‘క్యాలీఫ్లవర్’ కొత్త పోస్టర్: శ్రీకృష్ణుడి అవతారంలో బర్నింగ్ స్టార్‌..!

Update: 2021-06-25 08:30 GMT
‘హృదయ కాలేయం’ సినిమాతో హీరోగా పరిచయమైన సంపూర్ణేష్ బాబు.. టాలీవుడ్ బర్నింగ్ స్టార్‌ గా తనకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఏర్పరుచుకున్నారు. 'కొబ్బరిమట్ట' సినిమాతో మంచి విజయం అందుకున్న సంపూ.. వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలో ఇటీవలే ''క్యాలీఫ్లవర్'' అనే అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ చిత్రాన్ని ప్రకటించారు. ‘శీలో రక్షతి రక్షిత:’ అనేది దీనికి ఉపశీర్షిక.

సంపూర్ణేష్ బాబు బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన 'క్యాలీఫ్లవర్' ఫస్ట్ లుక్ పోస్టర్ విశేష స్పందన తెచ్చుకుంది. గుర్రం మీద వచ్చిన ఇంగ్లీష్ దొరబాబు గెటప్ లో అలరించాడు. ఇందులో భారతీయ మహిళల గురించి ప్రపంచానికి చాటిచెప్పడానికి ఇంగ్లాండ్ నుండి ఇండియాకి వచ్చే ఒక ఇంగ్లిష్ మ్యాన్ గా సంపూ నటించాడు. అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు రెడీ అవుతోందని మేకర్స్ ప్రకటించారు.

ఈ సందర్భంగా 'క్యాలీఫ్లవర్' నుంచి మరో కొత్త పోస్టర్‌ ను చిత్ర బృందం విడుదల చేశారు. సంపూర్ణేష్ బాబు ఈ పోస్టర్ లో శ్రీ కృష్ణుడి అవతారంలో కనిపిస్తాడు. అయితే ఇందులో సంపూ ఆకాశంలోకి విల్లు ఎక్కుపెట్టి చిరునవ్వులు చిందిస్తూ కనిపిస్తుండటం గమనార్హం. ఈ చిత్రానికి ఆర్.కె. మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. దీనికి గోపి కిరణ్ స్టోరీ అందించారు. శ్రీధర్ గుడూరు సమర్పణలో మధుసూధన క్రియేషన్స్ మరియు రాధాకృష్ణ టాకీస్ పతాకాలపై ఈ సినిమా రూపొందుతోంది. ఆశాజ్యోతి గోగినేని నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

'క్యాలీఫ్లవర్' చిత్రంలో సంపూర్నేష్ బాబు సరసన వాసంతి హీరోయిన్ గా నటిస్తోంది. పోసాని కృష్ణ మురళి - పృథ్వీ - నాగ మహేష్ - గెటప్ శ్రీను - రోహిణి - కాదంబరి కిరణ్ - కల్లు కృష్ణారావు - విజయ్ - కళ్యాణి - సుమన్ మన్వాడ్ - ముస్కాన్ - బేబీ సహ్రుదా - రామన్ దీప్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రజ్వల్ క్రిష్ సంగీతం సమకూరుస్తుండగా.. ముజీర్ మాలిక్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. బాబు ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు.
Tags:    

Similar News