తెలుగులో 'బ్రహ్మాస్త్రం' పుల్లింగ్ పాయింట్ ఇదే..?

Update: 2022-09-10 04:03 GMT
ఇటీవల కాలంలో ఎక్కువగా వార్తల్లో నిలిచిన మూవీ ''బ్రహ్మాస్త్రం''. అత్యంత భారీ బడ్జెట్ తో స్టార్ క్యాస్టింగ్ తో బాలీవుడ్ లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన సినిమా ఇది. ప్రమోషనల్ కంటెంట్ తో సందడి చేసిన ఈ చిత్రం.. బాయ్ కాట్ ట్రెండ్ ను దాటుకుని మరీ అనూహ్యంలమైన అడ్వాన్స్ బుకింగ్స్ సాధించి అందరినీ ఆశ్చర్య పరిచింది. అయితే భారీ అంచనాల నడుమ నిన్న (సెప్టెంబర్ 9) థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభించింది.

అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ''బ్రహ్మాస్త్రం: శివ'' సినిమా తెరకెక్కింది. ఇందులో రణబీర్ కపూర్ - అలియా భట్ ప్రధాన పాత్రలు పోషించగా.. అమితాబ్ బచ్చన్ - కింగ్ అక్కినేని నాగార్జున - మౌనీ రాయ్ ఇతర కీలక పాత్రలు పోషించారు. బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ స్పెషల్ రోల్ లో కనిపించారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో ఈ సినిమా విడుదలైంది.

సౌత్ లో దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి సమర్పిస్తున్నాడంటే.. ఇందులో ఏదో గొప్ప కంటెంట్ ఉందని ఆడియన్స్ భావించారు. కింగ్ నాగ్ దాదాపు పదహారేళ్ల తర్వాత హిందీలో రీ ఎంట్రీ ఇస్తున్నాడంటే.. సినిమాలో విషయం ఉందని అనుకున్నారు. దీనికి తోడు తెలుగు రాష్ట్రాల్లో అగ్రిసివ్ గా ప్రమోట్ చేయడంతో మంచి బజ్ ఏర్పడింది. కానీ సినిమా చూసిన తర్వాత కంటెంట్ వీక్ - విజువల్స్ పీక్ అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

సకల అస్త్రాలకు అధిపతి బ్రహ్మాస్త్రం.. దాన్ని రక్షించే కొన్ని అద్భుత శక్తులు.. ఆ అస్త్రాన్ని దక్కించుకుని ప్రపంచాన్ని శాసించాలనుకునే దుష్ట శక్తులు. వీటి మధ్య సాగే యుద్ధమే 'బ్రహ్మాస్త్ర' కథ. లైన్ గా బాగున్నా, దీన్ని తెర పై ఆవిష్కరించడంతో దర్శకుడు తడబడ్డాడు. కంటెంట్ మీద కంటే విజువల్ ఎఫెక్ట్స్ మరియు భారీ తనం మీద దృష్టి పెట్టడంతో నేల విడిచి సాము చేసినట్లు అయింది.

కథా కథనాల్లో విషయం లేకుండా కేవలం గ్రాఫిక్స్ మాయాజాలంతో ఆడియన్స్ ను ఆకట్టుకునే ప్రయత్నం చేసినట్లు అనిపిస్తుంది. అసలు ఏం కథ చెబుతున్నారో.. ప్రధాన పాత్రల ఉద్దేశ్యం ఏంటో ప్రేక్షకులకు అర్థం కాలేదు. ఏ దశలోనూ ఎమోషనల్ కనెక్ట్ అనేది ఏర్పడలేదు. భారీ యాక్షన్ మరియు అద్భుతమైన వీఎఫ్ఎక్స్ మాత్రం ఆకట్టుకుంటున్నాయి.

'బ్రహ్మాస్త్ర' చుట్టూ నెలకొన్న హైప్ కారణంగా ఫస్ట్ డే భారీ ఓపెనింగ్స్ ఖాయమని తెలుస్తోంది. కాకపోతే రెండో రోజు నుంచే కష్టమని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. మిగతా భాషల సంగతేమో కానీ.. ఈ వీకెండ్ లో ఆశించిన మేర వసూళ్ళు రాబట్టడం సందేహమే అని అంటున్నారు. మొదటి నుంచీ 'బ్రహ్మాస్త్ర' లో తెలుగు ఆడియన్స్ ను ఆకర్షించిన అంశాలు నాగార్జున - అలియా భట్.

హిందీలో గతంలో పది సినిమాల్లో నటించిన నాగ్.. చాలా గ్యాప్ తర్వాత బాలీవుడ్ లో తిరిగి అడుగుపెట్టారు. ఇందులో నంది అస్త్రగా కనిపించారు. సినిమాపై విమర్శలు, లోపాలను పక్కన పెడితే.. కింగ్ తెరపై కనిపించినప్పుడల్లా.. తన శక్తిని ప్రయోగించినప్పుడల్లా థియేటర్‌లో మాస్ రెస్పాన్స్ కనిపిస్తోంది. కానీ ఆయన లుక్స్ సాధారణంగా అనిపిస్తుంది.. పాత్ర నిడివి కూడా తక్కువే ఉంది.

ఇక 'ఆర్.ఆర్.ఆర్' సినిమాలో సీత గా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న అలియా భట్.. ఇప్పుడు 'బ్రహ్మాస్త్రం' లో ఈషా గా కనిపించింది. ఆమె తన పాత్రలో ఒదిగిపోయి నటించింది. తన రియల్ లైఫ్ పార్ట్నర్ రణబీర్ తో మంచి కెమిస్ట్రీ పంచుకుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకి పుల్లింగ్ పాయింట్ అలియా అనే చెప్పాలి. కాకపోతే అది కూడా ఈ వారాంతం మాత్రమే ఉంటుందని అనుకోవాలి.

మొదటి రోజు మాత్రం 'బ్రహ్మాస్త్ర' మూవీ భారీ ఓపెనింగ్స్ నమోదు చేసింది. సినిమా బడ్జెట్ ని బట్టి చూస్తే లాంగ్ రన్ లోనూ అదే విధంగా పెర్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది. కానీ మిక్డ్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద ఏ మేరకు కలెక్షన్స్ రాబడుతుందనేది వేచి చూడాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News