దిల్ రాజు గ్యాంగ్ కి పెద్ద దెబ్బ!

Update: 2019-07-27 11:30 GMT
తెలుగు ఫిలిం ఛాంబ‌ర్ ఎన్నిక‌లు ముగిసి తాజాగా ఫ‌లితం వెలువ‌డింది. ఈసారి ఎన్నిక‌ల్లో సి.క‌ళ్యాణ్ అధినాయ‌క‌త్వం వ‌హించిన `మ‌న ప్యానెల్` దిల్ రాజు `యాక్టివ్ ప్యానెల్`పై ఘ‌న‌విజ‌యం సాధించింది.  20 మంది సెక్టార్ మెంబర్స్‌ లో 16 మంది `మన ప్యానల్‌` నుంచి గెల‌వ‌గా.. నలుగురు `యాక్టివ్ ప్యానల్` నుంచి గెలుపొందారు. 12 మంది ఈసీ స‌భ్యుల్ని ఎన్నుకోవాల్సి ఉండగా 9 మంది సీ కల్యాణ్ నేతృత్వంలోని మన ప్యానెల్ నుంచి గెలుపొందారు. దిల్ రాజు సారధ్యంలోని యాక్టివ్ ప్యానల్ నుంచి ఇద్ద‌రు విజయం సాధించారు.  దిల్ రాజు - దామోదర ప్రసాద్‌ లు ఈసీ సభ్యులుగా గెలుపొందారు. నిర్మాత‌ మోహన్‌ గౌడ్‌ ఇండిపెండెంట్‌ గా పోటీ చేసి గెలుపందుకున్నారు.

ఈ ఎన్నిక‌ల్లో చిన్న నిర్మాత‌ల పెద్ద అండ‌తో సి.క‌ళ్యాణ్ మ‌న ప్యానెల్ గెలుపొందింది. త‌న ఈసీ స‌భ్యుల్ని గెలిపించుకోవ‌డంలో ఆయ‌న స‌ఫ‌లం అవ్వ‌డం వెన‌క కార‌ణ‌మిదే. 2019-21 సీజ‌న్ కి ఫిలింఛాంబ‌ర్ బాడీని ఈ ఎన్నిక‌లు డిసైడ్ చేశాయి. ఫిలింఛాంబ‌ర్ అంటే.. నిర్మాతలు- స్టూడియో యజమానులు- డిస్ట్రిబ్యూటర్లు- ఎగ్జిబిటర్లు ఇందులో భాగ‌స్వాములు. నాలుగు విభాగాల నుంచి ప్ర‌తి రెండేళ్ల కోసారి అధ్య‌క్షుడిని ఏక‌గ్రీవంగా ఎన్నుకుంటారు. ఈసారి ఫిలింఛాంబ‌ర్ అధ్య‌క్షులుగా `ఎగ్జిబిటర్స్‌` విభాగం నుంచి నారాయణ దాస్‌ నారంగ్‌ ను ఫిలిం చాంబర్‌ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

నేటి ఉద‌యం 8 గం.ల నుంచి తెలుగు ఫిలింఛాంబ‌ర్ వ‌ద్ద ఎల‌క్ష‌న్ హ‌డావుడి నెల‌కొంది. ఎన్నిక‌ల్లో ఎవ‌రికి వారు గెలుపుపై ధీమాని క‌న‌బ‌రిచారు. పేద‌ల ప్యానెల్ మ‌న ప్యానెల్ త‌ప్ప‌క గెలుస్తుంద‌ని చెప్పిన‌ సి.క‌ళ్యాణ్ అందుకు త‌గ్గ‌ట్టే గెలుపు గుర్ర‌మెక్కారు. అయితే ఒంటి గంట‌కు ఏదో ఒక‌టి తేలుస్తామ‌ని స‌వాల్ చేసిన దిల్ రాజు మాత్రం ఈ ఎన్నిక‌ల్లో తాను గెలిచినా ప్యానెల్ ని గెలిపించుకోలేక‌పోయారు.

చాంబ‌ర్ ఎన్నిక‌ల్లో 1438 మంది సభ్యులు ఓట్లు వేశారు. ఓటింగ్ స‌మ‌యంలో ఇరు ప్యానెళ్ల సభ్యుల మ‌ధ్య చిన్న‌పాటి వాగ్వాదం జ‌రిగింది. అయితే ప్రసన్నకుమార్.. నట్టికుమార్ వంటి ప్ర‌ముఖులు స‌ర్ధి చెప్ప‌డంతో వివాదం స‌ద్ధుమ‌ణిగింది. ఈ ఎన్నిక‌ల్లో తుమ్మల ప్రసన్నకుమార్‌- వై.వి.ఎస్‌.చౌదరి- పల్లి కేశవరావు- నట్టి కుమార్‌- మోహన్‌ వడ్లపట్ల- ఎం. శివకుమార్‌- తుమ్మలపల్లి రామసత్యనారాయణ- జె.పుల్లారావు- వి.సాగర్‌- డి.రమేశ్‌ బాబు- సి.ఎన్‌.రావు తదితరులు పోటీ చేసారు. యాక్టివ్‌ ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌ తరఫున దిల్‌ రాజు- డీవీవీ దానయ్య- కొర్రపాటి సాయి- వై. రవిశంకర్‌- శివలెంక కృష్ణ ప్రసాద్‌- భోగవల్లి ప్రసాద్‌- దామోదరప్రసాద్‌- ఆచంట గోపీనాథ్‌- సూర్యదేవర నాగవంశీ- బెక్కెం వేణుగోపాల్‌- కె.కె. రాధామోహన్ పోటీప‌డ్డారు. ఒంటి గంట‌కు పోలింగ్ ముగిసింది. 4 గంట‌ల‌కు రిజల్ట్ వెలువ‌డింది.


Tags:    

Similar News