టాప్-10 నేపో కిడ్స్.. ఎవరి సత్తా ఎంత?
బంధుప్రీతి కారణంగా చాలా మంది బయటి వారికి అవకాశాలు ఇవ్వడం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
సినీరంగంలో నటవారసుల సక్సెస్ గురించి చాలా చర్చ సాగుతోంది. ఇక్కడ అత్యంత ప్రతిభావంతులు మాత్రమే దీర్ఘకాలంలో మనుగడ సాగించగలరు. తల్లిదండ్రులు పెద్ద స్టార్లు అయినా కానీ, వారసులు రాణించిన సందర్భాలు అరుదు. అందుకు బాలీవుడ్ సహా అన్ని పరిశ్రమల్లో చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఇటీవల బంధుప్రీతి, నటవారసత్వం గురించి చాలా చర్చ సాగుతోంది. బంధుప్రీతి కారణంగా చాలా మంది బయటి వారికి అవకాశాలు ఇవ్వడం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పరిస్థితి బాలీవుడ్ లో మరింత తీవ్రంగా ఉందన్న విమర్శలున్నాయి. 2025 లో అరంగేట్రం చేస్తున్న టాప్ 10 బాలీవుడ్ స్టార్ కిడ్స్ వివరాల్లోకి వెళితే..
స్టార్డ్‌డమ్‌ను రీడిఫైన్ చేసేందుకు రెడీ అవుతున్న 10 మంది నేపో కిడ్స్ వివరాలు ఇలా ఉన్నాయి. ఇబ్రహీం అలీ ఖాన్, ఆమన్ దేవ్‌గన్, అహాన్ పాండే, ఖుషి కపూర్, షానయా కపూర్, రాషా తడానీ, సిమర్ భాటియా, ఆర్యన్ ఖాన్, ఆర్యమాన్ డియోల్, వీర్ పహరియా బరిలో నిలిచారు.
బాలీవుడ్ లో స్టార్ డమ్ ను మరో స్థాయికి చేర్చగలిగే నెపో కిడ్స్ జాబితాలోని ఇబ్రహీం అలీ ఖాన్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అతడు తన తండ్రిలాగే అందగాడు. ప్రతిభావంతుడు. కరణ్ జోహార్ దర్శకత్వం వహించిన సర్జమీన్ చిత్రంలో ప్రముఖ నటి కాజోల్ తో కలిసి అతడు ఆరంగేట్రం చేస్తున్నారు. ఇబ్రహీం సారా అలీ ఖాన్ తమ్ముడు. ఇటీవలే ఇబ్రహీం- ఖుషి కపూర్ జంటగా మరో చిత్రాన్ని కరణ్ అధికారికంగా ప్రకటించారు. కరణ్ జోహార్ దర్శకత్వంలో రూపొందుతున్న `నదానియన్`లో ఖుషీ కపూర్ - ఇబ్రహీం అలీ ఖాన్ జంటగా నటిస్తున్నారు.
ఆమన్ దేవగన్.. బాలీవుడ్ లో పెద్ద ఫ్యామిలీ నుంచి వెండి తెరకు పరిచయమయ్యాడు. ఈ యంగ్ హీరో అజయ్ దేవగన్ మేనల్లుడు. మేటి కథానాయిక రవీనా టాండన్ కుమార్తె రాషా తడానీతో కలిసి `ఆజాద్` అనే చిత్రంలో నటించాడు. ఈ చిత్రంలో స్టార్ కిడ్స్ నటన ఫర్వాలేదనిపించినా ఇంకా చాలా బెటర్ మెంట్ కావాలని విశ్లేషించారు. అయితే రాషా తడానీ ఉయ్ అమ్మా సాంగ్ తో గుబులు పుట్టించిందని కితాబు అందుకుంది.
