వర్మ రేంజ్ సినిమా రాబోతుందా?
కానీ ఆయన మాత్రం ఒక సినిమా షూటింగ్లో ఉన్నాను, ఇప్పుడు తాను పోలీసుల ముందుకు రాబోను అంటూ ప్రకటించాడు.
వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మను ఏపీ పోలీసులు అరెస్ట్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్‌లోని ఆయన ఇంటి వద్దకు పోలీసులు చేరుకుని అరెస్ట్‌కి ప్రయత్నించారు. కానీ ఆయన మాత్రం ఒక సినిమా షూటింగ్లో ఉన్నాను, ఇప్పుడు తాను పోలీసుల ముందుకు రాబోను అంటూ ప్రకటించాడు. ఒక వైపు పోలీసులు అరెస్ట్ చేసేందుకు వెతుకుతూ ఉంటే వర్మ మాత్రం తాపీగా తన ఒక ఇంటర్వ్యూను విడుదల చేయడంతో పాటు, తాను షూటింగ్ కోసం బిజీగా ఉన్నాను, నిర్మాత శ్రేయస్సు కోసం తాను ఇప్పుడు పోలీసులకు చిక్కడం లేదు అంటూ పోలీసులకే కౌంటర్ ఇచ్చాడు.
ఇప్పటికే వర్మ ముందస్తు బెయిల్‌కి ప్రయత్నాలు చేస్తున్నాడు. బెయిల్ వచ్చిన తర్వాత వర్మ బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ విషయం పక్కన పెడితే వర్మ ప్రస్తుతం ఒక సినిమాను తీస్తున్నాడు. వర్మ నుంచి సినిమా అంటే జనాలు ఏదైనా వివాదాస్పదం లేదంటే బూతు సినిమా, ప్రయోగాత్మక సినిమా అనుకుంటున్నారు తప్ప మునుపటి మాదిరిగా కంటెంట్ ఓరియంటెడ్ సినిమాను ఆయన తీస్తాడని ఏ ఒక్కరు అనుకోవడం లేదు. కానీ వర్మ మాత్రం ఇప్పుడు తాను తీస్తున్న సినిమా తన మార్క్ మూవీ అని, అలాగే తన గత సినిమాల మాదిరిగానే ఈ సినిమా ఉంటుంది అని నమ్మకంను వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవల సందీప్ వంగతో కలిసి ఒక స్పెషల్ చిట్ చాట్ చేయడం జరిగింది. ఆ సమయంలో యానిమల్ దర్శకుడు సందీప్ వంగ మాట్లాడుతూ మళ్లీ మీ మార్క్ సినిమాలు ఎప్పుడు వస్తాయి, మీ నుంచి గతంలో మాదిరిగా మంచి సినిమాల కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు అంటూ ప్రశ్నించాడు. అందుకు వర్మ తనదైన శైలిలో సమాధానం చెప్పాడు. సందీప్ మీద ఒట్టేసి చెబుతున్నా ఇప్పుడు ఒక మంచి సినిమా చేసే పనిలో ఉన్నాను అంటూ చెప్పుకొచ్చాడు. వర్మ ఏం చెప్పినా దాన్ని నమ్మడానికి లేదు. ఇప్పుడు వర్మ సినిమా గురించి చెబితే అదే అనిపిస్తుంది.
రామ్ గోపాల్ వర్మ ప్రతి సినిమాలో ఏదో ఒక వివాదాస్పద ఎలిమెంట్ ఉంటుంది. కనుక ఈ సినిమాలోనూ అదే విధంగా వివాదాస్పదం అయినా ఉంటుంది తప్ప మంచి కంటెంట్ ఉంటుందని నమ్మకం లేదని కొందరు అంటూ ఉంటే కొందరు మాత్రం ఈసారి వర్మ నుంచి మంచి సినిమా వస్తుందేమో అనే నమ్మకంను వ్యక్తం చేస్తున్నారు. వర్మ ఈ వివాదాలకు దూరంగా ఉండి మంచి సినిమాలు తీయాలని ఇప్పటికీ ఆయన అభిమానులు కోరుకుంటూనే ఉన్నారు. దేశం మొత్తం తన సినిమాలతో ఒకప్పుడు ఊపు ఊపిన వర్మ మళ్లీ తన మార్క్ సినిమాలు తీస్తాడా అనేది చూడాలి.