అసిఫా కోసం తారల గళం

Update: 2018-04-14 07:09 GMT
ముక్కుపచ్చలారని ఎనిమిదేళ్ళ చిన్నారి అసిఫా పై అతి దారుణంగా జరిగిన మానభంగం హత్య దేశ వ్యాప్తంగా తీవ్ర నిరసనలకు కారణం అవుతోంది. ఎంతటి బండరాయికైనా హృదయం ద్రవించేలా సామూహికంగా ఆ బాలిక శీలాన్ని దోచుకున్న తీరు చూసి బాలీవుడ్ తారాలోకం మొత్తం తల్లడిల్లుతోంది. ఇప్పటికే పలువురు ట్విట్టర్ ద్వారా తమ ఆవేదనను పంచుకోగా కొందరు వినూత్నంగా పెద్ద అక్షరాలతో రాసిన ప్ల కార్డ్స్ పట్టుకుని ఫోటోల ద్వారా నిరసన వ్యక్తం చేస్తున్నారు. అందులో నేను భారతీయురాలిని-నేను సిగ్గు పడుతున్నాను-8 ఏళ్ళ పసిమొగ్గపై గ్యాంగ్ రేప్ చేసారు-న్యాయం కావాలి-కతువా దేవిస్తాన్ గుడిలో ఈ దారుణానికి తెగబడి పాపను హత్య చేసారు అంటూ అందులో రాసి దాన్ని తమ చేతులతో పట్టుకుని మరొకరిని కూడా ఇలాగే చేయమని వైరల్ చేస్తున్నారు.

ఇలా సంఘీభావం ప్రకటించడం బాగానే ఉంది కాని తమకున్న పాపులారిటీ పలుకుబడిని మరోరకంగా ఉపయోగించి న్యాయం అందేలా త్వరగా చర్యలు తీసుకునేలా ఒత్తిడి చేయిస్తే బాగుంటుందని నెటిజెన్లు అభిప్రాయపడుతున్నారు. సినిమా ప్రమోషన్ కు చేసినట్టు ఇలా కార్డు పట్టుకుని ఫోటోలు షేర్ చేసినంత మాత్రాన న్యాయం జరగదని ఇంకో అడుగు ముందుకు  వెళ్లి తీవ్ర స్వరంతో పోరాడాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. ఇలా షేర్ చేసిన వాళ్ళలో రాధికా ఆప్టే-సోనం కపూర్-నేహా ధూపియా-హుమా ఖురేషి-స్వర భాస్కర్-గుల్ పనాంగ్ లాంటి తారలు ఉన్నారు. కొందరు హీరోలు కూడా ఈ క్యాంపెయిన్ కు మద్దతుగా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అసిఫా గురించి ఎవరు మాట్లాడిన గుండె బరువెక్కిన స్పందనే వస్తోంది. పవిత్రమైన దేవి గుళ్ళో ఈ దుర్మార్గానికి పాల్పడిన వాళ్ళకు కఠిన శిక్ష పడే దాకా ఇది కొనసాగిస్తామని స్టార్స్ అంటున్నారు.
Tags:    

Similar News