ప్ర‌ముఖ హాస్య‌న‌టుడ్ని అరెస్ట్ చేయ‌నున్నారా?

Update: 2017-10-11 05:35 GMT
త‌మిళ.. తెలుగు సినీ ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచితుడు.. ప్ర‌ముఖ హాస్య‌న‌టుడు క‌మ్ క‌థానాయ‌కుడు సంతానంపై  తాజాగా కేసు న‌మోదైంది. హ‌త్యా బెదిరింపుల కేసును ఆయ‌న‌పై న‌మోదు చేసిన‌ట్లుగా చెబుతున్నారు. ఒక కాంట్రాక్ట‌రుతో క‌లిసి ఒక క‌ల్యాణ మండ‌పాన్ని నిర్మించే విష‌యంలో ఇరువురి మ‌ధ్య జ‌రిగిన లొల్లి పుణ్య‌మా అని.. సంతానం మీద కేసు ఫైల్ అయిన‌ట్లుగా తెలిసింది.

త‌న‌పై కేసు న‌మోదు కావ‌టంతో సంతానం అండ‌ర్ గ్రౌండ్‌కి వెళ్లిన‌ట్లుగా చెబుతున్నారు. ఇంత‌కీ.. హ‌త్యా బెదిరింపుల వ‌ర‌కూ విష‌యం వెళ్లాల్సిన అవ‌స‌రం సంతానానికి ఎందుకు ఎదురైంది? ఆయ‌న ఎందుకు అండ‌ర్ గ్రౌండ్‌కి వెళ్లాడ‌న్నది  చూస్తే..

త‌మిళ హాస్య న‌టుడిగా భారీ పాపులార్టీ ఉన్న సంతానం ఈ మ‌ధ్య‌నే హీరోగా న‌టిస్తూ ఆద‌ర‌ణ పొందుతున్నారు. ఇలాంటి వేళ‌.. ఒక భారీ క‌ల్యాణ మండ‌పాన్ని నిర్మించాల‌న్న ఆలోచ‌న‌కు వ‌చ్చారు సంతానం. కుండ్ర‌త్తూర్ స‌మీపంలోని కోవూర్ ప్రాంతంలో భారీ క‌ల్యాణ మండ‌పాన్ని నిర్మించాల‌ని నిర్ణ‌యించారు. తాను క‌ట్టాల‌నుకున్న క‌ల్యాణ మండ‌పాన్ని నిర్మించేందుకు చెన్నై వ‌ల‌స‌ర‌వాక్కం.. చౌద‌రిన‌గ‌రానికి చెందిన కాంట్రాక్ట‌ర్ ష‌ణ్ముగ సుంద‌రంతో క‌లిసి ఒప్పందం చేసుకున్నారు. ఇందుకు త‌గ్గ‌ట్లే భారీ మొత్తాన్ని అడ్వాన్స్ గా కాంట్రాక్ట‌ర్ ష‌ణ్ముగ‌సుంద‌రానికి ఇచ్చారు.

ఇంత‌వ‌ర‌కూ క‌థ బాగానే న‌డిచినా ఇక్క‌డే తేడా వ‌చ్చింది. క‌ల్యాణ మండ‌పం నిర్మాణాన్ని ఆపేయాల‌న్న నిర్ణ‌యాన్ని తీసుకున్న సంతానం.. తాను అడ్వాన్స్ గా ఇచ్చిన మొత్తాన్ని తిరిగి ఇచ్చేయాలని కోరారు. దీనికి కాంట్రాక్ట‌రు స‌సేమిరా అన్న‌ట్లుగా చెబుతున్నారు. ఈ విష‌యంపై ఇరువురి మ‌ధ్య వాగ్వాదం జ‌రిగిన‌ట్లుగా చెబుతున్నారు. మాటా మాటా అనుకోవ‌ట‌మే కాదు కోట్లాట వ‌ర‌కూ విష‌యం వెళ్లిన‌ట్లుగా తెలుస్తోంది.

ఇదిలా ఉంటే.. ఈ ఇష్యూలోకి బీజేపీకి చెందిన నేత క‌మ్ న్యాయ‌వాది ప్రేమానంద్ కూడా ఎంట్రీ ఇవ్వ‌టం ఇష్యూ మ‌రింత పెద్ద‌ది కావ‌టానికి దారి తీసింది. తాను ముంద‌స్తుగా చెల్లించిన మొత్తాన్ని తిరిగి చెల్లించాల్సిందిగా సంతానం ఒత్తిడి చేస్తుంటే.. కాంట్రాక్ట‌ర్ త‌ర‌ఫున బీజేపీ నేత క‌మ్ లాయ‌ర్ రావ‌టం.. ఇరువురి మ‌ధ్యా మాటా మాటా అనుకొని చివ‌ర‌కూ కొట్లాట వ‌ర‌కూ వెళ్లిన‌ట్లుగా తెలుస్తోంది. ఈ గొడ‌వ‌లో లాయ‌ర్ కు దెబ్బ‌లు తగిలాయ‌ని.. చికిత్స కోసం ఆసుప‌త్రికి వెళ్లిన‌ట్లుగా చెబుతున్నారు.

దీంతో.. సంతానానికి వ్య‌తిరేకంగా బీజేపీ నేత‌లు ఆందోళ‌న‌కు దిగారు.ఈ ర‌చ్చ‌కు సంబంధించి  వ‌ల‌స‌ర‌వాక్కం పోలీస్ స్టేష‌న్లో కేసు న‌మోదు చేశారు. ఈ విష‌యం మీద సంతానం వాద‌న‌ను తెలుసుకునేందుకు ఆయ‌న కోసం పోలీసులు ప్ర‌య‌త్నించ‌గా.. అండ‌ర్ గ్రౌండ్‌ కి వెళ్లిన‌ట్లుగా చెబుతున్నారు. మ‌రోవైపు సంతానాన్ని అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లుగా స‌మాచారం. సంతానం బ‌య‌ట‌కు వ‌చ్చి.. అస‌లేం జ‌రిగింద‌న్నది చెబితే.. ఈ ఇష్యూపై మ‌రింత క్లారిటీ  వ‌స్తుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News