'సీత'గా నిలిచిపోవటానికి నటి త్యాగాలు.. హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే!
అయితే సీత పాత్రను మాత్రమే పోషించాలని దీపిక నిర్ణయించుకుంది. దీని కారణంగా హాలీవుడ్ ఆఫర్‌ను తిరస్కరించింది.;
90లలో రామానంద్ సాగర్ 'రామాయణం'లో నటించిన నటి దీపిక చిఖ్లియా. ప్రతి ఇంట్లో సీతాదేవిగా పాపులరైంది. ప్రజలు ఈ నటిని తన పేరుతో కాదు, సీత అని ప్రేమగా పిలుస్తారు. రామాయణం టీవీ సీరియల్‌తో ఆమెకు దక్కిన గౌరవమిది. నిజానికి 'రామాయణం' షూటింగ్ ప్రారంభం కాకముందే, చిఖాలియాకు హాలీవుడ్ సినిమాలో నటించే ఆఫర్ వచ్చింది. దీపిక చిఖాలియా స్నేహితురాలు ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దీనిని వెల్లడించింది. ఆమెకు భారీ పారితోషికం కూడా ఆఫర్ చేశారు. కానీ నిర్మాతల షరతు ప్రకారం.. ఈ హాలీవుడ్ చిత్రంలో దీపిక బోల్డ్ గా కనిపించాల్సి ఉంటుంది. అయితే సీత పాత్రను మాత్రమే పోషించాలని దీపిక నిర్ణయించుకుంది. దీని కారణంగా హాలీవుడ్ ఆఫర్‌ను తిరస్కరించింది.
కేవలం సీతగా తనకు ఉన్న ఇమేజ్ దృష్ట్యా ఇటీవల రెండు భారీ ఆఫర్లను కాలదన్నుకున్నానని కూడా దీపిక తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఎప్పటికీ తాను సీతగా మిగిలిపోతానని, తన ఇమేజ్ కి సరిపడని పాత్రల్లో నటించనని ఖరాకండిగా చెప్పారు. 35 ఏళ్లుగా ఈ ఇమేజ్ ని కాపాడుకుంటున్నానని కూడా ఈ సీనియర్ నటి అన్నారు.
దేవతల పాత్రలో నటించినప్పుడు ప్రజలు మనల్ని దేవతగానే పూజిస్తారు.. గుర్తుంచుకుంటారు. అలాంటప్పుడు అందుకు భిన్నమైన ఇమేజ్ తెచ్చే పాత్రల్లో నటించలేమని కూడా దీపిక అన్నారు. ఎప్పటికీ తాను రామానందసాగర్ 'రామాయణ్' సీతగానే ఉంటానని కూడా అన్నారు. తనకు సీతగా నటించాక, పౌరాణిక చిత్రంలో కౌశల్యగా నటించే అవకాశం వచ్చిందని, అయితే దానివల్ల ప్రజలు గందరగోళంలో పడతారని భావించాను. ఆ సమయంలో ఎప్పటికీ సీతగానే కనిపించు! అని తన సోదరుడు అన్న మాటలను గుర్తుంచుకుని కౌశల్య పాత్రలో ఆఫర్ ని తిరస్కరించానని కూడా దీపిక వెల్లడించారు. రణబీర్ కథానాయకుడిగా నటిస్తున్న రామాయణంలో నితీష్ తనకు ఒక పాత్రను ఆఫర్ చేసినా దానిని తిరస్కరించానని అన్నారు. దీనికి కారణం సీతగా మాత్రమే ప్రజల హృదయాలలో నిలిచిపోవాలనే ఆకాంక్ష.
బాల నటిగా ప్రయాణం..
దీపిక చిఖ్లియాకు చిన్నప్పటి నుంచీ నటనపై మక్కువ. పాఠశాల రోజుల్లో నాటకాల్లో నటించేది. కేవలం 4 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు, తన తండ్రి కోల్‌కతాకు బదిలీ అయ్యారు. అక్కడ ఒక పార్టీ లో ప్రముఖ బెంగాలీ సినీ నటుడు ఉత్తమ్ కుమార్ దీపికను చూసి, తన చిత్రంలో బాలనటిగా నటించమని అడిగారు. ప్రఖ్యాత రాజశ్రీ ప్రొడక్షన్ ఆమెను 'పేయింగ్ గెస్ట్' సీరియల్ లో పనిచేయమని కోరిన తర్వాత తన జీవితం మారింది.
పాపులర్ సీరియల్ 'పేయింగ్ గెస్ట్'లో పనిచేసిన తర్వాత, దీపిక చిఖ్లియాకు పలు టీవీ సీరియల్‌లలో పనిచేసే ఆఫర్లు వచ్చాయి. దీని తర్వాత ఆమె రామానంద్ సాగర్ సీరియల్ 'విక్రమ్ భేతాళ్'లో నటించింది. భగవాన్ దాదా, చీఖ్, ఖుదై, రాత్ కే అందర్ వంటి సినిమాలలో పనిచేసింది. 1992 సంవత్సరంలో దీపిక బెంగాలీ చిత్రం 'ఆశా ఓ భలో బాషా' .. తమిళ చిత్రం 'నంగల్'లో పనిచేసింది. 2018లో విడుదలైన 'బాలా' అనే చిత్రంలో యామి గౌతమ్ తల్లి పాత్రను దీపిక చిఖాలియా పోషించింది. ఈ చిత్రంలో చాలా చిన్న పాత్రను పోషించింది.
రాజకీయాల్లోను..
దీపిక చిఖాలియా రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1991లో గుజరాత్‌లోని వడోదర స్థానం నుండి లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థిగా పోటీ చేసారు. ఆ లోక్‌సభ ఎన్నికల్లో రాజా రంజిత్ సింగ్ గైక్వాడ్‌ను 50 వేలకు పైగా ఓట్ల తేడాతో ఓడించి గెలిచారు.