2025లో తెరకు పరిచయమైన నెపో కిడ్స్ జాబితాలో వీర్ పహారియా ఒకరు. వీర్ పహారియా మాజీ కేంద్ర మంత్రి సుశీల్ కుమార్ షిండే మనవడు. అతడు సూపర్ స్టార్ అక్షయ్ కుమార్, నిమ్రత్ కౌర్, సారా అలీ ఖాన్‌లతో కలిసి స్కై ఫోర్స్ చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. అభిషేక్ కపూర్ ఈ వార్ డ్రామాకు దర్శకత్వం వహించారు. తన తాతగారి ప్రతిష్ట కారణంగా వీర్ పహారియా బాలీవుడ్ నెపో కిడ్స్ జాబితాలో ఒకడు అయ్యాడు. ఇటీవలే విడుదలైన స్కై ఫోర్స్ చిత్రానికి మంచి సమీక్షలు వచ్చాయి. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 100 కోట్ల క్లబ్ లో చేరనుందని ఇటీవల కథనాలొచ్చాయి.
బాలీవుడ్ జెన్ జెడ్ స్టార్ కిడ్స్ జాబితాలో అహాన్ పాండే కూడా ఉన్నాడు. యంగ్ హీరోయిన్ అనన్య పాండే బంధువు అహాన్ పాండే. ఈ సంవత్సరం చివర్లో మోహిత్ సూరి దర్శకత్వం వహించే సినిమాతో అరంగేట్రం చేస్తున్నాడు. రొమాంటిక్ సినిమాతో అతడు తెరకు పరిచయం కానున్నాడు. 2025లో బాలీవుడ్ కి పరిచయమవుతున్న టాప్ నేపో కిడ్స్ లో అహాన్ పాండే ఏ మేరకు రాణిస్తాడో వేచి చూడాలి.
బాలీవుడ్ నేపో కిడ్స్ లో కింగ్ ఖాన్ షారూఖ్ వారసుడు ఆర్యన్ ఖాన్... ఇతరులకు భిన్నంగా తెరవెనక పరిచయమవుతున్నాడు. అతడు నటుడిగా కాకుండా, దర్శకుడిగా పరిచయమవుతుండడం సర్వత్రా ఆసక్తిని కలిగిస్తోంది. షారుఖ్ ఖాన్ - గౌరీ ఖాన్ ల వారసుడు ఆర్యన్ ఫిలింమేకింగ్‌పై ఎంతో ఆసక్తిగా ఉన్నాడు. ఈ సంవత్సరం స్టార్‌డమ్ అనే వెబ్ సిరీస్‌తో దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నాడు.
బాలీవుడ్ నెక్స్ట్ జెన్ స్టార్ల జాబితాలో నెపో కిడ్ ఆర్యమాన్ డియోల్ పేరు ఉంది. ఆర్యమాన్ .... బాబీ డియోల్ కుమారుడు. లెజెండరీ నటుడు ధర్మేంద్ర మనవడు. అతడు ఫ్యామిలీ డ్రామా మూవీతో ఆరంగేట్రం చేస్తున్నాడని కథనాలొచ్చాయి. యంగ్ డియోల్ రాకపై అంచనాలున్నాయి. సందీప్ వంగా యానిమల్ చిత్రంతో బాబి డియోల్ ఘనమైన పునరారంగేట్రం చేసాడు. ఇప్పుడు తనయుడిని లాంచ్ చేసేందుకు ఉవ్విళ్లూరుతున్నాడు. ఆర్యమాన్ కూడా జెన్ జెడ్ స్టార్ గా రాణిస్తాడని ఆశిస్తున్నారు.
అరడజను నటవారసురాళ్లు ఢీ:
కథానాయికల్లో సుహానాఖాన్, ఖుషి కపూర్, సిమర్ భాటియా బాలీవుడ్ కి పరిచయమవుతున్నారు. శ్రీదేవి- బోనికపూర్ ల రెండో కుమార్తె ఖుషీ కపూర్ ఇప్పటికే `ది ఆర్చీస్` వెబ్ సిరీస్ తో పరిచయమైంది. కానీ ఇప్పుడు జునైద్ ఖాన్‌తో కలిసి తన రొమాంటిక్ కామెడీ చిత్రం `లవ్‌యాపా`తో పెద్దతెరకు పరిచయమవుతోంది. ప్రస్తుతం తన సినిమాని ప్రమోట్ చేయడంలో బిజీగా ఉంది. ఇదే చిత్రంతో అమీర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ కూడా తెరపై రాణించేందుకు ప్రయత్నించాడు కానీ అతడి మొదటి సినిమా మహారాజాలో ఆశించినంతగా అతడి స్క్రీన్ ప్రెజెన్స్ లేదని విమర్శలొచ్చాయి.
