పుష్ప-2 దేవి గొడవ.. ఫైనల్ గా ఓ క్లారిటీ ఇచ్చేసిన నిర్మాత

పాన్ ఇండియా మూవీగా విడుదలకు సిద్ధమవుతున్న ‘పుష్ప-2’ నేపథ్య సంగీతం విషయంలో వివాదం కొనసాగుతున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే

Update: 2024-11-27 09:19 GMT

పాన్ ఇండియా మూవీగా విడుదలకు సిద్ధమవుతున్న ‘పుష్ప-2’ నేపథ్య సంగీతం విషయంలో వివాదం కొనసాగుతున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ వర్క్‌కి సంబంధించి, దర్శకుడు సుకుమార్ అసంతృప్తిగా ఉండటంతో, తమన్, సామ్ సీఎస్, అజనీష్ లోక్‌నాథ్‌లను కొన్ని భాగాలకు బీజీఎం అందించేందుకు తీసుకున్నారని సమాచారం.

దీనిపై దేవిశ్రీ ప్రసాద్ తన అసహనాన్ని ఇన్‌డైరెక్ట్‌గా వ్యక్తం చేసినట్లు చెన్నైలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తెలుస్తోంది. చెన్నైలో ఇటీవల జరిగిన ‘పుష్ప 2: ది రూల్’ సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో దేవిశ్రీ ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చకు దారితీశాయి. ప్రొడ్యూసర్ రవిశంకర్‌ను ఉద్దేశించి ఆయన చేసిన “ప్రేమ కంటే కంప్లయింట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి” అనే వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి.

అంతేకాదు, క్రెడిట్స్, రెమ్యునరేషన్ అంశాల్లో ఎవరైనా అడిగి తీసుకోవాలని ఆయన చెప్పడం కూడా ఆ ఈవెంట్‌లో ముఖ్యమైన చర్చకు దారితీసింది. ఈ వ్యాఖ్యలపై వచ్చిన ప్రశ్నలకు ‘రాబిన్ హుడ్’ ప్రెస్ మీట్‌లో రవిశంకర్ సమాధానం ఇచ్చారు. “దేవిశ్రీ ప్రసాద్ అన్నదాంట్లో ఎటువంటి దురుద్దేశం లేదు. ఆయన ప్రేమతో పాటు ఫిర్యాదులున్నాయన్నారు తప్పించి వేరే ఉద్దేశం లేదు” అని రవిశంకర్ స్పష్టం చేశారు.

“మీడియా రకరకాలుగా కథనాలు రాస్తోంది, కానీ మా సంబంధాలు ఎప్పటిలాగే బలంగా ఉన్నాయి. దేవిశ్రీతో మా కాంబినేషన్ భవిష్యత్తులో కూడా కొనసాగుతుంది” అని ఆయన అన్నారు. ఈ వివాదం దేవిశ్రీ ప్రసాద్ తర్వాతి అవకాశాలను దెబ్బతీయవచ్చనే ప్రచారం జరిగింది. ముఖ్యంగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మరియు రామ్ చరణ్ 17 ప్రాజెక్టులు దేవి చేతుల నుంచి వెళ్లిపోతాయేమోనని చెప్పుకున్నారు.

కానీ, రవిశంకర్ క్లారిటీ ఇచ్చిన తర్వాత ఈ వాదనలకు తెరపడినట్లే కనిపిస్తోంది. రవిశంకర్ మాటలు ఈ వివాదానికి ఎండ్ కార్ట్ పడడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక పుష్ప 2 ప్రమోషన్ల గురించి మాట్లాడుకుంటే, హైదరాబాద్‌లో పెద్ద వేడుకను ప్లాన్ చేశారు. అలాగే బెంగళూరులో మరో ఈవెంట్ జరగనుంది. ఇవి మాత్రమే కాక, సినిమా విడుదల తర్వాత సక్సెస్ మీట్‌ను కూడా గ్రాండ్‌గా నిర్వహించనున్నారు.

ఈ ఈవెంట్లలో దేవిశ్రీ ప్రసాద్ మరోసారి తన అభిప్రాయంను తెలియజేయవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ వివాదం పక్కనపెడితే, పుష్ప 2 మీద అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా 3 గంటల 20 నిమిషాల నిడివితో పుష్ప రాజ్ అరాచకాన్ని చూపించబోతుందని సమాచారం. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలు సినిమా హైప్‌ను వేరే స్థాయికి తీసుకెళ్లాయి. పుష్ప 2 విడుదల కోసం అభిమానులు సర్వత్రా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Tags:    

Similar News