినిమాలు మాత్ర‌మే విడుద‌ల‌య్యాయ‌ని, ఇందులో కొన్ని మాత్ర‌మే హిందీ సినిమాల‌ని మిగ‌తావి ద‌క్షిణాది అనువాద చిత్రాల‌తో పాటు కొన్ని ఇంగ్లీష్ మూవీస్ కూడా వున్నాయ‌ని తెలిపింది. ఇవి రూ. రూ.3200 కోట్లు మాత్ర‌మే వ‌సూలు చేశాయ‌ని ఇందులో 48 శాతం వ‌సూళ్లు అనువాద చిత్రాల వ‌ల్లే వ‌చ్చాయ‌ని పేర్కొంది.

అంతే కాకుండా బాలీవుడ్ సినిమాల్లో కంటెంట్ ఆశాజ‌న‌కంగా వుండ‌టం లేద‌ని, అంతే కాకుండా సింగిల్  స్క్రీన్స్ త‌గ్గిపోవ‌డం.. మ‌ల్టీప్లెక్స్ సంస్కృతి బాగా పెరిగిపోవ‌డం.. టికెట్ రేట్లు అందుకు త‌గ్గ‌ట్టే భారీగా పెర‌గ‌డం బాలీవుడ్ కు శాపంగా మారింద‌ని స్ప‌ష్టం చేసింది. మ‌ల్టీప్లెక్స్ ల టికెట్ ల‌కు, బాలీవుడ్ సినిమాల‌కు వినోద‌పు ప‌న్ను అధికంగా వుండ‌టం కూడా ఓ కార‌ణంగా మారింది. ద‌క్షిణాదిలో 62 శాతం సింగిల్ స్క్రీన్స్ వుంటే ఉత్త‌రాది లో 10 శాతం మాత్ర‌మే వుండ‌టం మ‌రింత‌గా బాలీవుడ్ ప‌త‌నానికి కార‌ణంగా నిలుస్తోంది.

బాలీవుడ్ జోరు త‌గ్గ‌డానికి మ‌రో కాన‌ణం కూడా వుంద‌ని స‌ద‌రు నివేదిక తేల్చింది. ఉత్త‌రాభాత‌రం ఓటీటీల‌కు ఎడిక్ట్ కాగా.. ద‌క్షిణాది ప్రేక్ష‌కులు మాత్రం క‌రోనా భ‌యాల‌ని ప‌క్క‌న పెట్టి థియేట్రిక‌ల్ ఎక్స్ పీరియ‌న్స్ కే ప్ర‌ధాన్య‌త నిస్తున్నారు. దీంతో ద‌క్షిణాది చిత్రాల‌కు భారీ ఆద‌ర‌ణ ల‌భిస్తోంది. ఉత్త‌రాది వారు కూడా ద‌క్షిణాది సినిమాల‌కు ఈ కార‌ణంగానే బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నార‌ట‌. ఇక 25 నుంచి 45 ఏళ్లున్న వారు ఎక్కువ‌డా ఉత్త‌రాదిలో ఓటీటీల‌కు ప్ర‌భావితం కావ‌డం బాలీవుడ్ కు మ‌రో ప్ర‌తిబంధ‌కంగా మారింద‌ట‌. క‌రోనా టైమ్ లో ఓటీటీలు భారీ స్థాయిలో పుంచుకోవ‌డం కూడా ఇప్పుడు ప్ర‌ధాన స‌మ‌స్య‌గా మారిన‌ట్టు తెల్చారు. ఇప్ప‌టికే 40 ఓటీటీ ప్లాట్ ఫామ్ ల‌కు 45 కోట్ల మంది చందాదారుల‌గా మారారు. 2023 నాటికి ఈ సంఖ్య 50 కోట్ల‌కు చేరే అవ‌కాశం వుంద‌ట‌.  

1980ల ప్రారంభంలో వీసీఆర్ వీడియో క్యాసెట్ లు దేశ వ్యాప్తంగా సినీ ప‌రిశ్ర‌మ‌ని ఓ కుదుపు కుదిపాయ‌ని అయితే క్ర‌మంగా ప్రేక్ష‌కులు మ‌ళ్లీ ఎప్ప‌టిలాగే థియేట‌ర్ల‌కు రావ‌డంతో పూర్వ‌పు ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయ‌న్నారు. అయితే సినీ ఇండ‌స్ట్రీల‌కు ప్ర‌ధాన బ‌లంగా నిలిచిన సింగిల్ స్క్రీన్ ల వ్య‌వ‌స్థ 2000 నుంచి డెబ్బ‌తింటూ వ‌స్తోంద‌ని అది కూడా ప్ర‌స్తుతం బాలీవుడ్ కు ఇబ్బందిక‌రంగా మారింద‌ని స్ప‌ష్టం చేశారు. ఇక ఓటీటీ వ‌చ్చాక ప్రేక్ష‌కుడికి ఇంటి వ‌ద్దే సినిమా ఎక్స్ పీరియ‌న్స్ ని అందిస్తోందని వ‌చ్చే ఏడాదికి దీని మార్కెట్ రూ. 11,944 కోట్ల‌కు చేరుతుంద‌ని, ప్ర‌తీ ఏటా 36 శాతం వృద్ధి చెందుతోంద‌ని ఎస్‌బీఐ నివేదిక హెచ్చ‌రించింది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News