ఆడియన్స్ ఇచ్చింది హిట్ కాదు .. ధైర్యం

Update: 2021-12-10 08:30 GMT
బాలకృష్ణ కథానాయకుడిగా వచ్చిన 'అఖండ' నిన్న రాత్రి వైజాగ్ లో గ్రాండ్ సక్సెస్ ఈవెంట్ ను జరుపుకుంది. అభిమానుల సమక్షంలో జరిగిన ఈ వేడుకలో బోయపాటి మాట్లాడుతూ .. " ముందుగా ఈ సినిమాను గెలిపించిన ప్రతి ఒక్కరికీ శిరసు వంచి నమస్కరిస్తున్నాను.

ఇప్పటి వరకూ మేము మీడియాకి కూడా ఎక్కువగా వెళ్లలేదు .. ముందుగా ఇక్కడికే రావడం జరిగింది. వైజాగ్ లో ఒక సక్సెస్ మీట్ చేయాలి అని రావడం జరిగింది. మనకి ఏదైనా మంచి జరిగితే మనసులో దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటాము.

మనకి మంచి చేసిన ప్రేక్షకులకు ఎక్కడ చెప్పుకోవాలి? ఈ వేదిక మీద నుంచే చెప్పుకోవాలి. అందుకే ఈ రోజున మేమంతా ఇక్కడికి వచ్చాము. సినిమాలు సక్సెస్ కావడం .. ఇలా వేదికలపైకి రావడం కామన్.

కానీ ఈ రోజున ఈ సక్సెస్ మీట్ చేయడానికి మాత్రం ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. ప్రేక్షకులకు థియేటర్లకు బంధం తెగిపోతోంది .. ప్రేక్షకులు ఇక థియేటర్లకు వస్తారో లేదో తెలియదు. థియేటర్లలో చప్పట్లు .. ఈలలు .. కటౌట్లు .. హారతులు ఉంటాయో లేదో తెలియదు.మంచి సినిమా తీస్తే మళ్లీ మళ్లీ వచ్చి చూస్తామని మీతో అనిపించిన సినిమానే 'అఖండ'.

ఒక సినిమా ఆడితే డబ్బు రావడం వేరు .. డబ్బుతో పాటు ధైర్యం రావడం వేరు. ఈ సినిమాకి మీరు ఇచ్చింది డబ్బు కాదు .. ఇండస్ట్రీకి ధైర్యం ఇచ్చారు. ఎవరైనా ఒక క్యారెక్టర్ చేస్తూ చాలా ఎగ్జైట్మెంట్ అవుతుంటారు. కానీ బాలయ్యగారు చేస్తుంటే ఆ క్యారెక్టర్ ఎగ్జైట్మెంట్ గా ఫీలవుతుంది. మాస్ అంటే అరిచి చెప్పేది కాదు .. మంచి చెప్పి అరిచేలా చేసేదే మాస్.

అలాగే ఈ సినిమాలో ఒక దేవుడి గురించి చెప్పినా .. ఒక ధర్మం గురించి చెప్పినా వాక్ శుద్ధి - ఆత్మశుద్ధి ఉన్నవాళ్లు మాత్రమే చెప్పాలి. ఆ రెండూ ఉన్న పరిపూర్ణమైన వ్యక్తి బాలయ్య గారు.

ఈ సినిమా మీకు నరనరాల్లోకి ఎక్కడానికిగల ప్రధానమైన కారణం ఇదే. బేసిగ్గా హీరో శంఖం పూరిస్తే విలన్ కి వినపడుతుంది. కానీ ఈ సినిమాలో బాలయ్య శంఖం పూరిస్తే ప్రపంచం మొత్తం వినపడింది.

ఈ సినిమా అడుగుపెట్టిన ప్రతి దేశంలోను ప్రభంజనమే .. ప్రతి చోటా నీరాజనాలే. బాలయ్యలాంటి ఒక వ్యక్తితో ఒక సినిమా చేయడమనేదే ఎవరికైనా కల. అలాంటిది నేను మూడు సినిమాలు చేశాను .. ఆ భాగ్యం నాకు దక్కింది. ఫస్టు 'సింహా' చేశాను ఆదరించారు .. 'లెజెండ్' చేశాను నెత్తిమీద పెట్టుకున్నారు. 'అఖండ' చేస్తే గుండెల్లో పెట్టుకున్నారు. అందువలన నేను ఎప్పుడూ మీకు రుణపడే ఉంటాను" అని చెప్పుకొచ్చారు.
Tags:    

Similar News