ఆర్టిస్టు ఆరోప‌ణ‌..సెలెక్ట‌య్యాక మోకాల‌డ్డే బ్రోక‌రీ!

Update: 2019-09-29 02:30 GMT
ప్ర‌తి చోటా ద‌ళారీ వ్య‌వ‌స్థ‌ లేనిదే ప‌న‌వ్వ‌ని ప‌రిస్థితి. అది క‌ళారంగంలో మ‌రీ ఎక్కువ అన్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి. మీడియేట‌ర్ ఎవ‌రో ఒక‌రు లేనిదే ఇక్క‌డ‌ ప‌న‌వ్వ‌ని ప‌రిస్థితి. ముఖ్యంగా ఆర్టిస్టుల‌కు ఈ స‌మ‌స్య మ‌రీ తీవ్రంగా ఉంద‌ని తెలుస్తోంది. టాలీవుడ్ లో అవ‌కాశాలు కావాలంటే కోఆర్డినేట‌ర్ల‌పై ఆధార‌ప‌డాల్సిందే. కోఆర్డినేట‌ర్లు లేదా ఈ ద‌ళారీ వ్య‌వ‌స్థ గుప్పిట్లోనే ఆర్టిస్టు న‌లిగిపోతున్నార‌న్న‌ది చాలా మంది వెత‌ల్ని ప‌రిశీలిస్తే అర్థ‌మ‌వుతోంది. ఇక్క‌డ అవ‌కాశం పేరుతో ఆర్టిస్టుకు వ‌చ్చే పారితోషికంలో 30-50 శాతం వ‌ర‌కూ గుంజుకునే ద‌ళారీలు ఉన్నార‌న్న‌ది చాలామంది  ఫిర్యాదు చేస్తున్నారు. కొంద‌రు కోఆర్డినేట‌ర్లు అయితే కొత్త వాళ్ల విష‌యంలో చేసే మోసాల‌కు హ‌ద్దు అన్న‌దే లేద‌ని ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవ‌ల ఓ ఆర్టిస్టుల‌ వాట్సాప్ గ్రూప్ లో ఓ న‌టుడి ఆవేద‌నను బ‌ట్టి ఇది బ‌హిర్గ‌త‌మైంది.

టాలీవుడ్ లో ఎన్నో భారీ చిత్రాలు సెట్స్ పై ఉన్నాయి. కానీ ఎక్క‌డా స‌రైన అవ‌కాశాలు రావడం లేద‌ని టీఎంటీఏయూ సంఘానికి చెందిన ఓ ఆర్టిస్టు ఆరోపించ‌డం చ‌ర్చ‌కొచ్చింది. ప్ర‌స్తుతం ఎన్నో సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. ఎంపిక‌య్యావ్ అని మెసేజ్ వ‌చ్చాక కూడా చివ‌రికి అవ‌కాశం ద‌క్క‌డం లేదు అంటూ స‌ద‌రు ఆర్టిస్టు ఆవేద‌న చెంద‌డం క‌నిపించింది. నంద‌మూరి బాల‌కృష్ణ‌.. రామ్ గోపాల్ వ‌ర్మ .. నితిన్ .. సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. ఆర్.ఆర్.ఆర్ లాంటి భారీ చిత్రం సెట్స్ పై ఉంది. అన్నీ షూటింగులు న‌డుస్తున్నాయి. చాలా సినిమాలొస్తున్నాయి.

ఆడిష‌న్స్ కి వెళితే.. మీరు సెలెక్ట్ అయ్యారు అన్న మెసేజ్ వ‌స్తోంది. అలా వ‌చ్చాక కూడా మ‌మ్మ‌ల్ని క్యాన్సిల్ చేసి అసోసియేష‌న్ల‌తో సంబంధం లేని మామూలు ఆర్టిస్టుల్ని పెట్టుకుంటున్నారు. దీనిపై చ‌ర్య‌లు తీసుకోవ‌డానికి ఏమైనా చేస్తున్నారా?   అసోసియేష‌న్ ఆర్టిస్టుల‌కు స‌రైన అవ‌కాశాలు దక్కేందుకు ప‌రిష్కారం లేదా? అంటూ వాపోవ‌డం క‌నిపిస్తోంది. ఈసీ మీటింగులు ఎప్పుడో పెట్టుకుని వ‌దిలేస్తే స‌రిపోదని స‌ద‌రు ఆర్టిస్టు ఆరోపిస్తున్నారు. ఇటు మూవీ ఆర్టిస్టుల సంఘం (మా)లో స‌భ్యుల‌కు కూడా ఇదే పరిస్థితి. అసోసియేష‌న్ల‌లో ఉన్నంత మాత్రాన అవ‌కాశాలు ఇస్తారనే రూల్ ఏమీ లేదు. మెంబ‌ర్ అని చెప్పుకోవ‌డం వ‌ర‌కే. హెల్త్ కార్డులు మాత్రం వ‌స్తుంటాయి. మ‌ధ్య‌లో ద‌ళారీ వ్య‌వ‌స్థ‌ను దాటుకుని వెళ్ల‌గ‌లిగితేనే ఛాన్సులుంటాయి ఇక్క‌డ అన్నది స్ప‌ష్టం అవుతోంది. అయితే  పాపుల‌ర్ న‌టుల‌కు ఇలాంటి దుస్థితి పెద్ద‌గా ఉండ‌క‌పోవ‌చ్చు కానీ ద్వితీయ శ్రేణి న‌టీన‌టుల‌కు.. జూనియ‌ర్ ఆర్టిస్టుల‌కు ఈ పాట్లు మాత్రం త‌ప్ప‌దు.


Tags:    

Similar News