'ఛావా' తెలుగు... ఆ ఒక్కటి మైనస్ అయ్యేనా?
విక్కీ కౌశల్ హీరోగా లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో హిందీలో వచ్చిన 'ఛావా' సినిమా బాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది.;
విక్కీ కౌశల్ హీరోగా లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో హిందీలో వచ్చిన 'ఛావా' సినిమా బాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. దాదాపు రూ.700 కోట్ల వసూళ్లను ఛావా సినిమా రాబట్టినట్లు సమాచారం అందుతోంది. లాంగ్ రన్‌లో సినిమా రూ.1000 కోట్లకు మించి వసూళ్లు రాబట్టే అవకాశాలు ఉన్నాయంటూ బాక్సాఫీస్ వర్గాల వారు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. హిందీలో సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న ఛావా సినిమాను తెలుగులో విడుదల చేయాలనే డిమాండ్ ఎక్కువ వచ్చింది. తెలుగు ప్రేక్షకులు ఎంతో మంది ఏవో పిచ్చి సినిమాలు డబ్ చేస్తారు, ఇలాంటి మంచి సినిమాలను ఎందుకు డబ్ చేయరు అంటూ సోషల్ మీడియా ద్వారా ప్రశ్నించారు.
తెలుగులో ఛావా సినిమాకు ఉన్న డిమాండ్ నేపథ్యంలో గీతా ఆర్ట్స్ బ్యానర్ భారీ మొత్తానికి సినిమా డబ్బింగ్ రైట్స్ కొనుగోలు చేసి విడుదలకు సిద్ధం చేస్తుంది. మార్చి 7న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఛావా సినిమా తెలుగులో ఎలా ఉండబోతుంది అనే ఆసక్తి అందరిలోనూ కనిపిస్తుంది. తాజాగా తెలుగు ట్రైలర్ వచ్చింది. ట్రైలర్ అంతా బాగుంది, విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. కానీ శంభాజీ మహారాజ్ పాత్ర పోషించిన విక్కీ కౌశల్ కి డబ్బింగ్ చెప్పింది ఎవర్రా అంటూ విమర్శలు వస్తున్నాయి. మరీ నాసిరకంగా ఆ మెయిన్ లీడ్ వాయిస్ ఉందంటూ ట్రోల్స్ వస్తున్నాయి.
ఛావా సినిమాను తెలుగులో డబ్ చేయాలి, ఎన్టీఆర్ డబ్బింగ్ చెప్పాలని చాలా మంది బలంగా కోరుకున్నారు. కానీ ఛావా సినిమా తెలుగు వర్షన్‌కి ఎన్టీఆర్ వంటి స్టార్‌తో డబ్బింగ్ చెప్పడం సాధ్యం కాదని బన్నీ వాసు అన్నారు. ఇటీవల ఆయన మీడియాతో మాట్లాడుతూ తక్కువ సమయం ఉంది కనుక డబ్బింగ్ ఆర్టిస్టులతో చెప్పించామని, ఈ సమయంలో హీరోలను ఇబ్బంది పెట్టాలి అనుకోలేదు అంటూ చెప్పుకొచ్చాడు. అసలు ఎన్టీఆర్‌తో ఛావా కోసం చర్చలు జరపలేదని ఆయన క్లారిటీ ఇచ్చారు. సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు చూసి తాను షాక్ అయ్యాను అన్నారు.
ఎన్టీఆర్ వాయిస్‌ను ఊహించుకున్న వారు ఛావా తెలుగు ట్రైలర్‌లో విక్కీ కౌశల్‌కి చెప్పిన డబ్బింగ్ విని పెదవి విరుస్తున్నారు. ఇదెక్కడి విడ్డూరం అంటూ చాలా మంది నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు. తెలుగులో ఛావా సినిమా కోసం ఎదురు చూస్తున్న వారు సైతం అబ్బే ఇదేం బాగాలేదు అంటూ ఛావా వాయిస్ పై విమర్శలు చేస్తున్నారు. ఇంతకంటే మంచి వాయిస్, వీరత్వం ఉట్టి పడే వాయిస్ దొరకలేదా అంటూ చాలా మంది చాలా రకాలుగా విమర్శలు చేస్తున్నారు. ట్రైలర్ లో విక్కీ కౌశల్ కి చెప్పిన డబ్బింగ్ ఆర్టిస్ట్ సినిమా మొత్తం చెబితే ఫలితం బెడిసి కొట్టినా ఆశ్చర్యం లేదని కొందరు విశ్లేషిస్తున్నారు. విడుదలకు ఇంకా ఎలాగూ సమయం ఉంది కనుక అల్లు అరవింద్ గారు సెకండ్ ఆప్షన్‌కి వెళ్తారేమో చూడాలి.