డియ‌ర్ సుశాంత్.. ఉద‌య్ కిర‌ణ్‌ని గుర్తు చేశావ్!

Update: 2020-06-15 06:10 GMT
టాలీవుడ్ లో వ‌రుస విజ‌యాల‌తో రైజింగ్ స్టార్ గా వెలిగిపోయిన ఉద‌య్ కిర‌ణ్ కెరీర్ ఉత్తాన‌ప‌త‌నాలు తెలిసిందే. ఉవ్వెత్తున ఎగసిప‌డిన ఒక యువ‌ కెర‌టం ఉన్న‌ట్టుండి కెరీర్ ప‌రంగా తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు. అది అత‌డి మాన‌సిక స్థితిని తీవ్రంగానే ప్ర‌భావితం చేసింది. తిరిగి కెరీర్ బండిని ప‌ట్టాలెక్కించేందుకు ప్ర‌య‌త్నించే క్ర‌మంలో ఉద‌య్ ఎంతో మాన‌సిక వేద‌న‌ను అనుభ‌వించాడు. అటుపై వ్య‌క్తిగ‌త జీవితం ప‌రంగానూ ఉద‌య్ కి పెద్ద ఎదురు దెబ్బ త‌గిలింది. ఒక పెద్దింటి స్టార్ డాట‌ర్ ని పెళ్లాడేంత వ‌ర‌కూ వెళ్లి ఆ పెళ్లి ఆగిపోవ‌డం అత‌డిని మ‌రింత‌గా కుంగుబాటుకు గురి చేసింది. ఆ త‌ర్వాత వేరొక యువ‌తిని పెళ్లాడి.. త‌న‌తో ఆర్థిక‌ప‌ర‌మైన విష‌యాల్లో గొడ‌వ‌లు ప‌డి చివ‌రికి ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు.

అయితే అత‌డు ఆత్మ‌హ‌త్య చేసుకునేంత పిరికివాడు కాడ‌ని ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో ఉదయ్ కిర‌ణ్ సోద‌రి వ్యాఖ్యానించారు. అయితే ఆ ఘ‌ట‌న‌ను విశ్లేషించిన మాన‌సిక వైద్యులు మాత్రం.. ఉద‌య్ కిర‌ణ్ సున్నిత మ‌న‌స్కుడ‌ని.. రిజ‌ర్వ్ డ్ గా ఉండే వ్య‌క్తిత్వం కావ‌డం వ‌ల్ల చాలా వేద‌న అనుభ‌వించాడ‌ని విశ్లేషించారు. పైగా వ‌రుస సంఘ‌ట‌న‌ల‌తో కుంగుబాటుకు గుర‌య్యాక అత‌డికి ధైర్యం చెప్పేవాళ్లు కూడా క‌రువ‌య్యారు. స్నేహితులు.. బంధుమిత్రులు అంద‌రికీ దూరంగా ఉండ‌డం వ‌ల్ల ఒంట‌రి వాడిని అన్న భావ‌న వ‌ల్ల కూడా అత‌డు అంత‌కు తెగించాడ‌న్న విశ్లేష‌ణ సాగింది.

ఇప్పుడు బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సైతం ఇంచుమించు అలాంటి ల‌క్ష‌ణాల్ని క‌లిగి ఉన్నాడు. అయితే కెరీర్ విష‌యంలో ఏ దిగులూ లేదు అత‌డికి. ప్ర‌స్తుతం స్టార్ డ‌మ్ అసాధార‌ణంగా ఉంది. అవ‌కాశాల‌కు కొద‌వేమీ లేదు. ఆర్థిక‌ప‌ర‌మైన ఒత్తిళ్లు కూడా లేవు. అయితే కొంత‌కాలం క్రితం అత‌డి త‌ల్లి మ‌ర‌ణం తీవ్ర‌మైన కుంగుబాటుకు కార‌ణ‌మైంది. కేదార్ నాథ్- చిచ్చోర్ లాంటి హిట్లతో మంచి స్థాయిని అందుకున్నా.. వ్యక్తిగత అంశాలు.. ఎఫైర్ మ్యాట‌ర్స్ అత‌డికి ఊపిరాడ‌నివ్వ‌లేదని మానసిక వైద్యులు విశ్లేషిస్తున్నారు. సున్నిత మనస్కులే కావడమే సుశాంత్.. ఉదయ్ కిరణ్ విషయాల్లో ఒక పోలిక కామన్ ‌గా ఉందని చెబుతున్నారు. ఇద్ద‌రు సున్నిత‌మ‌న‌స్కులు.. మితభాషులు. ఇలాంటి వారు ఒంట‌రిగా ఉంటే చాలా స‌మ‌స్యాత్మ‌క‌మే. క‌నిపెట్టుకుని ఉండాల‌ని కూడా డాక్ట‌ర్లు సెల‌విస్తున్నారు.

సున్నిత మ‌న‌స్కులు ఒంట‌రిత‌నం.. మాన‌సిక వేద‌న క‌లిగి ఉంటే చుట్టూ ఉన్న‌వారే గ‌మ‌నించాల‌ని బంధుమిత్రులు.. సన్నిహితులే వారిని హెచ్చ‌రిస్తూ జాగ్ర‌త్త చెప్పాల‌ని కూడా చెబుతున్నారు. ఉదయ్ కిరణ్.. సుశాంత్ విషయంలో సంత్వ‌న క‌లిగించే వాళ్లు లేక‌నే ఇలా జ‌రిగింద‌ని విశ్లేషిస్తున్నారు. జీవితంలో నైరాశ్యం.. ఏదో కోల్పోయిన‌ట్టు క‌నిపించ‌డం.. భ‌విష్య‌త్ పై బెంగ వంటివి సున్నిత మ‌న‌స్కుల్న తీవ్రంగానే క‌ల‌చివేస్తాయి. వాటిని స్నేహితులే గుర్తించాలి. జాగ్ర‌త్త చెప్పాలి!! అని విశ్లేషిస్తున్నారు వైద్యులు.
Tags:    

Similar News