బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ ‘క్వీన్’కు దిమ్మ తిరిగే షాక్ తప్పలేదు

Update: 2021-10-23 13:30 GMT
బాలీవుడ్ ‘క్వీన్’ కమ్ ఫైర్ బ్రాండ్ కంగనారౌనత్ కు భారీ షాక్ తగిలింది. కోర్టులో ఆమెకు భారీ ఎదురుదెబ్బ తప్పలేదు. ఆమెపై ప్రముఖ పాటల రచయిత జావేద్ అక్తర్ దాఖలు చేసిన పరువు నష్టం దావా వ్యవహారంలో కంగనా తీరును కోర్టు తప్పు పట్టటమే కాదు.. కింది కోర్టు ఇచ్చిన ఆదేశాలు వివేకంతో.. పక్షపాత రహితంగా ఇచ్చినట్లుగా స్పష్టం చేయటం గమనార్హం. ఇదిలా ఉంటే.. ఈ పిటిషన్ పై విచారణను వేరొక కోర్టుకు బదిలీ చేయాలని కంగన చేసుకున్న దరఖాస్తును సైతం తోసిపుచ్చింది.

గత ఏడాది కంగనారౌనత్ ఒక టీవీ ఇంటర్వ్యూలో బాలీవుడ్ లోని కోటరీ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. అందులో జావేద్ అక్తర్ పేరును ప్రస్తావించారు. దీనిపై ఆయన పరువు నష్టం దావాను దాఖలు చేశారు. ఆమె తన పేరును ప్రస్తావించటం ద్వారా తన పరువునకు భంగం కలిగించారని ఆయన పేర్కొంటూ కేసు వేశారు. అయితే.. జావేద్ తనను నేరపూరితంగా బెదిరించారని.. డబ్బు గుంజేందుకు ప్రయత్నించారని ఆమె ఆరోపించారు.
ఇదిలా ఉంటే.. ఈ కేసు విచారణ చేపట్టిన అంధేరీ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు పక్షపాతంతో వ్యవహరించిందని.. ఆ కోర్టుపై తనకు నమ్మకం పోయిందన్నారు. బెయిల్ మంజూరు చేయదగిన నేరానికి సంబంధించిన కేసులో కోర్టుకు హాజరుకాకపోతే తనకు వారెంట్ జారీ చేస్తామని పరోక్షంగా కోర్టు తనను బెదిరించినట్లుగా ఆమె పేర్కొంటూ.. ఆ కోర్టు తనకు వ్యతిరేకంగా ఉందని ఆరోపించారు.

దీనిపై తాజాగా అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఎస్ టీ దండే తీర్పు ఇచ్చారు. దీనికి సంబంధించిన ఆదేశాలు తాజాగా బయటకు వచ్చాయి. కంగనపై జావేద్ అక్తర్ దాఖలు చేసిన పరువు నష్టం దావాపై విచారణ జరుపుతున్న అంధేరీ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ నిష్పక్షపాతంగా.. వివేకంతో వ్యవహరించినట్లుగా పేర్కొన్నారు.
కంగనాకు వ్యతిరేకంగా ఎలాంటి పక్షపాతం ప్రదర్శించలేదన్నారు. చట్టబద్ధమైన ప్రక్రియ అనుసరించినంత మాత్రాన కంగనకు వ్యతిరేకంగా ఉన్నట్లు కాదని పేర్కొంది. కోర్టు జారీ చేసిన ఆదేశాలన్నింటిని తాను పరిశీలించానని.. అవన్నీ వివేకంతోనే ఉన్నవని.. అంధేరీ కోర్టు జారీ చేసిన ఆదేశాల్ని సెషన్స్ కోర్టు ధ్రువీకరించినట్లుగా స్పష్టం చేశారు. కేవలం సంశయం కారణంగా కేసును ఒక కోర్టును నుంచి మరో కోర్టుకు బదిలీ చేయటం సాధ్యం కాదని పేర్కొంది. ఈ తీర్పు కచ్ఛితంగా కంగనాకు ఎదురుదెబ్బగా చెప్పక తప్పదు.


Tags:    

Similar News