'మ‌హ‌ర్షి' సెట్‌ లో కార్పెంట‌ర్ కు ప్ర‌మాదం!

Update: 2019-03-14 04:31 GMT
`ఎఫ్‌2` సినిమాతో ఈ ఏడాది భారీ విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకున్న దిల్ రాజు అదే జోరుతో వ‌రుస చిత్రాలు నిర్మిస్తున్నారు. అశ్వ‌నీద‌త్‌ - పీవీపీల‌తో క‌లిసి `మ‌హ‌ర్షి` చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా కోసం అన్న‌పూర్ణ సెవెన్ ఎక‌ర్స్‌ లో రెండు పాట‌ల కోసం భారీ సెట్‌ ను నిర్మిస్తున్నారు. దీని కోసం భారీగా వ‌ర్క్ జ‌రుగుతోంది. ఈ షెడ్యూల్ పూర్త‌యిన త‌రువాత చిత్ర బృందం అబుదాబి ప‌య‌నం కానుంది. అయితే ఇంత‌లోనే ఓ అప‌శృతి. ఈ సినిమాకు సంబంధించి సెట్‌లో దుర‌దృష్ట వ‌శాత్తు ప్ర‌మాదం చోటు చేసుకుంది. సెట్ ఎర‌క్ష‌న్ లో జ‌రిగిన ప్ర‌మాదం వ‌ల్ల ఓ కార్మికుడు ప్ర‌మాద వ‌శాత్తు చ‌నిపోవ‌డం క‌ల‌క‌లం రేపుతోంది.

ఈ సినిమా సెట్ వ‌ర్క్ కోసం కృష్ణాన‌గ‌ర్‌ కు చెందిన కార్పెంట‌ర్ కృష్ణారావు ప‌నిచేస్తున్నాడు. గ‌త కొంత కాలంగా అత‌ను ప‌లు సినిమాల సెట్టింగ్ వ‌ర్క్‌ లో భాగం పంచుకుంటున్నాడు. బుధ‌వారం య‌థావిధిగా ప‌నుల్లో నిమ‌గ్న‌మైన కృష్ణారావు సెట్ కోసం మెషీన్‌ తో చెక్క‌లు క‌ట్ చేస్తున్నాడు. ఇదే స‌మ‌యంలో అత‌నికి షాక్ త‌గ‌ల‌డంతో వెంట‌నే అప‌స్మార‌క స్థితిలోకి వెళ్లిపోయాడు. విష‌యం గ్ర‌హించిన స‌హ ప‌నివారు హుటా హుటిన అత‌న్ని స‌మీప ఆసుప‌త్రికి త‌ర‌లించారు. అయితే అప్ప‌టికే కృష్ణారావు మ‌ర‌ణించిన‌ట్టు గా డాక్ట‌ర్లు తేల్చి చెప్పేయ‌డంతో కృష్ణారావు కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. అత‌ని కుటుంబానికి దిల్‌ రాజు ఆర్థిక స‌హాయం చేయాలని కార్మికులు ఆందోళ‌న‌కు దిగ‌డంతో జూబ్లీహిల్స్ పోలీసులు కేసు ఫైల్ చేశారు.

సినిమాల షూటింగుల వేళ ఇలాంటి కొన్ని చెదురుముదురు ఘ‌ట‌న‌లు నిర్మాత‌ల‌కు ఇబ్బందిక‌ర‌మే. చాలా సంద‌ర్భాల్లో బాధిత కుటుంబాల‌కు ఆర్థిక సాయం చేసి ఆదుకున్న సంద‌ర్భాలున్నాయి. స‌మ‌స్య‌ను సామ‌ర‌స్యంగా ప‌రిష్క‌రించుకుంటార‌నే భావిస్తున్నారంతా. కార్మికుల‌కు ఏ స‌మ‌స్య వ‌చ్చినా త‌మ స‌భ్యుల విష‌యంలో ఫెడ‌రేష‌న్ బాధ్య‌త తీసుకుంటుంది. సంఘానికి చెంద‌ని కార్మికుల విష‌యంలో ఎవ‌రూ ఏ బాధ్య‌తా తీసుకోరు.
Tags:    

Similar News