కపూర్ ఫ్యామిలీ నుంచి తెరకు పరిచయమవుతున్న మరో అమ్మాయి సనయా కపూర్. సంజయ్ కపూర్ - మహీప్ కపూర్ ల కుమార్తె. ఆంఖోన్ కి గుస్తాఖియాన్ చిత్రంతో షానయ అరంగేట్రం చేస్తోంది. విక్రాంత్ మెస్సీ ఇందులో కథానాయకుడు. జాన్వీ - ఖుషీ కపూర్ లకు సానయ బంధువు. షానయ నటించాల్సిన డెబ్యూ సినిమా మధ్యలో ఆగిపోవడంతో ఆ తర్వాత రొమాంటిక్ డ్రామాను ఎంపిక చేసుకుంది. బాలీవుడ్ నెక్స్ట్-జెన్ స్టార్స్ జాబితాలో షానయ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.
బాలీవుడ్ లో పెద్ద ఫ్యామిలీ నుంచి వస్తున్న మరో నటవారసురాలు -సిమర్ భాటియా. ఈ బ్యూటీ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ మేనకోడలు. దివంగత పరమ వీర్ చక్ర అవార్డు గ్రహీత అరుణ్ ఖేత్రపాల్ జీవితం ఆధారంగా రూపొందించిన సినిమాతో సిమర్ అరంగేట్రం చేస్తోంది. ఈ సినిమా పేరు ఇక్కిస్.
2025లో ఇప్పటివరకూ అజయ్ దేవగన్ మేనల్లుడు అమన్ దేవగన్, రవీనా టాండన్ కుమార్తె రాషా తడానీ, అమీర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్, శ్రీదేవి రెండో కుమార్తె ఖుషీకపూర్ నటించిన సినిమాలు విడుదలయ్యాయి. నటవారసుల ప్రతిభ గురించి నెటిజనుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అందరిలో రవీనా కుమార్తె రాషా తడానీ అందచందాలు, ప్రతిభ యూత్‌ని ఆకర్షించాయి. ముఖ్యంగా `ఉయ్ అమ్మా` సాంగ్‌లో రాషా తడానీ ఎక్స్ ప్రెషన్స్ కుర్రకారును కిల్ చేసాయి. యంగ్ బ్యూటీకి మంచి భవిష్యత్ ఉందని అంచనా వేస్తున్నారు. ఖుషి కపూర్ ది ఆర్చీస్ సిరీస్ తర్వాత లవ్ యాపా చిత్రంతో డెబ్యూగా ఆరంగేట్రం చేసింది. నటిగా సోసోనే అన్న టాక్ వినిపించింది. ఖుషి ఎక్స్ ప్రెషన్స్, నటన అంతగా యూత్ కి ఎక్కలేదు. అమీర్ వారసుడు జునైద్ ని అస్సలు ప్రజలు పట్టించుకోని స్థితి. అతడు ఏజ్డ్ పర్సన్ లా కనిపిస్తున్నాడని ఫిర్యాదు ఉంది. క్లోజప్‌లో జునైద్ ఫేసియల్ ఎక్స్ ప్రెషన్స్ పైనా విమర్శలున్నాయి. మరోవైపు అమన్ దేవగన్ నటుడిగా చాలా ప్రయాణిస్తే కానీ రాణించడం సులువు కాదని కూడా విమర్శలొచ్చాయి. నటనారంగంలో మొదటి సినిమాతోనే రాణించడం అనేది అంత సులువు కాదు. నాగార్జున, అమీర్ ఖాన్ అంతటి ప్రముఖులే కనీసం ఐదారు సినిమాలు చేస్తే కానీ నటులుగా పేరు తెచ్చుకోలేదనేది గుర్తుంచుకోవాలి.